ETV Bharat / politics

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 2:14 PM IST

Updated : Feb 25, 2024, 3:07 PM IST

GHMC Deputy Mayor Joined Congress : మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న వేళ రాష్ట్రంలో పార్టీల జంపింగ్‌లు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్ రెడ్డి హస్తం కండువా కప్పుకున్నారు.

GHMC Deputy Mayor Joined Congress
GHMC Deputy Mayor Joined Congress

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు

GHMC Deputy Mayor Joined Congress : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీలత, శోభన్ రెడ్డిలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ (Telangana Congress Deepa Dasmunsi) పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. హస్తం పార్టీలో చేరిన దంపతులకు సాదర స్వాగతం పలికారు.

Minister Ponnam On BRS Party : అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమకారులను విస్మరించిందని అన్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం, స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు. టీఆర్ఎస్ పార్టీ కోసం 24 సంవత్సరాలు కష్టపడ్డ వారిని కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తులను పదవులు కట్టబెట్టడం సరికాదని వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వరాష్ట్ర సాధనకై పాటుపడిన ఉద్యమకారులను విస్మరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపించేందుకు కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడింది." - పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీల నేతల చొరవ - పీసీసీ ఆమోదంతోనే చేరికలు కొనసాగించాలని నిర్ణయం

మరోవైపు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత (GHMC Deputy Mayor Srilatha), శోభన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమనాయకులకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టడం వల్లనే రాజీనామా చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులపట్ల తీసుకుంటున్న నిర్ణయాలతో కాంగ్రెస్ పట్ల విశ్వాసం కలిగిందని, అందుకే హస్తం కండువా కప్పుకున్నామని స్పష్టం చేశారు.

"2000 సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పని చేశాను. గత 23 ఏళ్లుగా ఆ పార్టీలో ఉన్నా ఉద్యమకారులను ఆ పార్టీ గౌరవించడం లేదు. సముచిత న్యాయం చేయడం లేదు. బీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలే. ఆ అవమానాలు భరించలేకే ఆ పార్టీని వీడాం. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇస్తున్న గౌరవం ఎంతో అభినందనీయం. వారి కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో మాకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఏర్పడింది. అందుకే ఈ పార్టీలో చేరాం. కాంగ్రెస్‌లో చేరడం అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎవరి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగానే హస్తం కండువా కప్పుకున్నాం." - మోతే శ్రీలత, శోభన్ రెడ్డి

లోక్​సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్​లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ

Last Updated :Feb 25, 2024, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.