ETV Bharat / state

ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతోన్న ఉదండాపూర్​ భూ నిర్వాసితులు - కారణమిదే - Palamuru Rangareddy Residents

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 1:22 PM IST

Palamuru Rangareddy Residents Problems : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఉదండాపూర్‌ నిర్వాసితుల పునరావాసం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమగోడు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదని, ఎన్నికలు బహిష్కరించేందుకు నిర్వాసితులు సన్నద్ధమవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్న ఉదండాపూర్‌ పునరావాస సమస్యలపై కథనం.

Udandapur Village Boycotting Lok Sabha Elections 2024
Palamuru Rangareddy Residents Problems

ఓట్ల కోసం మా ఊరికి వస్తే అక్కడే ఆపేస్తాం ప్రాజెక్టు పరిహారం కోసం సుప్రీంకు వెళ్తాం

Palamuru Rangareddy Residents Problems : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఉదండాపూర్‌ జలాశయం కింద ఉదండాపూర్‌, వల్లూర్‌ సహా 7 తండాలు ముంపునకు గురవుతున్నాయి. గత ప్రభుత్వం ముంపునకు గురైన వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించింది. పునరావాస కల్పనను నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికే సర్వే పూర్తయినా, ఎవరికీ ఇళ్ల పరిహారం అందలేదు. జలాశయం నిర్మాణం కోసం భూములు ఇచ్చేయడంతో వ్యవసాయం లేకుండాపోయింది. ఉపాధి కరవైంది.

భూములకు పరిహారంగా ఇచ్చిన రూ.ఐదారు లక్షల డబ్బు ఎందుకూ కొరగాలేదు. జడ్చర్ల ప్రాంతంలో ధరలు భారీగా ఉండటంతో ఇచ్చిన పరిహారం డబ్బులతో మరో చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేయలేని పరిస్థితి. పునరావాసం కల్పించేందుకు స్థలాన్ని గుర్తించి, మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు, మురికి కాలువలు వంటి పనులు మొదలుపెట్టినా, అర్థాంతరంగా ఆగిపోయాయి. లోక్‌సభ ఎన్నికలు బహిష్కరిస్తేనైనా సర్కారు పట్టించుకుంటుందని, అందుకోసం సిద్ధమవుతున్నామని కొందరు భూ నిర్వాసితులు అంటున్నారు.

"ప్రాజెక్టు కట్టే ముందు ప్లాట్లు ఇస్తామని చెప్పారు. పదేళ్లు గడిచినా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మూడు నెల్లలోనే ఇళ్లు, ఊరికి ప్యాకేజీ ఇస్తాం అన్నారు. కానీ ఏదీ చేయలేదు. అందుకే ఎన్నికలు వద్దు అనుకున్నాం. ఓట్ల కోసం ఎవరైనా వస్తే వారిని అక్కడే ఆపేస్తాం. ఎలాంటి ఉపాధి లేదు. పక్క ఊళ్లకు వెళ్లి వ్యాపారం చేసుకుందాం అంటే రోడ్లు సరిగ్గా లేవు. వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే ఉన్న భూమి ప్రాజెక్టు కోసం ఇచ్చాం. పరిహారం కోసం సుప్రీంకు వెళ్తాం అని అనుకుంటున్నాం." - భూ నిర్వాసితులు, ఉదండాపూర్‌

Udandapur Village Boycotting Lok Sabha Elections 2024 : భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని అప్పటి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చినా అమలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించగా, అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్వాసితులతో చర్చలు జరిపారు. ఎన్నికల తర్వాత పరిహారం చెల్లిస్తామని నచ్చజెప్పారు. కానీ ప్రభుత్వం మారింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి సైతం ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయినా ఇప్పటికీ పునరావాస కల్పనపై అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికల బహిష్కరణకు సిద్ధం అవుతున్నారు.

Udandapur Village Residents Going To File Against the Project in Supreme Court : గ్రామ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వర్గాలుగా విడిపోయి తమను నట్టేట ముంచారని రైతులు వాపోతున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజాప్రతినిధులే పట్టించుకోకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులపై నమ్మకం లేదని, అసలు జలాశయమే అక్కర్లేదంటూ సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కొందరు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల బహిష్కరణపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో రంజాన్‌ తర్వాత మరోమారు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.