ETV Bharat / state

అయిదేళ్ల పాలనలో అంతా దగా - ఎస్సీ, ఎస్టీలెవరూ వైఎస్సార్సీపీకి ఓటేయొద్దు: మందకృష్ణ మాదిగ - manda krishna madiga interview

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 11:58 AM IST

manda krishna madiga interview
manda krishna madiga interview (etv bharat)

Manda Krishna Madiga Interview: జగన్ పాలనలో చేసిందంతా దగానే అని, అట్టడుగువర్గాలపై దాడులు జరుగుతున్నా మౌనం వహించారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ప్లేట్‌ ఫిరాయించారని, ఎస్సీ, ఎస్టీలెవరూ వైఎస్సార్సీపీకి ఓటేయొద్దని తెలిపారు. వర్గీకరణకు టీడీపీ హామీ ఇచ్చిందని, అందుకే కూటమికి మద్దతు తెలుపుతున్నామన్నారు. మరిన్ని విషయాలను మందకృష్ణ మాదిగ ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. అవి ఏంటో చూద్దాం.

Manda Krishna Madiga Interview: అయిదేళ్ల పాలనలో సీఎం జగన్‌.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన 27 ప్రత్యేక పథకాలను రద్దు చేయడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో చేసిందంతా మోసమేనన్నారు. దళితులపై వైఎస్సార్సీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నా ఏ రోజూ అడ్డుకట్ట వేయలేదని మండిపడ్డారు.

దళిత, గిరిజనుల కోసం ఒక్క ప్రత్యేక పథకాన్నీ అమలు చేయని జగన్‌ మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ సందర్భంగా రాష్ట్రం తరఫున న్యాయవాదిని నియమించాలని సీఎంని కోరినా పట్టించుకోలేదన్నారు. దళిత, గిరిజనులను అన్నిరకాలుగా అణగదొక్కేందుకే ప్రయత్నించారని విమర్శించారు. ఆత్మగౌరవమున్న ఏ దళితుడు, గిరిజనుడు జగన్‌కు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. ఈటీవీ భారత్​తో మందకృష్ణ మాదిగ మాట్లాడారు.

చంపేసి డోర్‌డెలివరీ చేసే స్థాయికి దాడులు: దళిత యువకుణ్ని చంపేసి డోర్‌ డెలివరీ చేసే స్థాయికి దాడుల తీవ్రతను జగన్‌ మోహన్ రెడ్డి పెంచారని అన్నారు. ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్‌ వెంటపెట్టుకుని తిరుగుతున్నారని, దళితులకు శిరోముండనం కేసులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష పడితే, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించారని తెలిపారు. దళితులకు ఇంతకు మించిన అవమానం ఏముంటుందని ప్రశ్నించారు.

'ఎస్సీల సంక్షేమాన్ని జగన్ విస్మరించారు'- కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Fires YSRCP

మాస్క్‌ అడగటమే దళిత డాక్టర్‌ నేరమా?: డాక్టర్‌ సుధాకర్‌ ఏ నేరం చేశారని శారీకరంగా, మానసికంగా వేధించి పొట్టన పెట్టుకున్నారని అన్నారు. కరోనా కాలంలో సరైన మాస్కులు లేవని అడిగినందుకు దళిత డాక్టర్‌ను మండుటెండలో చేతులు వెనక్కి విరిచి నడిరోడ్డుపై పడుకోబెట్టి హింసిస్తారా అని మండిపడ్డారు. ఈ ఘటనలు తలచుకున్నప్పుడుల్లా ఇలాంటి బతుకులు ఇప్పటికీ బతుకున్నామని కుమిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

రేషన్‌ బియ్యం కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సాయమేనా?: రేషన్‌ బియ్యం అన్ని వర్గాల పేదల కోసం దశాబ్దాలుగా అమలు చేస్తున్న పథకం అని, జగన్‌ ఆ పథకంలోని ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల సంఖ్యను పక్కకు తీసి, అదే ప్రత్యేక సాయమన్నట్టుగా లెక్కలు చూపించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. జగన్‌ అన్ని పథకాల్లోనూ ఇలాగే ఎస్సీ, ఎస్టీలను దెబ్బతీశారని ఆరోపించారు.

మద్య నిషేధం చేయకుండా ఓట్లడుగుతారా?: మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ మాట తప్పారని విమర్శించారు. పైగా సొంత కంపెనీలు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారని, కల్తీ మద్యంతో లక్షల మంది అనారోగ్యం పాలయ్యేలా చేశారని అన్నారు. వేల మంది మరణించారని, ఇక జగన్‌కు ప్రజల్ని ఓట్లడిగే హక్కు ఎక్కుడుందని ప్రశ్నించారు.

నిరుద్యోగ యువతను వలసబాట పట్టించారు: అమరావతిని విధ్వంసం చేసి, ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత జగన్‌దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదేళ్లలో ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అభివృద్ధి పూర్తిగా కనుమరుగైందని, పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించకుండా మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలనూ తరిమికొట్టారని, ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు.

ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వని వైఎస్సార్సీపీని ఓడిస్తాం : మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Meeting

వర్గీకరణపై జగన్‌ మోసం: చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే మాదిగలకు, ఉపకులాలకు 22 వేల ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఉన్నత విద్యలో న్యాయమైన వాటా దక్కిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన స్వర్ణయుగం అయితే జగన్‌ పాలన నవ్యాంధ్రకు శాపమయిందని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా వర్గీకరణ కోసం కృషి చేశారని, జగన్‌ మాత్రం గత ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటించి, తర్వాత ప్లేట్‌ ఫిరాయించేశారని ధ్వజమెత్తారు.

వర్గీకరణ ఇప్పుడు మళ్లీ కీలక దశకు చేరిందని, మోదీ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. అధికారంలోకి రాగానే శాసనసభలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, టికెట్ల కేటాయింపులో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వ్యవస్థల్లో మాదిగలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు.

అభివృద్ధి చెందకూడదనేది జగన్‌ ఎత్తుగడ: ఎస్సీ, ఎస్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కాబట్టే ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, పథకాలు అమల్లోకి తెచ్చి, వారి కోసం ఖర్చు చేశాయన్నారు. కానీ జగన్‌ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధుల్ని ఇతర కార్యక్రమాలకు యథేచ్ఛగా మళ్లించారని విమర్శించారు. వారికి ఏళ్లుగా అందుతున్న ప్రత్యేక సాయానికి పాతరేశారని, అందరికీ వర్తింపజేసే పథకాలనే వారికీ ఇస్తూ దాన్నే గొప్పగా ప్రచారం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదనే ఆలోచనతోనే ఇదంతా చేశారన్న మందకృష్ణ, నిధులు కేటాయించకుండా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

కూటమి గెలుపునకు కృషి చేస్తాం- మందకృష్ణ మాదిగ - Madiga Manda krishna

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.