ETV Bharat / politics

చోరీతో ఆయనకు సంబంధం లేదు - మంత్రి కాకాణి కేసులో మళ్లీ అదే కథ రిపీట్ చేసిన సీబీఐ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 8:34 AM IST

CBI on AP Minister Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన ప్రాపర్టీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిదే కానీ, ఆయనకు మాత్రం ఈ చోరీతో ఎలాంటి సంబంధమూ లేదట. ఈ కేసులో పట్టుబడిన పాత నేరగాళ్లకు సైతం తాము దొంగిలించింది కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలని తెలియనే తెలియదట. ఈ కేసును పది నెలలపాటు విచారించిన సీబీఐ సైతం గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన ఆవుకథనే మళ్లీ చెప్పారు.

CBI_on_AP_Minister_Kakani_Govardhan_Reddy
CBI_on_AP_Minister_Kakani_Govardhan_Reddy

CBI on AP Minister Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన ప్రాపర్టీ వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించినదేనట. కానీ ఆయనకు మాత్రం ఈ చోరీతో ఎలాంటి సంబంధమూ లేదని సీబీఐ అభియోగపత్రంలో పొందుపరిచింది. ఈ కేసు వ్యవహారంలో దాదాపు పది నెలల పాటు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన సీబీఐ, గతంలో నెల్లూరు జిల్లా పోలీసులు చెప్పిన కథే తాజాగా మళ్లీ వల్లెవేసింది.

సయ్యద్‌ హయ్యత్, షేక్‌ ఖాజా రసూల్‌ అనే చిల్లర దొంగలే ఈ చోరీకి పాల్పడ్డారని, వారికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలూ లేవంటూ అప్పట్లో నెల్లూరు ఎస్పీ చెప్పిన ఆవు కథే మళ్లీ చెప్పుకొచ్చింది. నెల్లూరులోని 4వ అదనపు మెజిస్ట్రేట్‌ కోర్టు భవనం జీ ప్లస్‌ 1గా ఉంటుంది. ఇందులో కింద రెండు కోర్టులు, మొదటి అంతస్తులో ఒక గది ఉంటాయి. దొంగతనం మొదటి అంతస్తులో, అదీ మంత్రి కాకాణి కేసు పత్రాలు, ఆధారాలు ఉన్న బీరువు నుంచి మాత్రమే జరిగింది.

మంత్రి కాాకాణి ఫోర్జరీ కేసు.. విచారణ మొదలుపెట్టిన సీబీఐ

కాకాణి కేసు పత్రాలు మాత్రమే ఎందుకు దొంగిలించారు: చోరీకి పాల్పడ్డ వారు ఆ బీరావాలో మాత్రమే ఎందుకు దొంగతనం చేస్తారు? కాకాణి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే దొంగిలించి చేసి, మిగతావి ఎందుకు వదిలేస్తారు? అనే దానికి అభియోగపత్రంలో సమాధానాలు లేవు. సీబీఐ చెప్పిన విషయాలు తార్కికంగా లేవు. నెల్లూరు కోర్టు ప్రాంగణానికి 24 గంటల పాటు 3 ప్లస్‌ 1 పోలీసులతో భద్రత, బందోబస్తు ఉంటుంది. అయితే చోరీ జరిగిన రోజు మాత్రం ఆ సిబ్బంది సరిగ్గా రక్షణ కల్పించలేదని అప్పట్లో నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు.

సరిగ్గా ఆ రోజే పోలీసులు ఎందుకు తగిన రక్షణ ఇవ్వలేదు? దొంగతనం జరిగిందని చెబుతున్న సమయంలో భద్రతగా ఉండాల్సిన సిబ్బంది ఎక్కడ ఉన్నారు? వారు చోరీ విషయాన్ని ఎందుకు గమనించలేదు? అనే విషయాల లోతుగా వెళ్లి సీబీఐ దర్యాప్తు చేయలేదు. ఆ విషయాల్ని అభియోగపత్రంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

కాకాణి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం తాను సొంతంగా వినియోగించే బీరువాలో ఓ బ్యాగులో పెట్టానని పోలీసులకు నాగేశ్వరరావు చెప్పారు. అత్యంత ముఖ్యమైన కేసుకు సంబంధించిన ప్రాపర్టీని ఆయన వ్యక్తిగతంగా వినియోగించే బీరువాలో ఎలా పెట్టుకుంటారు? దొంగతనం జరిగిన రోజున ఆ బీరువాకు ఆయన ఎందుకు తాళం వేయలేదు? ఈ విషయాల గురించి సీబీఐ లోతైన దర్యాప్తు చేయలేదు. నాగేశ్వరరావు చెప్పిన విషయమే వాస్తవం అన్నట్లుగా అభియోగపత్రంలో పొందుపరిచింది.

మంత్రి కాకాణీ గారూ.. మీకు నైతికత లేదా​?

ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ: కాకాణి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన 23 నకిలీ రబ్బరు స్టాంపులు, 2 నకిలీ రౌండు సీళ్లు, 1 డేట్‌ స్టాంపు, 2 స్టాంపు ప్యాడ్‌లు లభించలేదని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. అయితే అవి పునరుద్ధరించొచ్చని పేర్కొంది. అలాంటప్పుడు దీనిలో కుట్ర కోణం లేదని, మంత్రికి ఎలాంటి సంబంధమూ లేదని ఎలా తేల్చేస్తారు?

"నెల్లూరు కోర్టులో జరిగిన చోరీలో రాజకీయ కోణం లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులిద్దరూ పాత నేరగాళ్లే, ఇనుము దొంగతనానికే వారు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. కుక్కలు మొరగటం వల్లే వారు కోర్టు లోపలికి వెళ్లి చోరీకి పాల్పడ్డారు’’- అంటూ 2022 ఏప్రిల్‌ 17న అప్పటి నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్‌.విజయరావు విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాన్నే ధ్రువీకరిస్తున్నట్లుగా సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది. సీబీఐ ఏడాది పాటు దర్యాప్తు చేసి తేల్చింది ఇదేనా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది.

కాకాణి నిందితుడిగా ఉన్న పత్రాల చోరీ కేసు.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.