ETV Bharat / state

'గజపతి'లో 'అప్ప'నంగా భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు - ఐదేళ్లలో వందల ఎకరాలు పోగు - YSRCP Leaders Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 9:09 AM IST

YSRCP Leaders Irregularities: ఆయనో ప్రజాప్రతినిధి భూబకాసురుడు కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు. వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు పరిష్కారం చూపిస్తానంటారు. యజమానులను బెదిరిస్తారు. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. అక్రమాలను అధికారులు అడ్డుకుంటే రాజకీయ బలంతో బదిలీ చేయిస్తారు. 'అప్ప'నంగా భూములు కొల్లగొట్టి రికార్డులు తారుమారు చేయడమే 'అయ్య'గారి ఎజెండా.

YSRCP Leaders Irregularities
YSRCP Leaders Irregularities (ETV Bharat)

YSRCP Leaders Irregularities : ఆ నేత భూముల మేతలో ఆరితేరారు. దేవుళ్లకే శఠగోపం పెట్టి మాన్యంను ఫలహారంగా లాగించేశారు. వెతికి మరీ వివాదాస్పద భూముల్ని గుర్తించి సొంతం చేసుకున్నారు. కబ్జాల్లో మునిగితేలారు. ఇలా ఒకటా రెండా గత ఎన్నికలకు ముందు ఖర్చుల కోసం భూములు ఆమ్ముకున్న ఆయన ఈ ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందలాది ఎకరాలు కొల్లగొట్టారు. అసలే అధికార పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడేమో రాష్ట్ర స్థాయిలో కీలక పదవిలో ఉన్నారు. ఇక అడ్డు ఏముందన్నట్లుగా అక్రమాలతో పేట్రేగిపోయారు. అనతికాలంలోనే వందల కోట్లకు పడగలెత్తారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి. భూదందాలకు అసలు సిసలైన చిరునామాగా మారారు.

వివాదాస్పద భూములు గుర్తించేందుకు ప్రత్యేక బృందం : నియోజకవర్గం పరిధిలో వివాదాస్పద భూములు గుర్తించేందుకు అనుచరగణంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వివాదాల్ని పరిష్కరించే ముసుగులో ఇరుపక్షాలను పిలిపించి ఆ భూముల్ని అతి తక్కువ ధరకు దక్కించుకుంటారు. ఇరుపక్షాల్లో ఎవరైనా దానికి అంగీకరించకపోతే వివాదాన్ని మరింత జటిలం చేసి ముప్పుతిప్పలు పెడతారు. భూ ఆక్రమణలకు పాల్పడటం వివాదాస్పద భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటి రికార్డులు తారుమారు చేయటంలో ఆరితేరారు. రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకుని భూదందాలు నడిపిస్తున్నారు. తన అక్రమాలకు సహకరించని అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించేశారు. నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో కొన్నాళ్ల పాటు రెగ్యులర్‌ తహసీల్దార్‌లు లేకుండా ఉప తహసీల్దార్‌లను ఇన్‌ఛార్జీలుగా ముందు పెట్టి తాను అనుకున్న పనులన్నీ చేయించుకున్నారు. తొలుత భూ రికార్డులు తారుమారు చేయించి వేరే వ్యక్తుల పేరిట హక్కులు కల్పిస్తారు. ఆ తర్వాత ఆ భూములను తన పేరిట, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తారు.

దందాలు, దోపిడీల మధ్య నలిగిపోయిన సాగరనగరం - విశాఖను నంజుకుతిన్న వైసీపీ నేతలు - YSRCP Destroyed Visakhapatnam

ఉప తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని దోపిడీ : దత్తిరాజేరు, మెంటాడ మండలాల పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం భూ సేకరణ జరిగింది. అయితే అనధికారికంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతుల పేరిట ఎకరాకు రూ.3 లక్షల చొప్పున పరిహారం వచ్చేలా చేసి ఆ సొమ్మును మరో ప్రజాప్రతినిధితో కలిసి కాజేశారు. ఓ ఉప తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారు. రెండేళ్ల పాటు ఈ మండలానికి తహసీల్దార్‌ లేకుండా ఉపతహసీల్దార్‌ను మాత్రమే అడ్డం పెట్టుకుని కావాల్సిన వ్యవహారాలు నడిపించారు.

ఈ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు బొండపల్లి మండలంలో పలు క్వారీలు ఉన్నాయి. రెండేళ్ల కిందట వాటి లీజు గడువు ముగిసింది. లీజు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన అధికారులను ఆ గ్రామాల్లోకి వెళ్లనివ్వలేదు. మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేలా చేసి మమ అనిపించారు. తిరిగి ఆ లీజు దక్కించుకున్నారు. గంట్యాడ మండలంలో ఈ ప్రజాప్రతినిధికి ఒక క్వారీ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు. అయినా సరే అటు వైపు తొంగిచూసేందుకు ఏ అధికారీ సాహసించలేదు.

