ETV Bharat / state

వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ - పిల్లల బతుకులతో జగన్​ సర్కారు ఆటలు - YCP Destroy The Education System

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 9:10 AM IST

CM Jagan Has Destroy The Education System
CM Jagan Has Destroy The Education System

CM Jagan Has Destroy The Education System: వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. అసంబద్ధ సిలబస్‌ను అమలుచేసి పిల్లలు, టీచర్లను గందరగోళంలోకి నెట్టేశారు. జగన్‌ వైఖరితో వందలాది ఎయిడెడ్‌ స్కూళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ఆవాసానికి కిలోమీటరు దూరంలో ఉండాలనే నిబంధనను తెచ్చి విద్యా హక్కు చట్టాన్ని సవరించింది.

వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థ- పిల్లల బతుకులతో జగన్​ సర్కారు ఆటలు

CM Jagan Has Destroy The Education System: మీకు పేద పిల్లలు బాగుపడడం ఇష్టం లేదా. వాళ్లు ఇంగ్లీష్​ మాట్లాడడం ఇష్టం లేదా. సర్కారు బడులు బాగుపడడం ఇష్టం లేదా అంటూ ప్రభుత్వ విద్యను సంస్కరించేందుకు అవతరించినట్లు మాట్లాడే జగన్‌ ఐదు సంవత్సరాలలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేశారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ ప్రేమ నటిస్తూ వారికి చదువును దూరం చేశారు. తరగతుల విలీనం పేరుతో బడులకు తాళాలేశారు. అసంబద్ధ సిలబస్‌ను అమలుచేసి పిల్లలు, టీచర్లను గందరగోళంలోకి నెట్టారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం విద్యా వ్యవస్థను చెరబట్టారు. మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామంటూ టీచర్ల నియామకాలను నిలిపేశారు. జగన్‌ వైఖరితో ప్రభుత్వ బడులు, వందలాది ఎయిడెడ్‌ స్కూళ్లు కాలగర్భంలో కలిసి పోగా ఉన్నత విద్య అస్తవ్యస్తమైంది.

సంస్కరణల పేరుతో ఊరి బడికి ఊరితాళ్లు: రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్‌ సంస్కరణల పేరుతో ఊరి బడికి ఊరితాళ్లు వేశారు. ఎస్సీ, ఎస్టీల ఆవాసాల్లోని స్కూళ్లను మూసేశారు. వైసీపీ వచ్చిన తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి 1952 బడులకు తెరదించారు. పాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను సబ్జెక్టు టీచర్ల బోధన పేరుతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ఆవాసానికి కిలోమీటరు దూరంలో ఉండాలనే నిబంధనను విద్యా హక్కు చట్టాన్ని సవరించి మరీ ప్రభుత్వం మార్చేసింది.

విద్యార్థుల నిధులపై కన్నేసిన జగన్ సర్కార్​ - విద్యా కార్యక్రమాల ప్రచార పేరుతో 4 కోట్లు

ఎయిడెడ్​ వ్యవస్థను నాశనం చేసిన జగన్​ సర్కారు: ఎయిడెడ్‌ ఆస్తులపై కన్నేసిన జగన్‌ సర్కారు ఆ వ్యవస్థను నాశనం చేసింది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ సంస్థలను కనుమరుగు చేసింది. వాటిని ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లేదంటే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశించి బలవంతంగా ఆ వ్యవస్థను లేకుండా చేయాలని చూసింది. దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్‌ అధికారంలోకి వచ్చే నాటికి 2,202 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఉండగా ప్రస్తుతం 837 మాత్రమే మిగిలాయి. 845 బడులు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కి ఇచ్చేసి ప్రైవేటుగా మారిపోయాయి. 423 బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. 122 జూనియర్‌ కళాశాలలకు ప్రస్తుతం 44 మాత్రమే మిగిలాయి. 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల సంఖ్య 63కి పడిపోయింది. 6 కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణ అప్పగించేశాయి. మరో 68 ప్రైవేటుగా మారిపోయాయి.

టీచర్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీన ప్రక్రియలకు తెరతీసింది. ఉన్నవారినే సర్దుబాటు చేసి కొత్త నియామకాలు లేకుండా చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 1,69,642 మంది మాత్రమే పని చేస్తున్నారు. 18,520 ఖాళీలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్దిగా ముందు 6,100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసింది. చివరకు ఎన్నికల కోడ్‌తో అదీ నిలిచిపోయింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి, ఐదు సంవత్సరాలలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. పాదయాత్ర సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ ఇచ్చిన జగన్ దానిని తుంగలో తొక్కి అసలా పోస్టులే లేకుండా చేశారు. 7 వేలకుపైగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్జీటీ పోస్టులను రద్దు చేశారు.

