ETV Bharat / state

సీమలో వైసీపీ దాదాగిరి - ప్రతిపక్షాలపై దాడులు - Elections in Rayalaseema

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 7:45 AM IST

Polling in Rayalaseema: రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో, హింసకు దిగింది. వైసీపీ అరాచకాలకు పోలింగ్‌ రోజు అడ్డేలేకుండా పోయింది. పోలింకేంద్రాల్లో వైసీపీ నేతలు తమ అనుచరులతో కలిసి హల్‌చల్‌ చేశారు. వైసీపీ అక్రమాలపై అభ్యంతరం చెప్పిన టీడీపీ ఏజెంట్లపై పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు.

Polling in Rayalaseema
Polling in Rayalaseema (ETV Bharat)

సీమలో వైసీపీ హింసకాండ - దాడులతో దాదాగిరి (ETV Bharat)

Polling in Rayalaseema: ఐదేళ్లపాటు అడ్డూ అదుపు లేకుండా అరాచకం సాగించిన వైసీపీ, చివరికి పోలింగ్‌రోజూ అదే విధ్వంసకాండ కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో, హింసకు దిగింది. దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లపై, దాడులు, కిడ్నాప్‌లతో ఓటర్లను భయాందోళనకు గురిచేసింది. రాళ్లు రువ్వడం వాహనాలు ధ్వంసం చేస్తూ రక్తపాతం సృష్టించింది.

చిత్తూరు జిల్లాలో నియంతృత్వం సాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు పోలింగ్‌ రోజు అడ్డేలేకుండా పోయింది. ఆయన సొంతమండలం సదుంలోని, బూరగమంద పోలింగ్‌కేంద్రంలో తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉండేందుకు వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను పెద్దిరెడ్డి అనుచరులు కిడ్నాప్‌ చేశారు. మూడు కార్లలో ఎక్కించుకుని, దుగ్గంవారిపల్లెలోని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి బెదిరించారు. తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా ఉంటే, మెడకాయలపై తలకాయలు ఉండవంటూ హెచ్చరించి వారి ఫోన్లు లాక్కున్నారు. ఈ వ్యవహంరం, కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో వారిని వదిలేశారు.

అన్నమయ్య జిల్లా పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్‌ సుభాష్‌రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, చెర్లోపల్లె దగ్గర వాహనం నుంచి కిందకు తోసేశారు. మరో ఏజెంట్‌ను రాత్రి వరకు వదిలిపెట్టలేదు. దళవాయిపల్లెలో, జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిపై దాడి చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా చిన్నగులవలూరు పోలింగ్‌ కేంద్రంలోకి దౌర్జ్యంగా వెళ్లిన మైదుకూరు వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి, తెలుగుదేశం ఏజెంట్‌ ఉగ్రనరసింహులుపై దాడి చేశారు. అనంతపురం జిల్లాతాడిపత్రి పట్టణంలో టీడీపీ ఏజెంట్లపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు. పాణ్యం నియోజకవర్గం బీసీ కాలనీలో టీడీపీ ఏజెంట్‌ వెంకటేశ్‌పై, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి చేయిచేసుకున్నారు.

ఉరవకొండలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్దే కూర్చుని, ముస్లిం ఓటర్లను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించడంతోపాటు, అడ్డుకోవడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సొంత గ్రామమైన నల్లసింగయ్యగారిపల్లిలో పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిరెడ్డిపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని బెస్తరపల్లిలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు అల్లుడు దేవినేని ధర్మతేజపై వైసీపీ మూకలు రాళ్లు విసిరారు. ఆయన కారు అద్దం ధ్వసం చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు - అడ్డొచ్చిన వారిపై దాడులు - YSRCP Leaders Attack TDP Leaders

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బ్రహ్మణకాల్వలోని,,, పోలింగ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరోగ్య పరిస్థితి సరిగాలేని భర్తను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్తున్న మహిళలపై వైసీపీ ఏజెంట్లు అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. అభ్యంతరం చెప్పిన టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. తిరుపతి జిల్లాలో దొంగ ఓట్లు వేసేందకు యత్నించిన వారిని తెలుగదేశం నేతలు అడ్డుకున్నారు. తిరుపతిలో, వైసీపీ కార్పొరేటర్ దొంగఓట్లు వేసేందుకు యత్నించారు. అడ్డుకున్న ఎన్డీఏ నేతలను చంపుతామని బెదిరించారు. తిరుపతిలోని మరో కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని, కూటమి నేతలు అడ్డుకున్నారు.

రాయలసీమలో రణరంగం - దాడులతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన వైఎస్సార్​సీపీ - YSRCP Leaders Terrorized Voters

నంద్యాల జిల్లా రుద్రవరంలో వైసీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైకాపా అభ్యర్థి బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, టీడీపీ నేత జగత్‌ విఖ్యాత్‌రెడ్డి అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించేశారు. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్‌రెడ్డి కారు డ్రైవర్‌పై, వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరులో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకోగా, పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ, బీజేపీ వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈఘటనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డి తలకు గాయమైంది. చిత్తూరు జిల్లా యాదమర్రిలో ముస్లింలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడపలో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లను లోపలికి అనుమతించడంపై తెలుగుదేశం అభ్యర్థి మాధవిరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ - బూత్​ల వద్ద వైఎస్సార్సీపీ నేతల భీభత్సం - Joint Chittoor district Elections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.