ETV Bharat / state

ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 9:22 AM IST

Jagan Government Illegal Sand Mining
Jagan Government Illegal Sand Mining Scandal

Jagan Government Illegal Sand Mining Scandal : తమిళనాడులోని ఇసుక కుంభకోణంపై ఈడీ దర్యాప్తు తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. పరిమితికి మించి అక్రమ తవ్వకాలతో తమిళనాడు ఖజానాకు 4వేల 370కోట్లు గండిపడిందంటూ ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఏపీలోనూ దర్యాప్తు చేపడితే అధికారపార్టీ అరాచకాలు అంతకన్నా ఎక్కువే వెలుగు చూడనున్నాయి. ముఖ్యనేత కుటుంబం 2021 నుంచి వేలకోట్ల రూపాయలు ఇసుక దోచేసింది. ఈడీ శాస్త్రీయ పద్ధతుల్లో తనిఖీ చేపడితే వేలకోట్ల రూపాయల కుంభకోణం బయటపడనుంది. తమిళనాడు వరకు వచ్చిన ఈడీ ఎక్కడ సరిహద్దు దాటి ఏపీలోకి వస్తుందోనని అధికారులు హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అక్కడి కలెక్టర్లను బాధ్యలను చేస్తూ ఈడీ తాఖీదులు ఇవ్వడంతో మరింత బెంబేలెత్తుతున్నారు.

ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!

Jagan Government Illegal Sand Mining Scandal : తమిళనాడులో ఇసుక కుంభకోణం ప్రకంపనాలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. సంబంధిత గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది. ఇసుక కుంభంకోణంలో రూ. 4,730 కోట్ల దోపిడీ జరిగినట్లు ఈడీ వెలుగులోకి తెచ్చింది.

అక్రమాలను అడ్డుకోని పది జిల్లాల కలెక్టర్లను విచారణకు రావాలంటూ నోటీసులిచ్చింది. అక్కడి ‘ముఖ్య’ నేత బంధువు ఒకరు దందాకు కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో అక్కడి నేతలు హడలిపోతున్నారు. కానీ అంతకుమించి ఇసుక దోపిడీ రాష్ట్రంలో జరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కసారి ఇటువైపు చూడాలే గానీ అంతకుమించి అక్రమాలు బయటపడతాయి.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్టంలో ఇసుక దోపిడీకి (Sand mining scam in AP) అంతే లేకుండా పోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ ఆదేశించినప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి డిజిటల్ పత్రాలు ఉండవు డిజిటల్ పేమెంట్లు ఉండవు. రాతకోతలన్నీ చేతితోనే నేరుగా డబ్బులు ఇచ్చిన వారికే ఇసుక విక్రయాలు. కేంద్ర దర్యాప్తు సంస్థల చూపు ఒక్కసారి రాష్ట్రంపై పడిందా బినామీ సంస్థలు, వాటి వెనక ఉన్న సూత్రధారులు బయటకొస్తారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఏం చేసినా గెలవడు - ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు:

  • తమిళనాడులో: 2022 మే నుంచి 2023 సెప్టెంబరు వరకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపింది. దీన్ని నేరుగా జలవనరులశాఖే పర్యవేక్షించింది. వివిధ నదుల్లోని పలు రీచ్‌ల్లో కలిపి మొత్తం 195 హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా 987 హెక్టార్లలో ఇసుక తవ్వి, విక్రయించినట్లు ఈడీ తేల్చింది.
  • ఏపీలో: జగన్ అధికారం చేపట్టక ముందు ఏపీఎండీసీ(APMDC) ద్వారా ఇసుక వ్యాపారం జరిగేది. ఆ తర్వాత 2021 మే 15 నుంచి ప్రైవేటు సంస్థల పేరిట జరుగుతోంది. అవి పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నాయి. 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని స్వయంగా ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదు.

చేతి రాతతోనే బిల్లులు:

  • తమిళనాడులో: ఇసుక తవ్వి, స్టాక్‌పాయింట్లకు తరలించే బాధ్యత మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. కానీ ఇసుక తవ్వకాలు మొదలుకొని రవాణా, విక్రయాలు సహా అన్నీ ఆ ప్రైవేటు సంస్థలే నడిపించాయి. జలవనరులశాఖ పేరిట ఆన్‌లైన్‌ వే బిల్లులు జారీ చేయాలి. కానీ ప్రైవేటు సంస్థలు నకిలీ బిల్లులు జారీ చేసి దోపిడీకి తెగబడ్డాయి.
  • ఏపీలో: మాత్రం తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం జరిగినప్పుడు ఆన్‌లైన్‌ వేబిల్లులే జారీ చేసేవారు. జేపీ సంస్థ వచ్చినప్పటి నుంచి చేతిరాత బిల్లులే ఇస్తున్నారు. వాళ్లు చెప్పిన ఇసుక లెక్కలే అధికారులు పరిగణనలోకి తీసుకునేలా ‘పెద్దలు’ చూశారు. దీంతో గుత్తేదారు సంస్థ తనకు నచ్చినన్ని వేబిల్లు పుస్తకాలు ముద్రించుకొని, దందా చేసింది.

