ETV Bharat / politics

పేరుకే ఎంపీలు, పెత్తనానికి కీలుబొమ్మలు - వైఎస్సార్సీపీ ఎంపీలకు తీవ్ర పరాభవం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 7:31 AM IST

mp_under_jagan_control
mp_under_jagan_control

YSRCP MPs are powerless : లోక్‌సభ ఏర్పడిన తొలినాళ్లలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును దూరం చేసుకున్న వైఎస్సార్సీపీ అధినాయకత్వం మరికొందరినీ దూరం పెడుతోంది. తాజాగా జగన్‌ దిల్లీ పర్యటనలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎదురైన పరాభవం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

పేరుకే ఎంపీలు, పెత్తనానికి కీలుబొమ్మలు - వైఎస్సార్సీపీ ఎంపీలకు తీవ్ర పరాభవం

YSRCP MPs are powerless : సొంత పార్టీ ఎంపీలను తన అహంకార, పెత్తందారీ పోకడలతో వైఎస్సార్సీపీ అధినాయకత్వం దూరం పెడుతోంది. కేవలం వారిని ఓటర్లుగా చూస్తూ చులకన చేస్తోంది. పార్లమెంట్‌లో బిల్లులపై ఓటింగ్‌ విషయంలో తాము చెప్పినట్లు నడుచుకునే ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తోంది. సభలో, బయటా ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా వారిని వెలివేసినట్లుగా చూస్తోంది.

'వైఎస్సార్​సీపీలో ప్రాధాన్యం దక్కాలంటే అదే అర్హత - అధిష్ఠానం ఆశీస్సులకూ అదే దగ్గరి దారి!'

దిల్లీలో సీఎం దూతలైన విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఆదేశాల మేరకే ఎంపీలంతా నడుచుకోవాలి. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలవాలనుకున్నా వారి అనుమతి తీసుకోవాల్సిందే. కాదని ఏ ఎంపీ అయినా వ్యక్తిగతంగా కేంద్రమంత్రిని వారి కార్యాలయంలోనో, పార్లమెంటులోనో కలిసి వినతి పత్రమిచ్చారంటే ఇక, అంతే సంగతి. నాటి నుంచే ఆ ఎంపీని ఏకాకిని చేయడం, తమ బృందం నుంచి వెలివేయడం మొదలవుతుంది. పార్టీ ఎంపీలు బృందంగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్లినా ఈ ఎంపీలను తీసుకెళ్లరు. వీరి పేరుతో ప్రశ్నలు కూడా పార్లమెంటుకు పంపరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో ఈ వెలివేత మొదలైంది. తర్వాత నరసరావుపేట, మచిలీపట్నం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరికి ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఒక బీసీ ఎంపీ(BC MP) బీసీలకు రిజర్వేషన్లు, అట్రాసిటీలపై ప్రైవేటు బిల్లు సిద్ధం చేసుకుంటే, సీఎం అనుమతి లేకుండా ఎలా పెడతారంటూ సాయిరెడ్డి ఆయన్ను నిలువరించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దిల్లీలో ఇచ్చిన విందుకు దాదాపు అన్ని పార్టీల వారూ హాజరయ్యారు. కానీ, సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి అనుమతి తీసుకోకుండా వెళ్లారని బాలశౌరిని పార్టీ పెద్దలు వేధించారు. ఆయన వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడైనప్పటికీ పార్టీని, ఎంపీ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.

వైఎస్సార్సీపీ పాలనలో పేదలు మరింతగా చితికిపోయారు - జగన్​రెడ్డి కులపిచ్చి పరాకాష్టకు చేరింది

సొంత పార్టీ ఎంపీలే అధినేత జగన్‌ను కలిసే అవకాశాలే లేవంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి సహాయకుడికి 10-15 సార్లు ఫోన్‌ చేస్తే కానీ అపాయింట్‌మెంట్‌ తేదీ ఖరారు కాదు. ‘నాలుగైదు రోజుల్లో లేదా ఈ వారంలోనే’ అని చెప్పినా, ఆర్నెళ్లకు కూడా ఆ అపాయింట్‌మెంట్‌ రాదు. సీఎం దిల్లీ వెళ్తేనో, జిల్లాకు వచ్చినప్పుడో విమానాశ్రయం, హెలిప్యాడ్‌ వద్ద మాత్రమే కలిసి వినతిపత్రాలు అందజేయాలి. అదీ జగన్‌ స్వయంగా తీసుకోకుండా, విషయమేంటో అడగకుండా, తన కార్యదర్శి ధనుంజయరెడ్డి వైపు చూపిస్తుంటారు. అక్కడా ‘మీ అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగితే ‘చూడు’ అని పక్కనున్న సహాయకుడికి చెబుతారు కానీ, నిర్దిష్ట హామీ ఇవ్వరు. ఇచ్చిన విజ్ఞాపన పత్రం పరిస్థితేంటో తెలుసుకునేందుకు సీఎంవోకు వెళ్తే, ధనుంజయరెడ్డిని కలిసేందుకు మూణ్నాలుగు గంటల నిరీక్షణ తప్పదు. ‘చూద్దాంలెండి. నేను చెబుతాలే’ అంటూ ఆయన తన ఓఎస్డీకి చెబుతారు. ఓఎస్డీ వద్దకు వెళ్తే సంబంధిత శాఖల కార్యదర్శులకు పంపుతామని అంటారు. అలా కాగితాలు, ఎంపీలు సీఎంవో (CMO) లో కార్యాలయాలు చుట్టూ తిరగడమే తప్ప, వినతులను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కన్పించవు.

