ETV Bharat / state

అవినీతి బ్రదర్స్ - ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలో వారిదే పెత్తనం ! - YSRCP Leaders Irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 9:59 AM IST

YSRCP Leaders Irregularities in Krishna District
YSRCP Leaders Irregularities in Krishna District(Etv Bharat)

YSRCP Leaders Irregularities in Krishna District: ఏ నియోజకవర్గానికైనా ఒక ప్రజాప్రతినిధి ఉంటారు. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు! ఒకరు గిల్లితే మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే అక్రమార్జన. ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. కమీషన్లు ముట్టచెబితే చాలు పనులవుతాయి. ఇద్దరిలో ఒకరికి 'ప్యాలెస్‌'లో మంచి పలుకుబడి ఉందని చెప్పుకొంటారు.

అవినీతి బ్రదర్స్ - ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలో వారిదే పెత్తనం (Etv Bharat)

YSRCP Leaders Irregularities in Krishna District : సోదరులైన ప్రజాప్రతినిధులిద్దరూ అవినీతికి హస్తం చాస్తారు. ఇసుకను తోడేస్తారు. మట్టిని తవ్వేస్తారు. కొండల్ని పిండేస్తారు. భూముల్ని చుట్టేస్తారు. 'తోక'లు కత్తిరించే వారు లేరు. 'మొండి'గా ఉండడమే తమ తీరు 'వసూల్‌ బ్రదర్స్‌'గా వీరికి పేరు. ఏ నియోజకవర్గానికైనా ఒక ప్రజాప్రతినిధి ఉంటారు. కానీ ఆ నియోజకవర్గానికి ఇద్దరు. ఒకరు గిల్లితే మరొకరు జోల పాడినట్లు నటిస్తారు. ఇద్దరి దారి ఒకటే అక్రమార్జన.

'వసూల్‌ బ్రదర్స్‌'గా పేరు : ఇందులో సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీలనే తేడా లేదు. కమీషన్లు ముట్టచెబితే చాలు పనులవుతాయి. ఇద్దరిలో ఒకరికి 'ప్యాలెస్‌'లో మంచి పలుకుబడి ఉందని చెప్పుకొంటారు. ఆ పలుకుబడితో ఎలాంటి కేసులైనా ఇట్టే నీరు గారుస్తుంటారని ప్రతీతి. అధికారుల నుంచి పోలీసుల వరకు వీరి అనుమతి లేకుండా పోస్టింగు తెచ్చుకునే పరిస్థితి లేదు.

పోలీసు ఠాణాలు సైతం వారి కనుసన్నల్లో నడవాల్సిందే. తాము ఓకే అంటేనే కేసు నమోదు అవుతుంది. లేదంటే ప్రైవేటు సెటిల్‌మెంట్లే. ఆ నియోజకవర్గానికి కలిసి వచ్చిన ఇసుక అక్రమ రవాణా, మట్టి దందాలు వీరికి రూ.కోట్లు కురిపించాయి. ఖాళీ స్థలాలూ వారి కళ్లను దాటిపోలేవు. సామాజిక వర్గాల సమీకరణ పేరుతో అక్కడ జరిగే కుంపట్లు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని ఓ నియోజకవర్గంలో అన్నదమ్ములు సాగిస్తున్న అరాచకాలు ఇవి. ఈ ప్రజాప్రతినిధులకు నియోజకవర్గంలో ముద్దుగా 'వసూల్‌ బ్రదర్స్‌'గా పేరు పెట్టారు.

అధినేత అండతో రెచ్చిపోయిన యువనేత - అభివృద్ధిలో నిల్‌ - అవినీతి ఫుల్‌ - YSRCP Leaders Irregularities

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వీరి సంపాదన ఎన్నో రెట్లు పెరిగింది : అన్నదమ్ములిద్దరినీ చట్టసభలకు పంపిన కృతజ్ఞతతో అధినేతకు భారీగానే కప్పం చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈ నియోజకవర్గానికి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు ఉంది. సోదరుడు(అన్న) ప్రజాప్రతినిధి అయినప్పటికీ నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను తమ్ముడే చక్కదిద్దుతుంటారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వీరి సంపాదన ఎన్నో రెట్లు పెరిగింది. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. వీరు ప్రాతినిధ్యం వహించే ప్రాంతంతోపాటు ఇతర ప్రాంతాల్లో భూములు, ఆస్తులు కొనుగోలు చేశారు. వీటిల్లో ఎసైన్డ్‌, చుక్కల భూములున్నాయి.

