'నన్నెవరూ బాయ్‌కాట్ చేయలేరు'- ట్రంప్ వర్సెస్ మీడియా- ఆ సంస్థలపై ఆంక్షలతో రచ్చ
వైట్‌హౌస్ యాక్సెస్‌పై CNN, పొలిటికో, MS NOW కోర్టుకెక్కిన వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు- వాళ్లు తనను బాయ్‌కాట్ చేస్తారన్నారని, కానీ ఎప్పుడూ చేయలేదు అంటూ మీడియాపై సెటైర్లు

Published : September 22, 2026 at 7:13 AM IST
Trump Vs Media : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా సంస్థల మధ్య మరోసారి వివాదం ముదిరింది. CNN, పొలిటికో, MS NOW సంస్థలకు వైట్‌హౌస్‌లోకి అనుమతి నిరాకరించిన వ్యవహారం ఇప్పుడు కోర్టు వరకు వెళ్లింది. ఈ మూడు సంస్థలు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఫెడరల్ కోర్టులో కేసు వేశాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తనను మీడియా బాయ్‌కాట్ చేస్తుందన్న ప్రచారంపై వ్యంగ్యంగా స్పందించారు.
'నన్ను ఎవరూ బాయ్‌కాట్ చేయలేరు'
న్యూయార్క్‌లోని గ్రేసీ మాన్షన్‌లో మేయర్ జోహ్రాన్ మమ్దానీతో సమావేశం తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తనపై కొన్ని మీడియా సంస్థలు బాయ్‌కాట్ చేస్తాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "వాళ్లు నన్ను బాయ్‌కాట్ చేస్తామన్నారు. కానీ వాళ్లు ఎప్పుడూ నన్ను బాయ్‌కాట్ చేయలేదు. ఇక్కడ చూడండి. ఎంతమంది మీడియా వాళ్లు ఉన్నారు" అంటూ వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్ నుంచి కొన్ని మీడియా సంస్థలను దూరం పెట్టడాన్ని కూడా ట్రంప్ సమర్థించారు. మీడియాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని ఆయన అన్నారు. తన ప్రభుత్వం ఎన్నో పనులు చేసినా కొన్ని సంస్థలు ఎక్కువగా ప్రతికూల వార్తలే ఇస్తున్నాయని ఆరోపించారు. CNN, MS NOWపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. "మీడియా సంస్థలకు న్యాయంగా వ్యవహరించే బాధ్యత ఉంది" అని ట్రంప్ అన్నారు. తాను చెప్పిన విషయాలను తప్పుగా చూపించే సంస్థలను వైట్‌హౌస్‌లోకి ఎందుకు అనుమతించాలన్నది తన వాదనగా చెప్పారు.
కోర్టుకెక్కిన మూడు సంస్థలు
ఇదే సమయంలో CNN, MS NOW, పొలిటికో కలిసి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశాయి. తమ జర్నలిస్టుల వైట్‌హౌస్ యాక్సెస్‌ను రద్దు చేయడం అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్‌లోని పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. అలాగే సరైన ప్రక్రియ లేకుండా యాక్సెస్, ప్రెస్ క్రెడెన్షియల్స్ తొలగించారని పేర్కొంటూ ఫిఫ్త్ అమెండ్‌మెంట్ కింద కూడా వాదనలు వినిపించాయి. సెప్టెంబర్ 19 నుంచి ఈ మూడు సంస్థలకు చెందిన కొందరు జర్నలిస్టులు వైట్‌హౌస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొందరి ప్రెస్ బ్యాడ్జ్‌లను నిలిపివేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ చర్యలపై మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.
'యాక్సెస్ హక్కు కాదు' అంటున్న వైట్‌హౌస్
ట్రంప్ ప్రభుత్వం మాత్రం వైట్‌హౌస్ ప్రెస్ యాక్సెస్ అనేది ప్రతి మీడియా సంస్థకు రాజ్యాంగం ఇచ్చిన ఆటోమేటిక్ హక్కు కాదని చెబుతోంది. మీడియాకు వార్తలు ప్రచురించే స్వేచ్ఛ ఉందని, కానీ వైట్‌హౌస్ ప్రాంగణం, బ్రీఫింగ్ రూమ్ లేదా ప్రెసిడెన్షియల్ ప్రెస్ పూల్‌లో చోటు కల్పించడం వేరే విషయమని వాదిస్తోంది. మరోవైపు, తమ వార్తా కవరేజీపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉందన్న కారణంతోనే యాక్సెస్‌ను నిరాకరించారని CNN, MS NOW, పొలిటికో ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం ప్రచురించాలో, ఏం రాయకూడదో నిర్ణయించే పరిస్థితి రాకూడదని ఆ సంస్థలు చెబుతున్నాయి.
