ETV Bharat / bharat

రూ.3500 బిర్యానీలో చనిపోయిన జెర్రి- కస్టమర్‌కు రూ.1.05 లక్షల పరిహారం!

కుటుంబ వేడుక కోసం తెప్పించిన బిర్యానీలో చనిపోయిన జెర్రి కనిపించిన ఘటన- ఫిర్యాదును పట్టించుకోని రెస్టారెంట్ యాజమాన్యంపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం

Centipede In Biryani Issue
BIRYANI REPRESENTATIVE IMAGE (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : June 11, 2026 at 3:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Centipede In Biryani Issue : తమిళనాడు చెన్నైలో ఓ ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ నిర్లక్ష్యం వినియోగదారుల కమిషన్ ముందు బట్టబయలైంది. కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాల్సిన పెళ్లి వేడుక చేదు జ్ఞాపకంగా మారడంతో బాధితుడికి వినియోగదారుల కమిషన్ న్యాయం చేసింది. బిర్యానీలో చనిపోయిన జెర్రి కనిపించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన వ్యక్తికి రూ.1.05 లక్షల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

అసలేం జరిగిందంటే?
చెన్నైలోని ఎరుక్కంచేరి ప్రాంతానికి చెందిన ఎం. అహ్మద్ సిద్ధిక్ (45) ఇటీవల వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం సంప్రదాయ కార్యక్రమంలో భాగంగా తన భార్య బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి భోజనం చేయాలని భావించిన సిద్ధిక్, 2025 డిసెంబర్ 30న పెరంబూర్‌లో ఉన్న ఎస్.ఎస్.హైదరాబాద్ బిర్యానీ ఔట్‌లెట్ నుంచి రూ.3,500 విలువైన బకెట్ బిర్యానీ కొనుగోలు చేశారు.

పెళ్లి సందడి మధ్య చిన్నారులు, పెద్దలు అందరూ ఎంతో ఆసక్తిగా బిర్యానీ తినేందుకు సిద్ధమయ్యారు. రుచికరమైన బిర్యానీగా పేరుగాంచిన ఆ రెస్టారెంట్ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఆహారం అందరినీ ఆనందపరుస్తుందని భావించారు. అయితే భోజనం ప్రారంభమైన కొద్దిసేపటికే అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలోని ఓ చిన్నారి బిర్యానీలో చనిపోయిన జెర్రిని గుర్తించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లి వేడుకలో ఆనందంగా గడపాల్సిన సమయం తీవ్ర అసహ్యం, ఆందోళనకు దారితీసింది. చిన్నారులు భయపడగా, పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై సిద్ధిక్ వెంటనే సంబంధిత బిర్యానీ ఔట్‌లెట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. జరిగిన విషయాన్ని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం నుంచి ఎలాంటి సంతృప్తికరమైన స్పందన రాలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించకపోవడంతో పాటు వినియోగదారుడి ఆవేదనను పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో న్యాయం కోసం సిద్ధిక్ చెన్నై వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులందరూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, పెళ్లి తర్వాత జరుపుకోవాల్సిన ఆనంద వేడుక పూర్తిగా చెడిపోయిందని తెలిపారు. ఈ ఘటన కారణంగా తాను, తన కుటుంబం తీవ్ర అవమానానికి, ఆందోళనకు గురయ్యామని పేర్కొంటూ రూ.5 లక్షల పరిహారం ఇప్పించాలని కమిషన్‌ను కోరారు.

ఈ కేసును కమిషన్ అధ్యక్షుడు టి. గోపినాథ్‌తో పాటు సభ్యులు కవితా కన్నన్, టి.ఆర్. శివకుమార్ విచారించారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన కమిషన్, వినియోగదారుడి ఫిర్యాదుకు రెస్టారెంట్ యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వినియోగదారుడికి తగిన సేవలు అందించడంలో విఫలమవడం మాత్రమే కాకుండా, ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడం కూడా సేవల్లో లోపమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బాధితుడు ఎదుర్కొన్న మానసిక వేదనను దృష్టిలో ఉంచుకుని, ఎస్.ఎస్. హైదరాబాద్ బిర్యానీ ఔట్‌లెట్ రూ.1 లక్షలను పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే న్యాయపోరాటానికి అయ్యిన ఖర్చుల కింద మరో రూ.5 వేల రూపాయలు చెల్లించాలని పేర్కొంది. మొత్తంగా రూ.1.05 లక్షలను బాధితుడికి చెల్లించాలని తీర్పు వెలువరించింది.

ఈ తీర్పు వినియోగదారుల హక్కులకు మరోసారి బలాన్ని చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే సంస్థలకు ఇది హెచ్చరికగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను చిన్నచూపు చూడకుండా, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత వ్యాపార సంస్థలపై ఉందని తీర్పు స్పష్టం చేసింది. అలాగే ఆహార భద్రత విషయంలో రెస్టారెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ ఘటన మరోసారి గుర్తు చేసింది.

ఆహార పదార్థాల ప్యాకింగ్​కు​ న్యూస్​పేపర్లు వాడొద్దు-అవి ఆరోగ్యానికి హానికరం: ఫుడ్​ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక

స్కూల్ డ్రాపౌట్స్​ చదువు కోసం 'ఫుడ్‌మ్యాన్' కృషి- ఫీడ్ క్యాంపస్ ఏర్పాటు- 20 మంది బాలికలు టెన్త్ పాస్