భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు- ఆగస్టు 6న తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
గురువారం బంగారం, వెండి ధరల వివరాలు మీకోసం- బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్, HUID వంటి గుర్తులను తప్పనిసరని నిపుణుల సూచన

Published : August 6, 2026 at 9:36 AM IST
Gold Rate Today : దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాలు, వివిధ దేశాల కరెన్సీల మారకం విలువల్లో వస్తున్న మార్పులు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో దేశీయంగా పసిడి, వెండి ధరలు ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగాయి.
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.1,52,660గా ఉంది. బుధవారం రూ.1,48,870గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.3,790 మేర పెరిగింది. ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు నగరాల్లోనూ నమోదయ్యాయి. బంగారు ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,675గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,261 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లోనూ భారీ పెరుగుదల
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర రూ.2,29,498గా ఉండగా, గురువారం నాటికి రూ.3,151 పెరిగి రూ.2,32,498కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర ఔన్స్‌కు 62.07 డాలర్లుగా నమోదైంది.
బంగారం కొనుగోలు ముందు తెలుసుకోవాల్సివి
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో కేవలం ధరను మాత్రమే కాకుండా వాటి స్వచ్ఛతను కూడా నిర్ధారించుకోవడం అత్యంత అవసరం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనల ప్రకారం విక్రయించే బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలి. హాల్‌మార్క్‌లో మొత్తం ఐదు ముఖ్యమైన వివరాలు ఉంటాయి. మొదటిగా BIS హాల్‌మార్క్ లోగో, రెండోది బంగారం స్వచ్ఛత, మూడోది హాల్‌మార్కింగ్ సెంటర్ గుర్తు, నాలుగోది తయారీ సంవత్సరానికి సంబంధించిన కోడ్, ఐదోది జ్యువెలర్ ఐడెంటిఫికేషన్ మార్క్. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిది.
24 క్యారెట్, 22 క్యారెట్ మధ్య తేడా
24 క్యారెట్ల బంగారం దాదాపు 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. అయితే ఇది చాలా మెత్తగా ఉండటంతో ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉండదు. అందువల్ల దీనిని ప్రధానంగా బంగారు నాణేలు, బార్లు, బిస్కెట్ల తయారీలో ఉపయోగిస్తారు. 22 క్యారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. దీనినే 916 బంగారం అని పిలుస్తారు. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలపడం వల్ల దృఢత్వం పెరిగి ఆభరణాల తయారీకి అనువుగా మారుతుంది. భారత మార్కెట్‌లో ఎక్కువగా విక్రయించే బంగారు నగలు 22 క్యారెట్ల బంగారంతోనే తయారవుతాయి.
ఈ మూడు గుర్తులు తప్పనిసరిగా ఉండాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ చేసిన ప్రతి బంగారు ఆభరణంపై మూడు కీలక గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. అవి బీఎస్ఐ లోగో, Purity/Fineness Grade, ఆరు అంకెల ఆల్ఫాన్యూమెరిక్ కోడ్. ఈ హెచ్‌యూఐడీ నంబర్ ఆధారంగా BIS Care App లేదా అధికారిక పోర్టల్‌లో ఆభరణం వివరాలను పరిశీలించి అది అసలైనదేనా కాదా అనేది వినియోగదారులు స్వయంగా తెలుసుకోవచ్చు.
KDM అంటే స్వచ్ఛతకు గుర్తు కాదు
చాలా మంది కేడీఎం బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా భావిస్తుంటారు. అయితే కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధారించే ప్రమాణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం నగల తయారీలో ఉపయోగించే ఒక విధానాన్ని మాత్రమే సూచిస్తుంది. అందువల్ల కేడీఎం అనే పేరుకంటే బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న బంగారానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. హాల్‌మార్కింగ్ ఛార్జీ కూడా స్థిరంగా ఉండటంతో, ఎంత పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినా వినియోగదారులకు అదనపు భారం ఉండదని పేర్కొంటున్నారు.
ఆర్బీఐ కీలక నిర్ణయం- వడ్డీ రేట్లు యథాతథం- వరుసగా నాలుగోసారి
బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం- దాదాపు 37 శాతం పసిడి పతనానికి ఛాన్స్

