కోతిపై గ్రామస్థుల ప్రేమ- సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 3:46 PM IST

thumbnail

Last Journey Of Monkey In UP : ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్​ జిల్లాలోని బహువా గ్రామస్థులు చనిపోయిన ఓ కోతికి అంత్యక్రియలు చేశారు. హిందు సంప్రదాయం ప్రకారం బ్యాండు పెట్టి మరీ ఊరేగింపుగా స్మశాన వాటికకు తీసుకెళ్లి ఆ వానరానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా గ్రామస్థులు పాల్గొన్నారు.

లాలౌలీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బహువాలోకి నెలరోజుల క్రితం దగ్గర్లోని అడవి నుంచి ఓ కోతి వచ్చింది. గ్రామంలోని ఇంటి పైకప్పులపై దూకుతూ అక్కడి ప్రజలను కాస్త ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఆ సమయంలో కోతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని గమనించిన ఊరి ప్రజలు దానికి చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పశువైద్యులను గ్రామానికి పిలిపించి గత కొంతకాలంగా దానికి చికిత్స చేయించారు.

అయితే కోలుకుంటున్నట్లే అనిపించినా ఆ వానరం ఉన్నట్టుండి బుధవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. దీంతో ఎంతో ఆప్యాయతతో దానికి సమయానికి వైద్యం చేయించి, ఆహారం అందించిన గ్రామస్థులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక దానికీ మనుషుల్లాగే అంతిమ వీడ్కోలు పలకాలని అనుకున్నారు. ఇందులో భాగంగా అందరూ చందాలు వేసుకొని మరణించిన కోతికి హిందు సంప్రదాయం ప్రకారం చివరి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, కోతిపై బహువా గ్రామస్థులు చూపిన ప్రేమ, మానవత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.