ETV Bharat / technology

మొదటిసారిగా AC కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - AC Buying Guide

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 4:15 PM IST

AC Buying Guide : వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఏసీ (ఎయిర్​-కండిషనర్​)లు కొనాలని అనుకుంటున్నారు. మరి మీరు కూడా కొత్త ఏసీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఏసీ కొనే ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Choose the Best Air Conditioner
AC Buying Tips

AC Buying Guide : వాతావరణ మార్పుల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేసవిలో అయితే ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. దీంతో చాలా మంది కొత్త ఏసీ కొనాలని అనుకుంటున్నారు. అంటే ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న ఎయిర్‌ కండిషనర్లు (ఏసీ), ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. అయితే, సరైన ఏసీ కొనుగోలు చేయలేకపోతే, అధిక విద్యుత్తు బిల్లు కట్టాల్సి వస్తుంది. పైగా గది వెంటనే చల్లారక ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అందుకే ఏసీ కొనుగోలు చేసే ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గదిని బట్టి ఏసీ
మీరు ఉంటున్న ఇళ్లు లేదా గదికి అనుగుణంగా సరైన ఏసీ తీసుకోవాలి. పిల్లల గది, మాస్టర్‌ బెడ్‌రూం, లివింగ్‌ రూమ్​, ఇలా మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి ఏసీ రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 120 చదరపు అడుగుల కంటే తక్కువ వైశాల్యం ఉన్న గది అయితే ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది. అలాగే 120-200 చ.అడుగులకు 1-2 టన్నులు, లివింగ్‌ రూం లేదా 200 చ.అడుగుల కంటే పెద్దగా ఉండే గదులకు రెండు టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాలి.

2. ఏసీ రకం

  • విండో ఏసీ : సింగిల్‌ రూమ్‌లో ఉండేవారు వీటిని ఎక్కువగా వాడతారు. ఈ విండో ఏసీలో అన్ని పరికరాలు ఒకే బాక్స్‌లో అమర్చి ఉంటాయి. దీన్ని బిగించడం కూడా చాలా సులభం. కిటికీలో లేదా గోడకు ఉండే ఓపెనింగ్‌లో దీన్ని అమర్చవచ్చు. ధర తక్కువగానే ఉంటుంది. కానీ మిగతా వాటితో పోల్చితే కాస్త శబ్ధం అధికంగా వస్తుంది.
  • స్ల్పిట్​ ఏసీ : పేరుకు తగ్గట్లుగానే ఈ స్ల్పిట్​ ఏసీలో రెండు పరికరాలు విడివిడిగా ఉంటాయి. ఒక దాన్ని ఇంట్లో బిగిస్తే, మరొక దాన్ని వెలుపల అమర్చాల్సి ఉంటుంది. కంప్రెసర్‌ అనేది బయట అమర్చే భాగంలో ఉంటుంది. అందువల్ల శబ్దం పెద్దగా రాదు. రెండు భాగాలుగా ఉండడం వల్ల, ఈ స్ల్పిట్​ ఏసీని బిగించడం కొంచెం శ్రమతో కూడుకొన్న పని.
  • హాట్‌ అండ్‌ కోల్డ్‌ ఏసీ : అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు ఈ ఏసీ అనుకూలంగా ఉంటుంది. ఈ హాట్ అండ్ కోల్డ్ ఏసీ అనేది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గదిని చల్లబరుస్తుంది. శీతాకాలంలో మంచి వెచ్చదనాన్నీ అందిస్తుంది.
  • పోర్టబుల్‌ ఏసీ : మీ అవసరానికి అనుగుణంగా ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
  • టవర్‌ ఏసీ : పెద్ద గదులను, కమర్షియల్‌ ప్లేస్‌లను వేగంగా చల్లబరిచేందుకు ఈ టవర్‌ ఏసీలను ఉపయోగిస్తూ ఉంటారు.

3. ఈ ఫీచర్స్ కచ్చితంగా ఉండాల్సిందే!

  • ఏసీలో కచ్చితంగా ఎయిర్​ ఫిల్టర్లు ఉండాలి. అప్పుడే ఏసీలోకి ఎలాంటి దుమ్ము, ధూళి చేరదు. ఫలితంగా అలర్జీల వంటివి దరిచేరకుండా ఉంటాయి.
  • ఆటో క్లీన్‌ ఫీచర్‌ ఉన్న ఏసీ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఏసీ దానికదే శుభ్రం చేసుకుంటుంది. ఫలితంగా బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పట్టకుండా ఉంటాయి.
  • ఏసీలో డీహ్యుమిడిఫికేషన్‌ ఫీచర్‌ ఉండాలి. అప్పుడే గదిలో తేమ, తడి నిండిపోకుండా ఉంటుంది.
  • వీటితో పాటు ఏసీలో స్మార్ట్‌ కనెక్టివిటీ, ఆటో స్టార్ట్‌, ఫోర్‌-వే స్వింగ్‌, టర్బో మోడ్‌, స్లీప్‌ అలార్మ్‌ సహా ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌ లాంటి ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి.

4. స్టార్ రేటింగ్ కూడా ముఖ్యమే!
వాస్తవానికి అన్ని ఏసీల సామర్థ్యం ఒకేలా ఉండదు. అలాగే విద్యుత్తును వాడుకునే విషయంలోనూ వాటిలో తేడాలుంటాయి. అందుకే స్టార్‌ రేటింగ్​ ఉన్న ఏసీనే ఎంచుకోవాలి. ఒక స్టార్‌ ఉన్న ఏసీతో పోలిస్తే 4, 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన వాటిని ఎంచుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీ విద్యుత్ బిల్లు ఆదా ఆవుతుంది.

5. ఇన్వర్టర్‌ ఏసీ
ఇన్వర్టర్‌ ఏసీలో ఉండే కంప్రెసర్​ గది ఉష్ణోగ్రతను బట్టి పనిచేస్తుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కంప్రెసర్‌ అధికంగా పనిచేయాల్సి వస్తుంది. గది చల్లగా ఉంటే దానిపై లోడ్‌ తక్కువగా పడుతుంది. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా బాగా తగ్గుతుంది. ఈ విషయాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని సరైన ఏసీని ఎంచుకోవాలి.

స్మార్ట్​ఫోన్​కు బానిసలుగా మారారా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి! - how to overcome phone addiction

మీ ​ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానంగా ఉందా? ఈ 'సీక్రెట్​ కోడ్స్​'​తో డివైజ్​ను ప్రొటెక్ట్​​ చేసుకోండిలా! - How To Check Phone Is Hacked Or Not

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.