ETV Bharat / spiritual

పంచముఖి 'రుద్రాక్ష' ధ‌రిస్తే గుండె సంబంధిత వ్యాధులు పరార్​! ఈ నియమాలు పాటిస్తేనే!! - Rudraksha Health Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 4:45 AM IST

Rudraksha Benefits In Telugu : హిందువులు పరమేశ్వర స్వరూపంగా భావించే రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రాక్ష ధరించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? వంటి పలు ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Rudraksha Benefits In Telugu
Rudraksha Benefits In Telugu

Rudraksha Benefits In Telugu : రుద్ర అంటే శివుడు- అక్ష అంటే కన్ను, రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమశివుని కంటి నుంచి నుంచి జాలువారిన నీటి బిందువుల నుంచి మొలిచిన మొక్కలు పెద్ద వృక్షాలుగా మారాయని, ఆ వృక్షాల నుంచి వచ్చిన కాయలే ఈ రుద్రాక్షలని భక్తుల విశ్వాసం.

రుద్రాక్షల పురాణ చరిత్ర
రుద్రాక్షలు పురాణ కాలం నుంచి ఉండేవని మనకు అతి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలుస్తోంది. యుగయుగాల నుంచి రుషులు, మునులు, వేదాంతులు అందరూ రుద్రాక్షలను ధరించేవారు. ఇప్పటికీ ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, దేవాలయంలో పూజ చేసే పూజారులు, ప్రవచనకర్తలు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూనే ఉన్నాం.

పూజామందిరంలో రుద్రాక్షలు
రుద్రాక్షలు ధరించాలంటే కొన్ని కఠిన నియమాలు పాటించాలి. అలా పాటించలేని వారు రుద్రాక్షలను పూజామందిరంలో ఉంచుకుంటారు. రుద్రాక్షలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా రుద్రాక్షకు ఉన్న ముఖం ఆధారంగా వాటి స్వరూపము నిర్ధరిస్తారు.

ఏకముఖి రుద్రాక్ష
సాక్షాత్తు శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా భావించే ఈ ఏకముఖి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. ఈ రుద్రాక్ష విలువ కూడా ఎక్కువే! తాంత్రిక శక్తులను తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న ఈ రుద్రాక్షను ధరిస్తే శిరః సంబంధ రోగాలు పోతాయి. సిరిసంపదలు కలుగుతాయి అని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతారు.

ద్విముఖి రుద్రాక్ష
ద్విముఖ రుద్రాక్షను శివపార్వతుల స్వరూపమని కొందరు అంటే బ్రహ్మ స్వరూపమని మరి కొందరు అంటారు. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని నమ్మే ఈ రుద్రాక్షను ధరిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. మనః సంబంధిత రుగ్మతలు నశిస్తాయి. వ్యాపార వృద్ధి కలుగుతుంది.

త్రిముఖి రుద్రాక్ష
త్రిమూర్తి స్వరూపంగా భావించే ఈ రుద్రాక్ష చాలా అదృష్టదాయకమైనది. ఈ రుద్రాక్ష ధనధాన్యాలు, సిరిసంపదలను ఇస్తుంది. ఈ రుద్రాక్ష ధరిస్తే కామెర్ల వ్యాధి నివారణ, సర్పదోష నివారణ అవుతుంది.

చతుర్ముఖ రుద్రాక్ష
చతుర్ముఖ రుద్రాక్ష నాలుగు వేదాలకు ప్రతీక అని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రుద్రాక్షను జోతిష్య శాస్త్ర వేత్తలు, గణితశాస్త్ర అధ్యయనం చేసేవారు ధరిస్తారు. దాని వలన ఏకాగ్రత పెరిగి చక్కగా రాణిస్తారు.

పంచముఖి రుద్రాక్ష
పంచభూతాలకు ప్రతీక, బ్రహ్మ స్వరూపమైన పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన అకాల మృత్యు నివారణ, గుండెపోటు వంటి హృద్రోగ సంబంధిత వ్యాధులు తగ్గుతాయిని శాస్త్ర వచనం. రుద్రాక్షల వల్ల సత్ఫలితాలు కావాలంటే ఈ నియమాలు తప్పనిసరి!

రుద్రాక్షలు ధరించే వారు తప్పని సరిగా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. రుద్రాక్షలు ధరించి మద్య మాంసాలు సేవించకూడదు. తప్పనిసరిగా శుచి శుభ్రతలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. నియమ నిష్ఠలను పాటించాలి. దంపతులు దాంపత్య సమయంలో రుద్రాక్షలు ధరించరాదు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారికి సత్ఫలితాలు కలుగుతాయి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.