శనివారం హనుమంతుడిని ఎందుకు పూజించాలి? శని బాధలు తొలగించే శనివార వ్రతం విశిష్టత ఇదే!
మంగళవారమే కాదు శనివారం కూడా ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు- పురాణాలు ప్రకారం శనివారం హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం

Published : July 21, 2026 at 3:32 AM IST
Saturday Hanuman Puja Significance: హనుమంతుడు శనివారం నాడు జన్మించాడట. అందుకే ఆ రోజు హనుమంతుని భక్తులు ఆంజనేయునికి విశేషంగా పూజలు చేస్తారు. పురాణాలు కూడా హనుమంతుని శనివారం పూజించమని బోధిస్తున్నాయి. సాధారణంగా మనం హనుమంతుడిని మంగళవారం పూజిస్తాం. కానీ ఆంజనేయుడికి శనివారం చాలా ఇష్టమైన రోజట! ఈ కథనంలో శనివారం హనుమను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు పొందవచ్చో చూద్దాం.
"సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః" అని సుందరకాండలో వివరించి ఉంది. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడని వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో వివరించి ఉంది. శనివారం హనుమను పూజించడం వలన కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయని విశ్వాసం. మరి కొన్ని విశేష తిథులు, శనివారం కలిసి వచ్చిన రోజున హనుమను సేవించడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో చూద్దాం.
ఈ తిథులతో శనివారం కూడివస్తే విశేషం
శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారం రోజు హనుమంతుని దర్శించి, రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. అలాగే తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా తైలం, గంధం, సింధూరాలతో హనుమకు అభిషేకం చేస్తే ఆ స్వామికి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుంచి విముక్తి కలిగి బుద్ధి బలం పెరుగుతుంది. శత్రు జయం కలిగి మిత్ర సమృద్ధి పెరిగి, యశో వంతులైన పుత్రులు కలుగుతారు. హనుమంతుని పూజించడం వల్ల మనోధైర్యం పెరిగి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు.
శనివారం వ్రతం
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో ఏ మాసంలోనైనా, అలాగే కార్తిక శుద్ధ ద్వాదశి నాడు హనుమ అనుగ్రహం కోసం శనివార వ్రతం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుని ప్రీతికోసం ఆచరించే ఈ శనివారం వ్రతం ఎలా చేయాలో చూద్దాం.
శనివార వ్రత విధానం:
శనివారం విశేష తిథులతో కూడి ఉన్న రోజున సూర్యోదయంతో నిద్రలేచి, స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో పవిత్ర జలాలు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. ఈ అభిషేకాన్ని కుల మత, వయో లింగ భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు. ఒక మండలం అంటే నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలలో వివరించి ఉంది.
హనుమలో ప్రవేశించిన శని
హనుమంతుని ప్రీతి కోసం చేసే శనివార వ్రతానికి మరొక కారణం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శనీశ్వరుడు అధర్మ మార్గంలో పయనించే వారి పట్ల ఎంత క్రూర స్వభావుడో ధర్మాచరణ పరాయణులు పట్ల అంతటి సౌమ్య స్వభావం కలిగిన వాడు. ఒకసారి శనీశ్వరుడు హనుమంతుని సమీపించి "మారుతీ! నేను శనిని, ఎందరినో పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు." అని అన్నాడంట! అప్పుడు హనుమ “శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?” అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని పెట్టుకున్నాడు హనుమంతుడు.
శనిదేవుని పరీక్షించిన హనుమ
ఆంజనేయుడికి శనీశ్వరుడిని బాధించాలని మనసులో కోరిక మెదిలింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి శిరసు మీద పెట్టుకున్నాడు. శనీశ్వరుడు ఆ భారం తట్టుకోలేని బరువు దించమని హనుమంతుడిని ప్రాధేయపడ్డాడు. కరుణించిన హనుమంతుడు పర్వతాన్ని విసిరేసి శనీశ్వరుడిని తోకకు చుట్టుకుని ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని ఉక్కిరి బిక్కిరయ్యారు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ, ఏడుస్తూ హనుమను ప్రార్ధించాడు. అప్పుడు శని హనుమను స్తుతిస్తూ కొన్ని గొప్ప స్తోత్రాలు చేసాడు.
శనిదేవుని శాసించిన హనుమ
శని స్తోత్రాలకు ఆంజనేయుడు సంతోషించి "మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని
ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజలాడి పోతున్నావే?" అనిప్రశ్నించాడు.
"ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకే నిన్ను ఒక రకంగా
శాసించి వదిలి పెడతాను, సమ్మతమేనా?" అని అడిగాడు హనుమంతుడు. గత్యంతరం లేని శనీశ్వరుడు సరేనన్నాడు. హనుమంతుడు “శనీశ్వరా! నువ్వు నా భక్తులను బాధించ కూడదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణ చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించిన వారిని, నాకు అభిషేకం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్నుదండిస్తాను” అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలి పెట్టాడు. ఆనాటి నుంచి శనివారం హనుమను దర్శించినా, పూజించిన ఎలాంటి శని బాధలు ఉండవని అంటారు. అందుకే హనుమ పూజకు శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అందుకే హనుమాన్ భక్తులు వారంలో శనివారం ఒకరోజైనా హనుమంతుడి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే శనీశ్వరుడు పీడించకుండా ఉంటాడు. భక్తులు మండల పూజలు చేస్తే అసలు శనీశ్వరుడు దరిచేరడు. అందుకే హనుమ పూజకు శనివారం శ్రేష్టమైనది.
శ్రీ ఆంజనేయం శిరసా నమామి! జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
హనుమకు శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడా? పిశాచ రూపంలో 'హనుమద్ భాష్యం' రచించిన ఆశ్చర్యకర గాథ!
ఆజన్మ బ్రహ్మచారి హనుమ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? సువర్చలా దేవి కల్యాణ రహస్యమిదే!