తవ్వకాలు జరిపి అక్రమ రవాణా : హైదరాబాద్‌కు ఇసుక రవాణా! తెలంగాణ సరిహద్దులోనే ఉన్న ఈ నియోజకవర్గం నుంచి నిత్యం వందల ఇసుక లారీలు హైదరాబాద్‌కు తరలిపోతుంటాయి. ఈ వసూల్‌ బ్రదర్స్‌ నాలుగేళ్లుగా కొన్ని కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేశారు. పేరుకే గుత్త సంస్థలు. కానీ ప్రభుత్వంలోని పెద్దలతో భాగస్వామ్యం పెట్టుకుని తమకు ఎదురు లేకుండా చేసుకున్నారు. ఇసుక లారీకి కనీసం చలానా వేసేందుకు సైతం అధికారులు భయపడే పరిస్థితి! ఎలాంటి అనుమతులు లేకుండా సీనరేజి చెల్లించకుండా ఈ తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేశారు.

వీటికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు ఓవర్‌లోడింగ్‌ (అధిక బరువు) పేరుతో వేసిన జరిమానాలే. అక్కడా గత ప్రభుత్వంలోని ఓ మంత్రితో సర్దుబాటు చేసుకుని జరిమానాలు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మున్నేరు, కృష్ణా నదులు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌, ఖమ్మం, మధిర తదితర ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గుత్తేదారు సంస్థ ఏదైనా ఇక్కడ సోదరుల అనుచరుల టిప్పర్లలోనే రవాణా జరగాలి. తవ్వకాలు వారే చేయాలి. గతంలో ఇసుక రవాణా గుత్తేదారు సంస్థ నుంచి సబ్‌లీజు తీసుకున్న వ్యక్తుల వద్ద నెలకు రూ.పది లక్షలు వసూల్‌ చేశారు. గత ఐదేళ్లుగా ఇది బహిరంగంగానే జరుగుతోంది.

విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities

అడుగడునా అరాచకాలే : ఓ వైసీపీ నేత ఇసుకను గుత్త సంస్థ నుంచి లీజుకు తీసుకుని ప్రభుత్వ పెద్దలకు నెలకు రూ.19 కోట్లు చెల్లించే వారు. కానీ ఈ సోదరుల అక్రమ రవాణా వల్ల నష్టం వస్తుందని పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆ నేత లీజును వదులుకున్నారు. ప్రస్తుతం కోడ్‌ ఉన్నా వారికి అడ్డులేదు. ఎక్కడ ఘర్షణ అయినా తమ సొంత చట్టాన్ని బయటకు తీస్తారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపైనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేయించడం రివాజుగా మారింది.

ఇక్కడ సెబ్‌ అధికారులపై వైసీపీ నేతలు దాడి చేస్తే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఓ గ్రామస్థాయి వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే పోలీసు స్టేషన్‌కు పిలిపించి బీభత్సం సృష్టించారు. ఆ దెబ్బకు భయపడిన ఎవ్వరూ మైనింగ్‌వైపు కన్నెత్తి చూడలేదు. జాతీయ రహదారిపై వెళుతున్న ఇసుక వాహనాలకు ఓ రవాణా అధికారి అధిక బరువు కింద చలానా వేస్తే శంకరగిరి మాన్యాలకు బదిలీ చేయించారు. సీఎంఓ నుంచి రవాణా శాఖకు అదేశాలు రావడంతో ఒక్క చలానా వేయలేదు. 25 టన్నులతోనే వెళ్లాల్సిన లారీలు 35 నుంచి 45 టన్నుల ఇసుక రవాణా చేస్తున్నాయి.

కప్పం చెల్లించాల్సిందేనని హుకుం జారీ : ఈ సోదరులు నియోజకవర్గంలో మట్టినీ వదలలేదు. ఎవరూ తవ్వినా తమకు కప్పం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేదంటే తమ అనుచరులే తవ్వి రవాణా చేసి విక్రయిస్తారనే షరతు విధించారు. మున్నేరు పక్కనే ఉన్న రెండు కొండల్లో నాలుగున్నరేళ్లు కంకర అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ కొండలను తవ్వి కంకరను టిప్పర్లలో తరలిస్తున్నారు. అనేకసార్లు ప్రతిపక్ష పార్టీ నేతలు కొండ వద్ద కంకర తవ్వకాలను అడ్డుకుని ఆందోళన చేశారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిని రెండు చోట్ల విస్తరించారు.