ఎడెక్స్‌తో వింత ఒప్పందం - కోర్సు అంతర్జాతీయం - సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి!

టీచరే బోధనేతర పనులూ చేయాల్సిన దుస్థితి: రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేసి ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని బాకా ఊదిన జగన్‌ చివరికి ఏకోపాధ్యాయ బడుల విషయంలో జాతీయ రికార్డు సంపాదించారు. రాష్ట్రంలో 2020 అక్టోబరు నాటికి సింగిల్‌ టీచర్‌ బడులు 7,774 ఉండగా ప్రస్తుతం అవి 9,602కు పెరిగాయి. ఇది దేశంలోనే అత్యధికం. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో దానికి కొర్రీ పెట్టారు. 1నుంచి 5 తరగతులున్న పాఠశాలల్లో ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం, ఐదో తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారింది. బోధనేతర పనులూ ఆ టీచరే చేయాల్సిన దుస్థితితో పాఠాలు చెప్పేందుకు సమయం లేకుండా పోయింది.

కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇది తమ ఘనతేనని సీఎం జగన్‌ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్‌ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన వారికి రీ-అడ్మిషన్లు ఇచ్చి, పిల్లల సంఖ్య పెరిగినట్లు చూపేందుకు ప్రయత్నించారు. సీబీఎస్‌ఈ, బైజూస్, టోఫెల్‌ అంటూ ప్రభుత్వం అమలు చేసిన గందరగోళ విధానాలతో విసుగుచెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్లిపోయారు. 2021-22లో 44,29,569 మంది విద్యార్థులు ఉండగా 2023-24 వచ్చేసరికి 38,68,333కు తగ్గిపోయింది. ఇది కాకుండా రికార్డుల్లో ఉన్న వారిలో లక్షన్నర మంది విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా బడికే రావడం లేదు. ఈ సంఖ్యను కూడా తీసేస్తే వాస్తవ విద్యార్థుల సంఖ్య 36లక్షలకు మించదు. మరోవైపు 1.73 లక్షల మంది మధ్యలోనే చదువు మానేశారు.

గిరిజన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి - ఆరు గంటలు ధర్నా

పూర్తి కాని నాడు - నేడు పనులు: మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పిన జగన్‌ నాడు నేడు కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు రెండో విడతవే పూర్తి చేయలేదు. పనులు పూర్తి చేసినట్లు జగన్‌ సర్కార్‌ చెబుతున్న మొదటి విడతలోనూ అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019 నవంబరు 14న నాడు-నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా 2021 ఆగస్టు 16 నాటికి వీటిని పూర్తి చేశారు. అదే రోజున రెండో విడతకు శ్రీకారం చుట్టారు. వీటిని పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పనులు ఎక్కడికక్కడ నిలిపేశారు.

విద్యార్థుల మానసిక పరిణతి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పట్టించుకోకుండా జగన్‌ సర్కార్‌ సిలబస్‌పై తీసుకున్న నిర్ణయాలు తీవ్ర గందరగోళానికి కారణమయ్యాయి. తొలుత రాష్ట్ర సిలబస్‌లోని పుస్తకాలను మార్చింది. 2022-23 నుంచి సీబీఎస్‌ఈని తెచ్చింది. ప్రపంచంలో దీనికి మించిందే లేదని ప్రచారం చేసింది. రెండేళ్లలోనే మూలకు పడేసింది. తాజాగా ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌ అంటూ ఓట్ల కోసం కొత్త ప్రచారం అందుకుంది. ఇలా రకరకాల ప్రయోగాలతో పిల్లలను అయోమయానికి గురి చేసింది. బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చారు. దాన్ని వినియోగిస్తుండగానే లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి కొత్తగా కంటెంట్‌ తయారుచేసింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పట్టించుకోకుండా సిలబస్‌లు మార్పు చేయడంతో పిల్లల అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోయాయి. చాలామంది దీన్ని భరించలేక ప్రైవేటుకు వెళ్లిపోయారు.

