ETV Bharat / state

YUVA : 2 ఏళ్లలో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - చదివింది ప్రభుత్వ బడుల్లోనే - 6 GOVT JOBS IN 2 YEARS

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 7:17 PM IST

Jagtial Man gets 6 jobs : సివిల్‌ ఇంజినీర్‌ అవుదామనుకున్నాడు ఆ యువకుడు. కానీ స్నేహితుల ప్రోత్సాహం, కెరీర్‌ బలంగా ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాలవైపు మళ్లాడు. ఆర్థిక సమస్యలు, కొవిడ్‌ ఇబ్బందులు అడ్డువచ్చినా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. 2 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. అతడే జగిత్యాలకు చెందిన సంజయ్‌. మరి అతడికి ఇది ఎలా సాధ్యమైంది? 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఎలాంటి సాధన చేశాడు? ఈ కథనంలో తెలుసుకుందాం.

Jagtial Man gets 6 jobs
Jagtial Man gets 6 jobs (ETV Bharat)

YUVA : 2 ఏళ్లలో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు- చదివింది ప్రభుత్వ బడుల్లోనే (ETV Bharat)

Jagtial Man gets 6 jobs : ఆ యువకుడిది ఓ మారుమూల ప్రాంతం. ఎదగాలనే పట్టుదలతో చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించాడు. ఇంజినీరింగ్‌ చేసే సమయంలో స్నేహితులను చూసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితం అయినా, లక్ష్యం మాత్రం మరవలేదు. తన పట్టుదల, ప్రణాళికలకు సోషల్‌ మీడియాను సక్రమంగా సద్వినియోగం చేసుకుని, 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు ఈ ఔత్సాహికుడు.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు బెత్తపు సంజయ్‌. తల్లిదండ్రులు బెత్తపు లక్ష్మి-మల్లయ్య వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేద కుటుంబం కావడంతో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే చేశాడు సంజయ్‌. చదువుల్లో రాణిస్తూ 2019లో సివిల్ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

Yong Men Gets 3 Jobs By Using Social Media : మొదట ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసి, సివిల్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించాలని అనుకున్నాడు సంజయ్‌. కానీ తోటి స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, తాను స్ఫూర్తి పొంది ముందుకు సాగాడు. జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అయితే మొదట దిశానిర్దేశం లేకుండా సాగినా, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రణాళికతో చదువుకున్నానని చెబుతున్నాడు.

ఏఈఈ ఉద్యోగంలో చేరుతా : కేవలం ఒక్కో ఉద్యోగానికి కాకుండా పలు రకాల పరీక్షలకు సిద్ధమయ్యాడు సంజయ్‌. అలా 2022లో రైల్వేలో గ్రూప్‌-డీకి ఎంపిక కాగా, టీఎస్​పీఎఎస్సీ పరీక్షలు ఉండడంతో ఉద్యోగంలో చేరలేదు. 2023లో టీఎస్​పీఎఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ అధికారిగా, అలాగే గ్రూపు-4 ఉద్యోగం, ఏఈఈ సివిల్‌, ఏఈ పోస్టులకు అర్హత సాధించాడు. ఇటీవల ఏఈ పోస్టు ర్యాంకు కార్డునూ అందుకున్నాడు. అయితే త్వరలో ఏఈఈ ఉద్యోగంలో చేరతానని అంటున్నాడు సంజయ్‌.

చిన్ననాటి కలను సాకారం చేసుకున్న గృహిణి - ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం - youth inspiration story

Jagtial Man Success Story : కేవలం రెండేళ్లలోనే ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు సంజయ్‌. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం మాత్రం తల్లిదండ్రులే అంటున్నాడు. వాళ్లు కూలీ చేసిన డబ్బులతో నన్ను చదివించారు. ఆ రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతోనే ఏ అవకాశం వచ్చినా పరీక్షలు రాసే విధంగా సిద్ధపడినట్లు తెలిపాడు.

స్నేహితుల సహకారంతో : అలాగే ఈ ఉద్యోగాలు సాధించడానికి స్నేహితులు అందించిన సహకారం మరువలేనిదని చెబుతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్న వారు కూడా ఇలాంటి విజయాన్ని సాధించవచ్చని నిరూపించాడు సంజయ్‌. ఈ విజయం మాలాంటి ఉద్యోగ ఆశావహులకు మరింత నమ్మకాన్ని కల్గించిందని సంజయ్‌ స్నేహితుడు కిరణ్‌కుమార్‌ అంటున్నాడు.

Sanjay On His Success : తల్లిదండ్రుల కష్టం చూసి చలించి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యాడు సంజయ్‌. పట్టుదల, నిరంతర సాధన, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాడు. సామాజిక మాధ్యమాలను వారధిగా మలుచుకున్నాడు. ఫలితంగా 6 ఉద్యోగాలు సాధించి, అందరి ప్రశంసలు అందుకున్నాడు ఈ పేదింటి విద్యాకుసుమం. అయితే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా, సివిల్స్​లో ర్యాంకు సాధించాలన్నదే తన ఆకాంక్షగా చెబుతున్నాడు.

కష్టాలను ఎదిరించి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Man Got Three Govt Jobs At A Time

ఇన్నాళ్లకు కల నెరవేరింది - కుటుంబ ఆలనా - పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి - Women Gets 5 Government Jobs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.