బైపాస్‌ రహదారులుగా ఆరు వరుసలు విస్తరించారు. దీనికి నాలుగు అండర్‌ పాస్‌లు, బ్రిడ్జిలు నిర్మించాల్సి రావడంతో భారీగా కంకర, మట్టి అవసరం అయింది. వీటిని సరఫరా చేసి గుత్తసంస్థ నుంచి సొమ్ము చేసుకున్న ఈ సోదరులు అసంపూర్తిగా మిగిలిన నిర్మాణ పనులను మాత్రం పరిష్కరించడంలో విఫలమయ్యారు. సోదరులతో తల నొప్పులు ఎందుకుని తమకు క్వారీ లీడ్‌ అనుమతులున్నా తవ్వి రవాణా చేసుకునే సామర్థ్యం ఉన్నా గుత్త సంస్థ వదిలేసింది. ప్రైవేట్‌ లేఅవుట్లలో రహదారుల నిర్మాణానికి తరలిస్తున్న కంకర పైనా ప్రతిరోజూ రూ.లక్షల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. స్వరూపం కోల్పోయిన కొండలే వీరి అవినీతికి విశ్వరూపంగా నిలిచాయని నియోజకవర్గం ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

భూములు కబ్జానే! నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములను బినామీ పేరిట దక్కించుకున్నారు. వివాదాలున్న భూములపై తమ్ముడు దృష్టి సారించి హైదరాబాద్‌ కేంద్రంగా సివిల్‌ పంచాయితీలు చేసేవారు. లేదంటే పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు నమోదు చేయించేవారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన అన్న దగ్గరకు వెళ్లి గోడు వెళ్లపోసుకుంటే తమ్ముడు చెప్పినట్లు చేసి పరిష్కరించుకోవాలని ఆయన సలహానిచ్చేవారు.

ప్రతి పనికి కమీషనే! : నియోజకవర్గంలో ఏ పనులు చేయాలన్నా గుత్తేదార్లు ముందుగా వసూల్‌ బ్రదర్లను మచ్చిక చేసుకోవాల్సిందే. సోదరులకు కమీషన్లు ముట్టచెప్పాల్సిందే. పనులను బట్టి ఐదు నుంచి పది శాతం కమీషన్లు ముట్టచెబితేనే కాంట్రాక్టర్లు పనులు చేసుకునేందుకు పచ్చజెండా ఊపుతారు. ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి.

దీనిలో రూ.1.25 కోట్లు కమీషన్‌ను తీసుకున్నారని గుత్తేదారు బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ ముందుకురాక ఎన్‌డీబీ పనులు నిలిచిపోయాయి. టెండర్‌ దక్కించుకున్నా కూడా పనులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఇక్కడి రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. పక్కనే తెలంగాణ రోడ్లు అద్దంలా ఉంటే ఈ నియోజకవర్గంలో మాత్రం రాళ్లు తేలి, గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉన్నాయి.

పురపాలికపై పెత్తనం! : ఈ నియోజవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. అయితే పెత్తనం అంతా తమ్ముడిదే. అధికారులు ఆయన చెప్పినట్లు వ్యవహరించారు. ఛైర్మన్‌ పేరుకే పరిమితం! అక్కడ అటెండర్‌ పనిచేయాలన్నా తమ్ముడి నుంచి అనుమతి రావాల్సిందే. ఈ విషయాన్ని ఛైర్మన్‌ స్వయంగా తమ వైసీపీ కౌన్సిలర్ల ముందే కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు. చివరకు మానసిక వేదనకు గురై ఆరోగ్యం పాడు చేసుకుని తనువు చాలించారాయన! ఈ పాపం తమ్ముడిదేనని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో ఏ పని చేయాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. ఆయన చెప్పిన వారే కాంట్రాక్టర్లుగా చేయాలి. ఈ మున్సిపాలిటీలో టెండర్లు అన్నీ అధిక శాతానికి వేసినవే. గుత్తేదారుల మధ్య ఎలాంటి పోటీ ఉండదు. తమ్ముడు చెప్పిన వారే పని చేయాలి.

మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు భారీగా మామూళ్లు ముట్టాయని ప్రతీతి. పట్టణంలో జి ప్లస్‌ 2 నిర్మాణానికే మున్సిపాలిటీ అనుమతి ఇస్తుంది. దీనికి విరుద్ధంగా పెద్దసంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఇలా అనధికార అంతస్తు నిర్మిస్తే ఒక్కొక్క ఫ్లోర్‌కి రూ.మూడు లక్షల చొప్పున మామూళ్లు తీసుకున్నారు. జాతీయ రహదారి పక్కన హైదరాబాద్‌ మార్గంలో ఉండే ఈ పట్టణంలో వెంచర్లు ఎక్కువగానే వెలిశాయి. అమరావతి రాజధాని అయితే ఈప్రాంతం అభివృద్ది చెందుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు వెంచర్లు వేశారు. వారి నుంచీ ఈ బ్రదర్స్‌ భారీగానే ముడుపులు అందుకున్నారు.

నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.