వేల కోట్లలో దోపిడీ:

  • తమిళనాడులో: ఇసుక కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 4వేల730 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఈడీ లెక్కలు తేల్చింది.
  • ఏపీలో: గుత్తేదారు సంస్థకు 24 నెలలు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉంటే ఏకంగా 30 నెలలు తవ్వేసుకున్నారు. పైగా 1,528 కోట్లకు గానూ 1,059 కోట్లే చెల్లించింది. మిగిలిన సొమ్ము ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసిన ఇసుక లెక్కలు తేల్చాలంటూ ఎదురుతిరిగింది. అయితే అనుమతికి మించి కోట్ల టన్నుల అక్రమంగా తవ్వి, అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకుందనేది బహిరంగ రహస్యం. మూడు నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్న జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు ఎంత మొత్తానికి టెండరు కట్టబెట్టారనేది ఇప్పటికీ చెప్పడం లేదు.

ప్రత్తిపాటి శరత్​ అరెస్ట్ అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ

ముఖ్యనేత కుటుంబసభ్యుడే కీలకం:

  • తమిళనాడులో: ముగ్గురు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి ఇసుక దోపిడీ చేశారు. వీరు తమ కుటుంబీకులు, తెలిసినవారి పేరిట నెట్‌వర్క్‌ కంపెనీలు ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలు జరిపినట్లు ఈడీ సోదాల్లో తేలింది.
  • ఏపీలో: జేపీ సంస్థకు టెండర్ కట్టబెట్టక ముందు తమిళనాడు మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్ కీ పుట్టుకొచ్చింది. అదే ఉప గుత్తేదారుగా రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం మొత్తం గుప్పిట చిక్కించుకుంది. 2022 ఆగస్టులో టర్న్‌కీని ప్రభుత్వ పెద్దలు వెళ్లగొట్టి నేరుగా వైసీపీ నేతలే ఇసుక వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్తగా ఇసుక టెండర్లు దక్కించుకున్న సంస్థల వెనకా వైసీపీ నేతలే ఉన్నారు.

ఇసుక వ్యాపారం కీలక సూత్రధారి:

  • తమిళనాడులో: ముఖ్యనేత దగ్గర బంధువు ఇసుక సిండికేట్‌ వెనక ఉన్నారనేది ప్రధాన ఆరోపణ.
  • ఏపీలో: ‘ముఖ్య’నేత సోదరుడు ఇసుక వ్యాపారం వెనుక కీలక సూత్రధారి. ప్రస్తుతం ఆయనతోపాటు ఓ సలహాదారు, విదేశాల్లో ఎన్నికల సర్వేలు చేసిన ఓ వ్యక్తి, ప్రముఖ కార్పొరేట్‌ సంస్థకు గతంలో ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన మరొకరు కీలకంగా ఉన్నారు. నిత్యం ఇసుక వ్యాపారం ద్వారా ఎంత సొమ్ము వస్తోంది, దాన్ని ఎక్కడికి చేరవేయాలి వంటివన్నీ ‘ముఖ్య’నేత సోదరుడే పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తవ్వకాల వ్యవహారాలన్నీ గోప్యంగానే: తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఈడీ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. రాష్ట్రంలోనూ ఇలాంటి విధానాలతో పరిశీలన చేస్తే ఇసుక దోపిడీ గురించి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో ఈడీకి అక్కడి స్థానిక ప్రభుత్వం సహకరించలేదు. రాష్ట్రంలోనూ ఇసుక తవ్వకాల వ్యవహారాలన్నీ ప్రభుత్వం గోప్యంగానే ఉంచుతోంది. ఎన్జీటీ(NGT) ఆదేశాలతో ఇటీవల కేంద్ర సంస్థలు దర్యాప్తునకు వచ్చినా సహకరించకపోవడంతో సియా పర్యావరణ అనుమతులు జారీ చేసిన రీచ్‌ల వివరాలను తీసుకొని, వాటిలో కేంద్ర అధికారులు పరిశీలించారు.

ప్రేక్షకపాత్ర పోషించిన కలెక్టర్లు: కళ్లముందు ఇసుక దోపిడీ జరుగుతుంటే తమిళనాడులో పది జిల్లాల కలెక్టర్లుకు ప్రేక్షకపాత్ర పోషించారు. దీంతో ఈడీ వారిని కూడా బాధ్యులను చేసి విచారణకు రావాల్సిందిగా తాఖీదులు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలోనూ ఈడీ తనిఖీలు చేపడితే 8 జిల్లాల కలెక్టర్లు కూడా బాధ్యులవుతారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలలు ఊపిన నేతలు విచారణను ఎదుర్కొక తప్పదు. గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఇసుక వ్యవహారంలో కీలకంగా ఉన్నారు.

ఇటీవలే ఇసుక తవ్వకాల టెండర్లు జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు అప్పగించగా అంతకు ముందు తమిళనాడుకు చెందిన ఓ ముఠా తామే టెండర్లు దక్కించుకున్నామంటూ ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఇప్పుడు తమిళనాడు కుంభకోణంతో సంబంధం ఉన్నవారు వారేనని తేలింది. తమిళనాడు మాదిరిగానే ఏపీలోనూ ముఖ్యనేత సహకారంతో ఇసుక వ్యాపారం చేయాలని వారు భావించారు. అయితే అప్పటికే తమిళనాడులో ఈడీ విచారణ వేగంవంతం కావడంతో వారు ఏపీకి కూడా వస్తారనే భయంతో తమిళ ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపేశారని విశ్వసనీయవర్గాల సమాచారం.

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు - మాలో విభేదాలు సృష్టించలేరు : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.