ETV Bharat / state

ఒంగోలులో అధికార పార్టీ నేతల అండతో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 7:15 AM IST

Updated : Nov 3, 2023, 7:45 AM IST

Land Grab by YSRCP Leaders in Ongole: ఒంగోలులో అధికార పార్టీ నాయకుల అండదండలతో భూ మాఫియా పేట్రేగిపోతోంది. నకిలీ పత్రాలు, దొంగ జీపీఏలు సృష్టించి ఓ ముఠా భూములు చెరబడుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందల సంఖ్యలో కబ్జాలకు పాల్పడినట్లు తేలింది. ఇప్పటికే దాదాపు 200 కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగు చూడగా.. బయట పడని బాగోతాలు మరో 300 కోట్లు వరకు ఉండొచ్చని అంచనా. వైఎస్సార్సీపీకి చెందిన డిప్యూటీ మేయర్‌ మాధవరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాల్‌రెడ్డిపైనా పోలీసులకు ఫిర్యాదులు అందడం ఒంగోలులో అధికార పార్టీ భూ మాఫియాకు పరాకాష్టగా నిలుస్తోంది.

Land_Grab_by_YSRCP_Leaders_in_Ongole
Land_Grab_by_YSRCP_Leaders_in_Ongole

ఒంగోలులో అధికార పార్టీ నేతల అండతో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు

Land Grab by YSRCP Leaders in Ongole : ఒంగోలులో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తారనేంత ఆందోళన వ్యక్తంఅవుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో ఓ ముఠా సాగించిన భూ ఆక్రమణలు (Land Grabs) జనం ఆస్తుల రక్షణపై అపనమ్మకానికి బీజం వేశాయి. దొంగ వీలునామాలు, జీపీఏలు పుట్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసి భూ యజమానుల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం, సెటిల్‌మెంట్‌కు రాకపోతే కోర్టులకెక్కుతామని బెదిరించడం ఆ ముఠా పని! డబ్బులిస్తే వదిలేయడం, లేదంటే భూమిలో కొంత వాటా కాజేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా ఒకట్రెండు కాదు ప్రకాశం జిల్లా పోలీసులకు ఇప్పటి దాకా 138 ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ 30 కేసులు నమోదు చేశారు. 69 మందిని నిందితులుగా గుర్తించారు. 29 మందిని అరెస్టు చేశారు.

Ruling Party Leaders Land Scam in Prakasam District : ఒంగోలు భూమాఫియా ముఠాలో స్థిరాస్తి వ్యాపారులు చితిరాల పూర్ణచంద్రరావు, గొట్టిపాటి రవీంద్రబాబు తోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్థన్‌, మున్సిపల్‌ స్టోర్‌ ఉద్యోగి వి.శ్రీనివాసరావు వైఎసార్సీపీ మద్దతుదారు మల్లవరపు కోటిరెడ్డి,మాజీ జర్నలిస్ట్‌ రావి శ్రీనివాసరావు , ప్లంబర్‌ బూచి వనమాలి, కోల్డ్‌ స్టోరేజీ నిర్వాహకుడు కంది సుధాకర్‌రెడ్డి, రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి పమ్మిశెట్టి జయరాజ్‌, ఊబ్బా వెంకాయమ్మ, వెంకటేశ్వర్లు, అచ్చయ్య, దుర్గ ఉన్నట్లు పోలీసులు తేల్చారు.

SP Malika Garg on Land Scam Case: నకిలీ స్టాంప్‌ల కేసు సిట్ ద్వారానే దర్యాప్తు జరుగుతోంది.. సీఐడీ ప్రస్తావన లేదు: ఎస్పీ మలికాగార్గ్‌

YSRCP Leaders Occupy lands in Ongole : వైఎసార్సీపీ మద్దతుదారైన పూర్ణచంద్రరావే.. భూ మాఫియా (Land Mafia) ముఠా సూత్రధారిగా గుర్తించారు. స్థానిక వైఎసార్సీపీ నాయకులైన ఒక గ్రానైట్‌ వ్యాపారితో, గ్యాస్‌ ఏజెన్సీ నడుపుతూ నిర్మాణ కార్యకలాపాలు చేస్తున్న బిల్డర్‌తోనూ పూర్ణచంద్రరావుకు పరిచయముంది. గ్రానైట్‌ వ్యాపారికి, గ్యాస్‌ డీలర్‌కి స్థానిక వైఎసార్సీపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరు అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి పని పూర్తయ్యేలా చేస్తారు. ఆ నాయకులకూ బాగానే ప్రయోజనం చేకూరుతుందన్న ప్రచారం ఉంది. ఓ ఆస్థి రిజిస్ట్రేషన్‌ సందర్భంగా నకిలీ పత్రాల వ్యవహారం బయటపడింది. దీంతో గత నెల 26న లాయరుపేటలోని పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు.