టీవీ కవరేజీపైనా ప్రభావం
ఈ వివాదం కేవలం వైట్‌హౌస్‌లోకి జర్నలిస్టుల ప్రవేశం వరకే ఆగలేదు. అధ్యక్షుడి కార్యక్రమాలను వివిధ టీవీ నెట్‌వర్క్‌లు కలిసి కవర్ చేసే టెలివిజన్ ప్రెస్ పూల్ వ్యవస్థపైనా ప్రభావం పడింది. ట్రంప్ న్యూయార్క్ పర్యటనలో CNN టీవీ పూల్ నెట్‌వర్క్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే CNNను తొలగించడంతో మిగిలిన నెట్‌వర్క్‌లు కూడా ప్రెసిడెంట్ కార్యక్రమాల వీడియో కవరేజీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా ఒక నెట్‌వర్క్ అధ్యక్షుడి కార్యక్రమాన్ని చిత్రీకరించి, ఆ ఫుటేజీని ఇతర మీడియా సంస్థలతో పంచుకుంటుంది. ఈ ఏర్పాటుకు అంతరాయం కలగడంతో వివాదం మరింత పెద్దదైంది.
మమ్దానీతో మాత్రం స్నేహపూర్వకంగా!
మీడియా వివాదం మధ్య ట్రంప్ న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీతో గ్రేసీ మాన్షన్‌లో సమావేశమయ్యారు. ఇద్దరి రాజకీయ అభిప్రాయాల్లో తేడాలు ఉన్నప్పటికీ సమావేశం మాత్రం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. న్యూయార్క్‌లో ఇళ్ల సమస్య, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే గృహాలు, నగర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. మమ్దానీతో కలిసి మీడియాతో మాట్లాడిన ట్రంప్, "ఆయన మంచి మేయర్ అవుతారని ఆశిస్తున్నాను. న్యూయార్క్‌కు ఏది మంచిదో అదే నాకు కావాలి" అని చెప్పారు. మరోవైపు మీడియా యాక్సెస్‌పై ట్రంప్ నిర్ణయాన్ని మమ్దానీ ప్రశ్నించారు. వైట్‌హౌస్ నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న మీడియా సంస్థలు గ్రేసీ మాన్షన్ కార్యక్రమంలో ఉండటం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయా సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని పునరుద్ఘాటించారు.
ఇప్పుడు కోర్టు తీర్పుపైనే ఆసక్తి
ట్రంప్ ప్రభుత్వం, మీడియా సంస్థలు తమ తమ వాదనలను కోర్టు ముందు ఉంచాయి. ఈ కేసు అమెరికాలో అధ్యక్షుడి మీడియా యాక్సెస్‌పై అధికార పరిధి ఎంతవరకు ఉండాలనే అంశంపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఒక మీడియా సంస్థ వార్తా కవరేజీపై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత దాని వైట్‌హౌస్ యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చా? అన్న ప్రశ్న ఇప్పుడు న్యాయపరమైన చర్చలో కీలకంగా మారింది. ట్రంప్ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు. మీడియా తనపై ఎలాంటి బాయ్‌కాట్ ప్రకటించినా తాను పెద్దగా పట్టించుకోనని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు CNN, MS NOW, పొలిటికో తమ యాక్సెస్‌ను తిరిగి పొందేందుకు న్యాయపోరాటం మొదలుపెట్టాయి. దీంతో వైట్‌హౌస్–మీడియా మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పుడు కోర్టులో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
మరో చైనా కారాదనే భారత్‌పై అమెరికా టార్గెట్! టారిఫ్‌లకు అసలు కారణం ఇదేనా?
రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘనవిజయం- ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ 57 శాతం ఓట్లతో ప్రభంజనం!

