ETV Bharat / sports

ముంబయిపై 'ఫ్రేజర్' విధ్వంసం- అయినా ఆ రికార్డులు అందలేదు! - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 7:20 AM IST

Jake Fraser McGurks
Jake Fraser McGurks

Jake Fraser IPL 2024: దిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్ ఈ సీజన్​లో అదరగొడుతున్నాడు. తాజాగా ముంబయితో మ్యాచ్​లో బీభత్సం సృష్టించాడు. అయితే ఫ్రేజర్ ఈ మ్యాచ్​లో అద్భుతంగా ఆడినప్పటికీ పలు ఐపీఎల్ రికార్డులను అందుకోలేదు.

Jake Fraser IPL 2024: 2024 ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రఫ్పాడిస్తున్నాడు. ఇప్పటికే దిల్లీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఖాతాలో వేసుకోగా, తాజాగా ముంబయితో మ్యాచ్​లోనూ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్​లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఒకటి కన్నా ఎక్కువ అర్ధశతకాలు (2) నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఫ్రేజర్ మెరుపు బ్యాటింగ్​తో దిల్లీ కూడా తన పవర్​ప్లే రికార్డు మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్​లో దిల్లీ తొలి 6 ఓవర్లలో 92-0 తో నిలిచి, గత రికార్డు (88-2)ను అధిగమించింది. అయితే ఫ్రేజర్ ఇన్నింగ్స్​తో ఇన్ని ఘనతలు అందుకున్నా, ఒక్క రికార్డు మాత్రం బ్రేక్ చేయలేదు. అదేంటంటే?

ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా సెట్ చేసిన ఓ అరుదైన రికార్డును మాత్రం ఫ్రేజర్ బద్దలుకొట్టలేకపోయాడు. దాదాపు 10ఏళ్లుగా ఆ రికార్డు పదిలంగా రైనా పేరిటే ఉంది. 2014 సీజన్​లో అతడు పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)పై బీభత్సం సృష్టించాడు. ఆ మ్యాచ్​లో భారీ లక్ష్య ఛేదనలో రైనా పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు సాధించాడు. రైనా దెబ్బకు చెన్నై స్కోర్ 6 ఓవర్లకే 100 దాటింది. అప్పట్లో అదే అత్యధిక పవర్​ప్లే స్కోర్ కూడా.

అయితే ముంబయితో మ్యాచ్​లో ఫ్రేజర్ దూకుడు చూస్తే రైనా రికార్డు ఈసారి బద్దలవుతుందని అనుకున్నారంతా. కానీ, ఫ్రేజర్ 84 (27 బంతుల్లో) వ్యక్తిగత పరుగుల వద్దే ఇన్నింగ్స్​ ముగించాడు. దీంతో మరోసారి మరో బ్యాటర్ రైనా రికార్డు దగ్గర వరకు వచ్చినా బ్రేక్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 'రైనా రికార్డు ఎప్పటికీ చెదరనిది' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తున్నారు.

అందులోనూ రైనాను దాటలేదు
ఇక 80+ స్కోర్ చేసి అత్యధిక స్ట్రైక్​ రేట్ సాధించిన రికార్డు కూడా రైనా పేరిటే ఉంది. ఆ మ్యాచ్​లో రైనా 348.00 స్ట్రైక్​రేట్​తో పరుగులు సాధించాడు. తాజాగా జేక్ ఫ్రేజర్ 311.11 స్టైక్​రేట్​ నమోదు చేశాడు. ఈ క్రమంలో స్ట్రైక్ రేట్ విషయంలోనూ ఫ్రేజర్, రైనా రికార్డు బ్రేక్ చేయలేకపోయాడు.

మరోవైపు ఫ్రేజర్ బాదిన 84 పరుగుల్లో 80 రన్స్​ బౌండరీల ద్వారానే రావడం విశేషం. అంటే 95.23 శాతం పరుగులు బౌండరీల ద్వారా సాధించాడు. అయినప్పటికీ ఈ జాబితాలోనూ రైనానే ముందున్నాడు. అతడి ఇన్నింగ్స్​ (87, 25 బంతుల్లో)తో 84 పరుగులు బౌండరీలతో వచ్చినవే. అది 96.55 శాతం. ఈ లెక్కన ఫ్రేజర్ 1.32 శాతం తక్కువతో ఉన్నాడు.

జేక్​ ఫ్రేజర్ ఊచకోత - 310కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ముంబయిపై విరుచుకుపడుతూ! - IPL 2024 DV VS MI

పోరాడి ఓడిన ముంబయి - దిల్లీ ఖాతాలో ఐదో విజయం - IPL 2024 DC VS MI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.