Land Scam Case : సబ్‌రిజిస్ట్రార్‌, ఎమ్మార్వో, వీఆర్వో, పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన ఆఫీస్‌ సీల్స్‌, నకిలీ ధ్రువపత్రాలు (Fake Certificates), పాత స్టాంప్‌ పేపర్లు దొరికాయి. పొలాలు, స్థలాలు ఇళ్లకు సంబంధించిన నకిలీపత్రాలు, వీలునామాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రాత గొలుసుకట్టు విధానంలో విషయం ఎవరికీ అంత తేలికగా అర్ధం కాకుండా గజిబిజిగా రాశారు. ఈ ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాల్లో ...కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించినవీ ఉన్నాయి.


అక్రమ కేసులు పెడతామని బెదిరింపులు : పోలీసుల విచారణలో భూ మాఫియా ఆగడాలు ఒకొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని మామిడిపాలెంలో 33 సెంట్ల స్థలాన్ని ఒంగోలుకు చెందిన వైద్యుడు నాగయ్యనాయుడు ఈ ఏడాది జనవరిలో కొన్నారు. కొన్ని రోజులకు ఆ స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉన్న మార్జిన్‌తో పాటు, వైద్యుడి స్థలంలో కొంత ఆక్రమించి కంచె వేసేశారు. తమకు డీకే పట్టా ఉందని నకిలీ పత్రాలు చూపించారు. వైద్యుడు సర్వే చేయిస్తుంటే అడ్డుకుని గొడవ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే కోర్టు కేసులతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. వైద్యుడు తహసీల్దారుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆయన తాజాగా పోలీసులకు, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

YSRCP Leaders Land Scam: ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణం.. వైసీపీ నాయకుల్లో మొదలైన అలజడి..
ఆక్రమణదారుకు కొమ్ముకాస్తున్న డిప్యూటీ మేయర్‌ : ఒంగోలు రాజీవ్‌నగర్‌లో 1977లో మంచాల వెంకటరామయ్య అనే వ్యక్తి లేఅవుట్‌ వేశారు. అందులో ఆరు ప్లాట్లను ఆరుగురు కొనుక్కున్నారు. అవి ఖాళీగా ఉండటం, ఈ భూములకు సంబంధించిన వారు ముగ్గురు విదేశాల్లో ఉండటంతో కబ్జాకు తెగబడ్డారు. వాటి విలువ ఇప్పుడు 10 కోట్లు. ఆక్రమణదారుకు అధికార పార్టీకి డిప్యూటీ మేయర్‌ మాధవరావే కొమ్ముకాస్తున్నారని బాధితులు వాపోయారు.


రెచ్చిపోతున్న అక్రమార్కులు : ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో సర్వే నంబరు 181/1లోని వెంచర్‌లో సగానికి పైగా ప్లాట్లను నకిలీ పత్రాలతో ఆక్రమించేశారు. 1986లో వేసిన ఈ వెంచర్‌లో స్థలాలు ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. 2006లోనే పట్టాలు, 2010లో పొజిషన్‌ సర్టిఫికెట్లు పొందినట్లు పత్రాలు సృష్టించారు. 2012 జనవరి నుంచి ఎమ్మార్వో పోస్టును తహసీల్దారుగా మార్చగా.. 2010లోనే తహసీల్దారు పట్టాలు ఇచ్చినట్లు పత్రాల్లో పేర్కొన్నారీ ఘనులు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

అద్దెకు తీసుకున్న ఇంటిపై కన్ను : ఒంగోలు సుజాతానగర్‌లో ఒకటిన్నర సెంట్ల స్థలంలో తన స్నేహితుడికి చెందిన ఓ ఇంటిని సుబ్బారావు అనే న్యాయవాది కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్‌ జరగలేదు. కొద్దికాలం క్రితం తెలిసిన వారి ద్వారా పమ్మిశెట్టి జయరాజ్‌ అనే వ్యక్తికి ఆ ఇల్లు అద్దెకు ఇచ్చారు. ఆ ఇల్లు తనదేనని, డీకే పట్టా ఉందంటూ అతడు అడ్డం తిరిగాడు. విస్తుపోయిన న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. జయరాజ్‌ దగ్గర ఉన్న పత్రాలు నకిలీవని రెవెన్యూ శాఖ నిర్ధారించింది..


భూ కబ్జాల వెనుక వైఎసార్సీపీ నాయకుల హస్తం : ఒంగోలు ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాలరెడ్డి తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని కె.లక్ష్మీమోహనరావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడిపాలెంలోని సర్వే నంబరు 56/1లో ఉన్న 600 చదరపు గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి తన్నీరు హనుమంతరావు ఆక్రమించారని, ఇప్పుడా స్థలంలో బాలినేని సోదరుడు వేణుగోపాలరెడ్డి నిర్మాణం చేపడుతున్నారని లక్ష్మీమోహనరావు పేర్కొన్నారు. భూ కబ్జాల వెనుక వైఎసార్సీపీ నాయకుల హస్తం ఉందనడానికి ఇదే నిదర్శనమని బాధితులు అంటున్నారు.

ఆరోపణలు : ఒంగోలులోనే కాకుండా గుంటూరు , నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోనూ భారీగా భూ కబ్జాలు జరిగినట్లు బాధితులు ఆరోపించారు.

Land Irregularities With Kadapa District Collector Signature: సీఎం ఇలాఖాలో వందల కోట్ల విలువైన భూ అక్రమం..

Last Updated :Nov 3, 2023, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.