ఉన్నత విద్యను ఉరి తీస్తున్న జగన్​ సర్కార్​

జగన్‌ సర్కార్‌ నిర్ణయాలతో ఉన్నత విద్య అస్తవ్యస్తంగా తయారైంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిలిపివేశారు. దీంతో వర్సిటీల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు వాటిలో సీటు ఇస్తామన్నా చేరేవారు లేరు. పీజీలో 44 వేలకు పైగా సీట్లు ఉంటే చేరుతున్న వారు 17 వేలకు మించడం లేదు. ఐదేళ్లలో వర్సిటీల్లో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. అన్ని వర్సిటీల్లో కలిపి 3వేల 480 పోస్టులు ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారు 845 మంది మాత్రమే. 3వేల 220 పోస్టుల భర్తీకి అనేక లోపాలతో ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం దీనిపై కేసులు పడడంతో చివరికి నోటిఫికేషన్‌ సవరిస్తామంటూ సమాధానమిచ్చింది. మరోవైపు సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలో 24 ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు ఉంటే ఒక్కో కోర్సుకు 20వేలు చెల్లించకుండా వాటిని మూసివేయాలని ఆదేశించారు. పేద పిల్లలకు ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులను దూరం చేసే ఎత్తుగడ వేశారు.
అమ్మఒడి సాయాన్ని ఆయా సంస్థలకు ఫీజులుగా చెల్లించాలని ఉత్తర్వులు- తల్లులకు విద్యాశాఖ ఆదేశాలు

విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా తన వంది మాగధులను జగన్‌ నియమించారు. వారు అక్కడ చదువును పూర్తిగా గాలికొదిలేసి వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చారు. మంత్రి పెద్దిరెడ్డి సిపార్సుతో అర్హత లేని ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌రెడ్డిని ఎస్వీ విశ్వవిద్యాలయం వీసీగా నియమించారు. ఆంధ్ర వర్సిటీని భ్రష్ఠుపట్టించారని, రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాదరెడ్డిని రెండోసారీ వీసీగా నియమించారు. ఈయన ఏకంగా వర్సిటీలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా పనిచేసిన రామకృష్ణారెడ్డి విద్యార్థులను కటకటాల్లోకి పంపించి మరీ వర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్‌ బంధువైన విక్రమ సింహపురి వర్సిటీ వీసీ సుందర్‌ వల్ల ఆధ్వర్యంలో జగన్‌ స్మరణలో తరించిపోతోంది. నాగార్జున వర్సిటీ ఉపకులపతి రాజశేఖర్‌ జగన్‌ మూడు రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వీసీ హోదాను దిగజార్చారు. జేఎన్‌టీయూ వీసీ ప్రసాదరాజు వర్సిటీని వైసీపీ కార్యకలాపాలకు కేటాయించారు.

పది పరీక్షల్లో కొత్త విధానం - ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్

ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిపివేత: జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిపేశారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం పథకాన్ని రద్దుచేశారు. బాలికలకు ప్రత్యేక ఇంటర్మీడియట్‌ విద్యంటూ ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో పుస్తకాలు, అధ్యాపకులు లేకుండా చేయడంతో 88 శాతం మంది పేద బాలికలు ఫెయిలయ్యారు. ఇదే కారణంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఆశ్వనీతేజ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది జగన్‌ సర్కార్‌ చేసిన హత్యగా భావించాలి. డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ పేరుతో పిల్లలతో రొయ్యలు ఒలిపించారు. బేకరీల్లో, కిరాణా దుకాణాల్లో పని చేయించారు. ఇలా ఇంటర్న్‌షిప్‌ చేసిన పూర్తి చేసిన చాలా మందికి ఉద్యోగాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీలో ఒక సెమిస్టర్‌ మొత్తం ఈ పనులు చేయడం వల్ల మూడేళ్ల డిగ్రీలో నాణ్యత లేకుండాపోయింది. ప్రవేశాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో నాణ్యమైన చదువు లేక పక్క రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. 2020-21లో డిగ్రీ ప్రవేశాలు 2.62 లక్షలు ఉంటే ఈ ఏడాది 1.55 లక్షలకు పడిపోయింది.

జగన్‌ గత ఐదు సంవత్సరాలలో తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో రూ.3,174 కోట్ల భారం మోపారు. 2023 - 24 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాల ఫీజు ఇవ్వలేదు. ఒక్క విడతకు బటన్‌ నొక్కినా 50 శాతం మందికి డబ్బులు పడలేదు. మూడు విడతల డబ్బులు రూ. 2,124 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రులే భరించారు. కరోనా సమయంలో మరో 600 కోట్లు ఎగ్గొట్టారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు 2020-21 నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం రూ. 450 కోట్లకు చేరుకుంది. రెండు సంవత్సరాలుగా వసతి దీవెన ఇవ్వడమే లేదు.

విద్యార్థులు తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ - విద్యాశాఖలో అంతా అవినీతే: విజయ్‌కుమార్‌ - Vijay Kumar On ap education system

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.