Astrological Benefits of Peacock Feather : మనలో చాలా మంది చిన్నప్పుడు నెమలి ఈకలు కనిపిస్తే చాలు పుస్తకాలలో దాచుకునే వారు. అవి బుక్స్‌లో ఉండటం వల్ల చదువు బాగా వస్తుందని నమ్మేవారు. ఇదిలా ఉంటే.. కొందరు ఇల్లు అందంగా కనిపించాలని, ఆహ్లాదంగా ఉండాలని ఇంట్లో గోడలకు నెమలి ఈకలను పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అయితే, నెమలి ఈకలను కొంతమంది అలంకరణ వస్తువుగానే చూస్తారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వాటిని ఇంట్లో ఉంచుకోవడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు.. నెమలి(Peacock) ఈకలు ఇంట్లో ఉండడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి : నెమలి ఈకలు ఇంట్లో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడడమే కాకుండా నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఎందుకంటే.. అవి ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాలను తిప్పికొట్టే సామర్థాన్ని కలిగి ఉంటాయట. కాబట్టి, మీ ఇల్లు లేదా కార్యాలయంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.
ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలకు సంపద, సమృద్ధిని కలిగించే లక్ష్మీదేవితో బలమైన సంబంధం ఉంది. కాబట్టి, వీటిని మీ ఇంట్లో డబ్బు దాచుకునే చోట లేదా వ్యాపార స్థలంలో ఉంచుకోవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో సంపన్న వాతావరణాన్ని సృష్టిస్తాయని, మంచి విజయ అవకాశాలను తెచ్చి పెడతాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.
సృజనాత్మకతను పెంచుతాయి : ఇంట్లో నెమలి ఈకలు ఉండటం వల్ల సృజనాత్మక స్ఫూర్తి, కళాత్మక ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అంతేకాకుండా, క్రియేటివ్ ఫీల్డ్ లో పని చేస్తున్న వాళ్లు ఇంట్లో నెమలి ఈకని పెట్టుకుంటే ఆ రంగంలో ఉన్నతంగా రాణిస్తారంటున్నారు జ్యోతిష్య పండితులు.
పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?
భార్యాభర్తల బంధం మరింత బలోపేతం : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నెమలి ఈకలు ఇంట్లో ఉండడం వల్ల భ్యార్యాభర్తల బంధం మరింత బలోపేతమవుతుందట. ముఖ్యంగా వీటిని బెడ్రూమ్లో అలంకరణ వస్తువుగా ఉపయోగించడం వల్ల ప్రేమ, ఆప్యాయత, సామరస్య సంబంధాలు పెరిగి కలహాలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
ఆఫీసులో ఉత్పాదకతను పెంచుతుంది : మీ ఆఫీసు వద్ద లేదా వర్క్ డెస్క్‌పై నెమలి ఈకను ఉంచడం వల్ల మీ ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. నెమలి ఈకపై దుమ్ము పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలా ఉంటే అది ప్రతికూలంగా మారవచ్చంటున్నారు.
వాస్తు దోషాలను తొలగిస్తాయి : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు, వీటిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలను తొలగించుకోవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇందుకోసం ఎనిమిది పొడవాటి నెమలి ఈకలను తెల్లటి దారంతో కట్టి ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి. అయితే, వాటిని కట్టేటప్పుడు "ఓం సోమయ్ నమః" అని జపించాలట. ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇవేకాకుండా.. నెమలి ఈకను ఇంట్లో ఉంచడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
'క్రోధి' నామ సంవత్సరంలో ప్రపంచమంతా ఉద్రిక్తత- ఆవేశంతో ప్రజలు! పండితుల మాటేంటి?