ETV Bharat / state

కాంగ్రెస్ పాలన @ 100 రోజులు - 5 హామీలను అమలు చేసిన సర్కార్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 7:33 AM IST

100 Days Of Congress Govt in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి వంద రోజులయింది. ఆరు గ్యారంటీల్లోని పదమూడు కార్యక్రమాల్లోని ఐదు పథకాలను అమల్లోకి తెచ్చింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ దశల్లో ఉన్న 29,384 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలను ఇచ్చింది. పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సర్కార్ రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్ల పనులకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జిల కమిటీలను ఏర్పాటు చేసింది.

100 Days Congress Govt in Telangana
100 Days Congress Govt in Telangana

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై నేటికి వంద రోజులు

100 Days Of Congress Govt in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి వంద రోజులయింది. ఆరు హామీలతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఈ వంద రోజులు ప్రధానంగా దృష్టి పెట్టింది. గత డిసెంబరు 7న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజున ప్రగతిభవన్ వద్ద కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రగతిభవన్ పేరును జ్యోతిబాఫూలే భవన్‌గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనే ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రధానంగా దృష్టి సారించింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాల్లో ఐదు పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తెచ్చింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించింది. పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల మంది అతివలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో వెల్లడైంది.

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Congress Six Guarantees Telangana : ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. మహాలక్ష్మి పథకంలో రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్‌ను అందించే గృహజ్యోతి పథకానికి ఈనెల నుంచి శ్రీకారం చుట్టింది. సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని (Indiramma House Scheme) ప్రారంభించింది. నియోజకవర్గానికి 3500 చొప్పున రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ప్రారంభం కావాల్సి ఉన్న ఎనిమిది పథకాలు : అభయహస్తంలో మరో ఎనిమిది పథకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మహిళలకు నెలకు రూ.2500లు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000లు, వ్యవసాయ కూలీలకు రూ.12,000లు, వరి క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం అమలు కావాల్సి ఉంది. ఇళ్లు లేని పేదలకు స్థలం, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షలు విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు, పింఛను రూ.4000లకు పెంపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.

ఉద్యోగాల విషయంలో తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలీసు, వైద్యారోగ్య శాఖ, గురుకుల సొసైటీల్లో వివిధ దశల్లో పెండింగులో ఉన్న 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది. సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలను కల్పించింది. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్‌రెడ్డిని ఛైర్మన్‌గా కొత్త కమిషన్ ఏర్పాటు చేసింది.

గ్రూప్-1 పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification 2024)విడుదల చేసింది. సుమారు 70 కిలోమీటర్ల కొత్త మార్గంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు శంకుస్థాపన చేసింది. రూ.2700 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చింది.

Congress Hundred Days Ruling : దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా సుమారు రూ.40,232 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. రైతు సమస్యల పరిష్కారానికి రైతునేస్తం కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.97 కోట్లతో 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం చేయడంలో భాగంగా తొలి విడతగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను నెలకొల్పింది.

సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి పలు వినతి పత్రాలను అందించారు. ఫలితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, మెహిదీపట్నంలో రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. హైదరాబాద్ కరీంనగర్‌ రాజీవ్ రహదారిపై రూ.2232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు జాతీయ రహదారి-44పై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు.

రూ.50 వేల కోట్లతో లండన్ థేమ్స్ రివర్ తరహాలో మూసీ నది డెవలప్​మెంట్ : సీఎం రేవంత్ ​రెడ్డి

ధరణి సమస్యలపై కమిటీ : ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. మూసీ పునరుజ్జీవం, పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు కోసం కసరత్తు చేస్తోంది. బంజారాహిల్స్‌లో బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌ను, ఎల్బీనగర్ సమీపంలో బైరామల్‌గూడా ఫ్లై ఓవర్, ఉప్పల్ సమీపంలో నల్లచెరువు సీవేజ్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు నూతన భవనం కోసం వంద ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలు, రాజీవ్‌ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన జరిగింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు, కవులు కళాకారులు సినిమాలకు గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేలా వడ్డీ లేని రుణాలు, యునిఫామ్ కుట్టే పని అప్పగింత వంటి కార్యక్రమాలను చేపట్టింది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబరుసో టీఎస్‌ను టీజీగా మార్చింది. జయజయహే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ఖరారు చేసిన సర్కార్ అధికార చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. మహిళల రద్దీ దృష్ట్యా వంద కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది.

జగ్జీవన్​రామ్ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి : సీఎం రేవంత్ ​రెడ్డి

ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల విభాగాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. కాళేశ్వరంపై (Kaleshwaram Project)సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, విద్యుత్ ప్రాజెక్టులపై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీలను తెలంగాణ సర్కార్ నియమించింది. ఔటర్‌ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పెంపకం పథకాలు, ధరణి ఏజెన్సీ, మిషన్ భగరీథ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, జీఎస్టీ ఎగవేతను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపిస్తోంది.

భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

'సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం - ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.