కేవలం 120 కోట్ల రూపాయలు వెచ్చిస్తే తన నియోజకవర్గంలో 10 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎంను ఓ ఎంపీ కోరాగా అది నేటికీ సాకారం కాలేదు. రెండేళ్లపాటు ఆయన వెంటపడినప్పటికీ, ఆ ఫైలు ఆర్థిక శాఖ వద్దే ఆగిపోయింది. చివరకు ‘మీరు వస్తున్నారే కానీ, ఆ పని జరగదు’అంటూ ఎంపీకి ఆర్థిక శాఖ అధికారులు ముఖంపైనే చెప్పేశారు. తన నియోజకవర్గంలో ఇస్కాన్‌ (ISCON) వారు ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించేందుకు భూమి అడుగుతున్నారని, అది కూడా ఉచితంగా కాదని కొనుక్కుంటామని చెప్పారని ఒక ఎంపీ సీఎం దృష్టికి తెచ్చారు. ఎందుకులే హిందూ సంస్థలకు స్థలమిస్తే వేరేవాళ్లు మనకు ఓట్లు వేస్తారా? ఆ ఒక్క సంస్థతో అక్కడేం అభివృద్ధి అవుతుంది? కావాలంటే అక్కడ మనం 7 స్టార్‌ హోటల్‌ కడుదాంలే అని సీఎం నిర్ద్వందంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

ఈ ఐదేళ్లలో 15 సార్లు పార్లమెంట్‌ సమావేశాలు జరగ్గా, పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా జగన్‌ 4 సార్లు మాత్రమే పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. మొదటిసారి దిల్లీలో ఎంపీలతో భేటీ అయినప్పుడు ‘ఇక్కడ మోదీ హిమాలయ పర్వతంలా, సోనియా గాంధీ ఎవరెస్ట్‌ శిఖరంలా కన్పిస్తారు. అలాగని మీరు వాళ్లను కలిసే ప్రయత్నం చేస్తే మాత్రం మీ జాతకాలన్నీ నా వద్ద ఉన్నాయి అని అరచేయిని చూపిస్తూ హెచ్చరించారని సమాచారం.

అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే!

అధికారంలోకొచ్చిన తొలినాళ్లలోనే మీరు మరో పవర్‌ సెంటర్‌ కాకూడదని ఎంపీలతో జగన్‌ మాట్లాడారు. ప్రొటోకాల్‌ను అనుభవించండి, మీ నియోజకవర్గంలో పనులను అక్కడి ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెప్పినట్లు తెలిసింది. మీకు వచ్చే ఎంపీ ల్యాడ్స్‌ (MP Lads)నిధులను ఏడు భాగాలు చేసి మీ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సూచించారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొదటిసారి ఎంపీ అయినపుడు ఆయనకు మైసూరారెడ్డి నియోజకవర్గంలో సుమారు 40వేల మెజారిటీ వచ్చిందని ఆ తర్వాత మైసూరారెడ్డితో కొంత గ్యాప్‌ రావడంతో రెండోసారి ఎంపీ అయినపుడు మైసూరారెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ 4వేల లోపే వచ్చిందని కాబట్టి ఎంపీలుగా మీరు ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండాలని ఉదహరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సొంత కేడర్‌ ఇళ్లలో శుభకార్యాలకు హాజరవ్వాలన్నా ఎంపీలు అక్కడి ఎమ్మెల్యేలకు సమాచారమివ్వాలన్న పరిస్థితి కల్పించారు.

వైఎస్సార్​సీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

జగన్‌ గత శుక్రవారం దిల్లీలో ప్రధానిని కలిసేందుకు పార్లమెంటుకు రాగా, బయట సీనియర్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎదురుపడి నమస్కారం చేశారు. ఆయనకు ప్రతినమస్కారం చేయకుండానే, అటువైపు చూడకుండానే పార్లమెంటులోకి జగన్‌ వెళ్లిపోయారు. ఆ వీడియో వైరలైంది. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే తన వర్గాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనను అవమానిస్తున్నారని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు (Shrikrishna Devarayalu) ఎంత మొరపెట్టుకున్నా పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కూడా స్పందించలేదు. తర్వాత ఓసారి పార్లమెంటులో ఓటింగ్‌ ఉన్నపుడు అదే సమయంలో దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శ్రీకృష్ణదేవరాయలును జన్‌పథ్‌కు పిలిపించుకొని మాట్లాడారు. ఆయన సీఎంను కలిసేందుకు విముఖంగా ఉంటే మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి బతిమాలి మరీ తీసుకువెళ్లారు. అప్పుడు ఆయనతో సీఎం స్నేహపూర్వకంగా మాట్లాడారు. తర్వాత అవమానాలు కొనసాగడంతో ఇటీవలే కృష్ణదేవరాయలు పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేశారు.

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్​కు అప్పనంగా కాంట్రాక్టులు: ఎంపీ బాలశౌరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.