గజపతినగరంలోని తన భూముల్లో స్థిరాస్తి వ్యాపారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఏకంగా సుజల స్రవంతి కాలువ డిజైన్‌నే మార్పించేశారు. ఈ ప్రజాప్రతినిధి భూముల వద్దకు వచ్చేసరికి ఈ కాలువ అష్ట వంకర్లు తిరిగింది. గజపతినగరం మండలం లింగాలవలస, తుమ్మికాపల్లి, శ్రీరంగరాజపురం, గంట్యాడ మండలం మదుపాడ ప్రాంతాల్లో చంపావతి, గోస్తనీ నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపించి వాటిల్లో దోచుకున్నారు. ఇసుక, మట్టి తవ్వకాలు, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు.

అవినీతి బ్రదర్స్ - ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలో వారిదే పెత్తనం ! - YSRCP Leaders Irregularities

దేవుడి మాన్యమైనా వదల్లేదు : దత్తిరాజేరు మండలంలోని ఓ గ్రామ రామాలయానికి 15 ఎకరాల మాన్యం ఉంది. ఆ భూమికి నలుగురు రైతులు కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్నారు. తన అధికారాన్ని ఉపయోగించి ఆ భూముల్ని నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించారు. కస్టోడియన్లుగా ఉండే రైతుల పేర్లను 1-బి రికార్డుల్లోకి ఎక్కేలా చేశారు. తర్వాత ఆ భూములు తన పరమయ్యేలా కొత్త కుట్రకు తెరలేపారు. ఆలయ నిర్వహణకు నిధులు అవసరమైనందున, ఆ భూములు అమ్మేద్దామంటూ గ్రామంలోని వైసీపీ నాయకులతో ప్రతిపాదన పెట్టించారు. వాటికి కస్టోడియన్లుగా ఉన్న నలుగురు రైతుల్లో ముగ్గుర్ని తన వైపునకు తిప్పుకొని భూముల్ని నామమాత్రపు ధరకు చేజిక్కించుకున్నారు. ఆ రైతులకు సొమ్ము మాత్రం చెల్లించలేదు. ఆ తర్వాత నాలుగేళ్లుగా అసలు ఆ గ్రామం వైపే తొంగి చూడలేదు.

ఎన్నికల ప్రచారం కోసం ఇటీవల ఆ గ్రామానికి వెళ్లగా దేవుడి భూములకు డబ్బులు ఎందుకు చెల్లించట్లేదంటూ గ్రామస్థులు ఆ ప్రజాప్రతినిధిని అడ్డుకుని నిలదీశారు. దీంతో ఆయన పోలీసులను అడ్డం పెట్టుకుని వారిని స్టేషన్‌కు పిలిపించారు. వైసీపీ ప్రజాప్రతినిధిని ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులు వారిని ప్రశ్నించారు. ఆలయం పేరిట బ్యాంకు ఖాతా తెరిచిన తర్వాత చెల్లించాల్సిన సొమ్ముకు చెక్కు ఇచ్చేస్తారని చెప్పి ఆ గ్రామస్థులను పంపించేశారు. ఇలా దేవుడి భూముల్ని కొల్లగొట్టింది చాలక ఇస్తానన్న డబ్బులూ ఎగ్గొట్టేశారు.

'నాడు' ఎన్నికల ఖర్చు కోసం భూముల విక్రయం : 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్చుల కోసం 23 ఎకరాల భూమి విక్రయించిన ఈ నేత గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల భూముల్ని చేజిక్కించుకున్నారు. వీటిలో కొన్ని ఆక్రమించుకున్నవి కాగా, మరికొన్ని అతి తక్కువ ధరకు దక్కించుకున్నవి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన స్థలాల్ని నామమాత్ర ధరకు లాగేసుకున్నారు. ఓ ఇంటి స్థలానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొనగా పరిష్కరిస్తానని చెప్పి అతి తక్కువ ధరకు గుంజుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయ భవనం నిర్మించి దాని వెనక వైపున ఉన్న వారు నడిచే దారిని సైతం కబ్జా చేశారు.

విశాఖపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉంది. దాన్ని పరిష్కరిస్తానని చెప్పి అతి తక్కువ ధరకు ఆ భూమి లాగేసుకున్నారు. అందులో స్థిరాస్తి లేఅవుట్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. దారి కోసం స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. దత్తిరాజేరు, గజపతినగరం మధ్య ఓ కొండను ఆనుకుని ఉన్న 15 ఎకరాల వివాదాస్పద భూమిని, దాన్ని పక్కనే ఉన్న మరో వివాదాస్పద భూమిని నామమాత్ర ధర చెల్లించి లాక్కున్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఐదు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య వివాదంలో ఉన్న 14 ఎకరాల భూమిని మూడేళ్ల కిందట స్థానిక రెవెన్యూ అధికారి సహకారంతో కొనుగోలు చేశారు. అదే గ్రామానికి చెందిన సొంత పార్టీ నాయకుడితో ప్రస్తుతం సాగు చేయిస్తున్నారు.

అధినేత అండతో రెచ్చిపోయిన యువనేత - అభివృద్ధిలో నిల్‌ - అవినీతి ఫుల్‌ - YSRCP Leaders Irregularities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.