ETV Bharat / state

సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్​ - మిగతా నియోజకవర్గాల్లో 6వరకు - TS LOK SABHA ELECTIONS POLLING 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 8:45 AM IST

EC Arrangements For Polling in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేతలు, అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం నిన్నటితో ముగియగా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగు జరగనుంది. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఓటింగ్‌ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు, గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఈవీఎమ్​లతో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనునండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Polling Arrangements in Telangana
Lok Sabha Polling Arrangements in Telangana (ETV Bharat)

సమస్యాత్మక ప్రాంతాల్లో 4గంటల వరకే పోలింగ్​ మిగతా నియోజకవర్గాల్లో 6వరకు (Polling Arrangements in Telangana)

Lok Sabha Polling Arrangements in Telangana : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా 106 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగనుంది.

ఈ నియోజనవర్గాల్లో 4గంటల వరకే పోలింగ్ : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి సెగ్మెంటు, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించినప్పటికీ, ఎండ తీవ్రత ఉన్నందున సమయం పెంచాలని రాజకీయ పార్టీలు కోరడంతో సాయంత్రం 6 వరకు పొడిగించారు.

నాలుగో విడతలో తెలంగాణలో లోక్​సభతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంటు ఉపఎన్నిక నిర్వహించేందుకు మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా అతితక్కువగా ఆదిలాబాద్​లో 12 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం నిన్నటితో ముగిసింది.

లోక్​సభ సమరానికి తెలంగాణ సై - పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా అధికార యంత్రాంగం - lok sabha polling in telangana

35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు : సోమవారం పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు కుమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో అతికొద్ది మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఈ సారి అదనంగా 453 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 61 పోలింగ్ కేంద్రాల్లో పది మంది లోపే ఓటర్లు ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మన్ననూరులో కేవలం 10 మంది ఓటర్లే ఉన్నారు. 11 కేంద్రాల్లో 25 లోపు, 22 పోలింగ్ కేంద్రాల్లో 50లోపు 54 కేంద్రాల్లో వందలోపు ఓటర్లు ఉన్నారు.

పోలింగ్ బూత్‌లో ఆరుగురు సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు ఏపీవోలు, ఒక ఓఏపీ, ఒక బీఎల్వో, ఒక వాలంటీర్ విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 94వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో 597 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలు, 119 బూత్‌ల్లో దివ్యాంగులు, 119 కేంద్రాల్లో యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 229 భవనాల్లో 6కు మించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, వైద్యసదుపాయాలతో పాటు కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఈవో వికాస్‌రాజ్ ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు : డీజీపీ రవిగుప్తా - DGP Ravi Gupta On MP Elections

పోలింగ్‌ కోసం ఈవీఎమ్​లను ఇవాళ కేంద్రాలకు తరలించనున్నారు. ఈవీఎమ్​లను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్​ ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు ఎస్కార్టు, వీడియో చిత్రీకరణ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష 5 వేల 19 ఈవీఎమ్​ యూనిట్లను వినియోగించనున్నారు. ఈవీఎమ్​లో 15 మంది అభ్యర్థులు, నోటా బటన్ ఉంటాయి. దాని ప్రకారం 7 నియోజకవర్గాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, తొమ్మిది నియోజకవర్గాల్లో 2 యూనిట్లు, ఆదిలాబాద్‌లో ఒకే యూనిట్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు.

ఓటు హక్కు ఉపయోగించుకోనున్న 3.32కోట్ల మంది : రాష్ట్రంలో 3 కోట్ల 32 లక్షల ఓటర్లు ఉండగా 96 శాతం మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. వెబ్‌సైట్, యాప్‌తో పాటు 1905 ఫోన్ నంబరుకు ఓటరు కార్డు నంబరు ఎస్​ఎంఎస్​ చేసి పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చునని సీఈవో తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ జరిగిన 5వేల కేంద్రాల్లో కారణాలు పరిశీలించి అక్కడ ఓటింగ్ పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 వేల 690 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది, జర్నలిస్టుల ఓటింగ్ 82 శాతం నమోదైంది. లక్షా 88 వేల మంది ఓటు వేయగా మరో 34 వేల 973 మంది పోలింగ్ రోజునే ఓటు వేసేందుకు అనుమతి పొందారు.

పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర యునిఫాం సిబ్బంది సుమారు 65వేల మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 20 వేల మందితో బందోబస్తు ప్రణాళికలు చేశారు. కేంద్రం నుంచి 165 కంపెనీల సాయుధ బలగాలు కూడా వచ్చాయి. సోమవారం పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్​ఎంఎస్​లపై నిషేధం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని సీఈవో స్పష్టం చేశారు.

వేతనంతో కూడిన సెలవు : పోలింగ్ రోజున ప్రైవేట్ సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేకపోతే చర్యలు తప్పవన్నారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై గట్టి నిఘా పెట్టినట్లు సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. శనివారం వరకు సుమారు రూ.320 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంటు ఉపఎన్నికకు కూడా రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్, నిర్భయంగా ఓటెయ్యాలని వికాస్​ రాజ్ విజ్ఞప్తి​ - CEO Vikas Raj on Exit polls 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.