ETV Bharat / state

నిత్య'కళ్యాణం' పచ్చతోరణంలా 'దుర్గం' నేత అవినీతి - ఆమె పేరు చెబితేనే వణుకుతున్న ప్రజలు - YSRCP Woman Leader Corruption

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 7:05 AM IST

YSRCP_Woman_Leader_Corruption
YSRCP_Woman_Leader_Corruption

YSRCP Woman Leader Corruption: దండుకోవడం, పిండుకోవడం, విలువలకు సిలువేయడం, నిబంధనలకు పాతరేయడం ఆ మహిళా నేతకు మంచినీళ్లు తాగినంత ఈజీ! భూములు కొల్లగొట్టడం, వ్యవసాయ మోటార్లు, కొలువులు అమ్మకాలకు పెట్టడంలో ఆమెకు అపార అనుభవం! అడ్డుతిరిగితే దాడులు చేయిస్తూ దారికి తెచ్చుకుంటారని పేరు గడించిన ఆ మహిళా నేత ఆ నియోజకవర్గాన్ని ఓ 'దుర్గం'లా మార్చుకున్నారు. అక్కడ ఆమె అవినీతి తతంగం నిత్య'కళ్యాణం' పచ్చతోరణంలా వర్ధిల్లుతోంది.

నిత్య'కళ్యాణం' పచ్చతోరణంలా 'దుర్గం' నేత అవినీతి - ఆమె పేరు చెబితేనే వణుకుతున్న ప్రజలు

YSRCP Woman Leader Corruption: చిన్న వ్యాపారమైతే వసూళ్లు, పెద్ద వ్యాపారమైతే వాటాలు. ఇదీ ఆ మహిళా ప్రజాప్రతినిధి రాజకీయ వ్యాపార సూత్రం. రాజకీయాల్ని వ్యాపారాన్ని వేర్వేరుగా చూడటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ రెండింటినీ రెండు కళ్లుగా భావిస్తారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను గుప్పిట పెట్టుకుని రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఆ జిల్లాలోని ఓ పట్టణంలో మోస్తరు ఆదాయం ఉన్న వ్యాపారుల నుంచి ఆమె అనుచరులు ప్రతినెల 30 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. పెద్ద వ్యాపారమైతే నేరుగా ఆ మహిళా నేతే రంగంలోకి దిగి వాటాల కోసం పట్టుబడుతున్నారు. రైతుల్ని బెదిరించి వందల ఎకరాలు బలవంతంగా రాయించుకున్నారు.

చిన్న రంగం నుంచి పెద్ద వ్యాపారం వరకు: అనంతపురం జిల్లాలోని ఆ మహిళా ప్రజాప్రతినిధి చిన్న రంగం నుంచి పెద్ద వ్యాపారం వరకు తన అనుచరులను ముందుపెట్టి అరాచకాలు సాగిస్తున్నారు. ఎంతగా అంటే సాగునీటి అవసరాల కోసం టీడీపీ ప్రభుత్వం ఓ నియోజకవర్గంలోని రైతులకు 2 వేల 300 విద్యుత్‌ మోటార్లు మంజూరు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మహిళా ప్రజాప్రతినిధి ఒక్కో మోటారును 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు అమ్ముకున్నారు. ఇలా విద్యుత్‌ మోటార్ల విక్రయం ద్వారా 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ ఒక్క ఉదాహరణే చాలు అవినీతి సొమ్ము మేతలో ఆ మహిళా నేత ఎంతగా ఎదిగిపోయారో చెప్పడానికి! ఇసుక నుంచి మైనింగ్‌ వరకు ఏ వ్యాపారం చేయాలన్నా ఆమెకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.

ఇలా ఐదేళ్లలో 250 కోట్ల రూపాయలకు పైగానే దోపిడీకి పాల్పడ్డారు. ఈ మహామేతను చూసి పొంగిపోయిన వైసీపీ సర్కారు ఆమెకు గొప్ప పదవిని కట్టబెట్టి సత్కరించింది! చేబదులు తీసుకోవడం, అడిగిన వారిపై అక్రమ కేసులు బనాయించడం కూడా ఆ మహిళా ప్రజాప్రతినిధిలో దాగిన మరో కోణం! తన నియోజకవర్గ కేంద్రంలో ఓ మహిళా కౌన్సిలర్‌ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి అడిగినందుకు ఆమె భర్తపై తప్పుడు కేసు పెట్టించారు. దాడులు చేయించారు. తనను ఎదిరించారన్న అక్కసుతో ఓ ZPTC సభ్యుడిపైనా అక్రమ కేసు బనాయించారు.

అక్రమార్జనలో దూసుకుపోతున్న 'బండి' - ఆ కోటలో ఎవరైనా 'ఎస్'​ బాస్ అనాల్సిందే!

రైతులను బెదిరించి భూములను రాయించుకుని: జగనన్న కాలనీ భూములు కొనుగోళ్లలోనూ ఆ మహిళా ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలు దండుకున్నారు. భూములిస్తే పెద్దమొత్తంలో పరిహారం ఇప్పిస్తానని రైతులకు నమ్మబలికారు. అయితే అందులో వచ్చిన సొమ్ములో మూడో వంతు కమీషన్‌ ఇవ్వాలని రైతులకు షరతులు పెట్టారు. ఎకరాకు 35 లక్షల పరిహారం ఇప్పించిన ఆ నేత, అందులోంచి ఎకరాకు 15 లక్షల చొప్పున కాజేశారు.

శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో పవన విద్యుత్తు ప్లాంట్‌ ఏర్పాటు కోసం రైతుల నుంచి ఓ సంస్థ పెద్దఎత్తున భూములు సేకరించింది. కొంత విస్తీర్ణంలో గాలిమరలు ఏర్పాటు చేయగా భవిష్యత్తులో విస్తరించాలన్న ఉద్దేశంతో మరికొంత స్థలాన్ని పక్కనపెట్టింది. ఆ భూములపై కన్నేసిన మహిళా ప్రజాప్రతినిధి వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని వెనక్కి తీసుకుంటామంటూ సంస్థ ప్రతినిధుల్ని బెదిరించారు. చివరకు ఎకరాకు లక్షా 30 వేల రూపాయల చొప్పున చెల్లించి 65 ఎకరాలను తమ వశం చేసుకున్నారు.

ఈ స్థలాలకు ఆనుకుని ఉన్న రైతులను బెదిరించి వారి పొలాలు బలవంతంగా రాయించుకున్నారు. ఇలా ఒకేచోట 120 ఎకరాలు కూడబెట్టి రిసార్టు నిర్మాణం చేపట్టారు. అందుకు అవసరమయ్యే 3 వేల టిప్పర్ల మట్టిని సమీపంలోని ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నుంచి, ఇసుకను పెన్నా నది నుంచి అక్రమంగా తరలించారు. రిసార్ట్‌ దారి కోసం మరికొందరు రైతుల్ని బెదిరించి భూములు లాక్కున్నారు. తన రిసార్ట్‌లో బోటింగ్‌ కోసం పక్కనే ఉన్న వాగుపై చెక్‌డ్యాం నిర్మించేందుకు జలవనరులశాఖ ద్వారా 3కోట్ల 16లక్షల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే

బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయంటూ: కంబదూరు మండలం మర్రిమాకులపల్లిలో 77 ఎకరాల ఎసైన్డ్‌ భూమిపై ఈ మహిళా ప్రజాప్రతినిధి కన్నేశారు. ఎకరా 10 లక్షల రూపాయల విలువైన భూములను కేవలం 2లక్షల 40వేల రూపాయలు చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను బెదిరించారు. విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

తన నియోజకవర్గ కేంద్రానికి ఆనుకుని ఉన్న ఓ చెరువును పూడ్చి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఏర్పాటుకు మహిళా ప్రజాప్రతినిధి ప్రణాళిక రచించారు. సుమారు 2 ఎకరాల వరకు పూడ్చేసి అమ్మేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిపేశారు. ప్రస్తుతం మళ్లీ ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. తన నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల వేసిన వెంచర్ల యజమానుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. ఒక వెంచర్ యజమాని నుంచి 54 సెంట్ల భూమిని బలవంతంగా లాక్కున్నారు. పెట్రోల్‌ బంకు అనుమతుల పేరిట మరో వ్యక్తి నుంచి 50 లక్షల విలువైన ఇంటి స్థలం రాయించుకున్నారు.

వేధింపులను తట్టుకోలేక: శెట్టూరు మండలం ములకలేడు పరిధిలో లభించే గ్రానైట్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ప్రధానంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే ఈ గ్రానైట్‌ను తమిళనాడు, కేరళలతో పాటు చైనాకూ ఎగుమతి చేస్తారు. తమిళనాడుకు చెందిన కొంతమంది లీజుదారులు ఇక్కడ ఉన్న 8 గ్రానైట్‌ క్వారీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్వారీల్లో తనకు వాటా ఇవ్వాలంటూ లీజుదారులను మహిళా ప్రజాప్రతినిధి బెదిరించారు. వాళ్లు అంగీకరించకపోవడంతో అధికారుల్ని పంపి భయపెట్టారు. వినకపోవడంతో క్వారీల్లోని వాహనాలను బలవంతంగా తీసుకెళ్లారు. వేధింపులను తట్టుకోలేక లీజుదారులు కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోయారు.

విజయనగరంలో సెటిల్​మెంట్ల దందా - ఆ నేత కన్నుపడితే ఆశలు వదులుకోవాల్సిందే

అధినేతకు అంతా తెలిసినా: కొలువుల పేరిట కూడా ఆ మహిళా నేత కోట్ల రూపాయలు దండుకున్నారు. ఒక్కో అంగన్వాడీ పోస్టును 5 లక్షల రూపాయల చొప్పున అమ్మేసుకున్నారు. సొంతపార్టీ వారిని కూడా వదలలేదు. వారి నుంచి సైతం 3 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసి పోస్టులను విక్రయించారు. రెండు సబ్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 16 షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులను అమ్మేశారు. ఒక్కో పోస్టును 9 లక్షల రూపాయలకు విక్రయించి కోటి 28లక్షలు పిండుకున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ మరో 16 మంది నుంచి 8 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఎటువంటి నోటిఫికేషన్‌ లేకుండానే షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలను భర్తీ చేశారు.

కంబదూరు మండల పరిధిలోని పెన్నా నది నుంచి బళ్లారి, బెంగళూరు నగరాలకు నిత్యం వందలాది టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా మహిళా ప్రతినిధి సారథ్యంలోనే సాగుతోంది. అందుకు ఓ ప్రైవేట్‌ సైన్యం ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు తొలిచేస్తూ అనుమతుల్లేకుండా ఎర్రమట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారు. ఇలా ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తూ ఏటా కోట్లు రూపాయలు గడిస్తున్నారు.

మహిళా ప్రజాప్రతినిధి పేరు వింటేనే నియోజకవర్గ ప్రజలు, వ్యాపారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ మహామేత అరాచకాలన్నీ అధినేతకు తెలుసు. అయినా కూడా ఆ నాయకురాలి అవినీతి, అక్రమాలను నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పైగా ఆ మహిళా నేతను ఇప్పుడున్న నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి బదిలీ చేశారు.

ఒంగోలులో అధికార పార్టీ నేతల అండతో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.