ETV Bharat / politics

కాళేశ్వరంపై సీఎం కుట్ర చేస్తున్నారు - మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 12:14 PM IST

Updated : Feb 27, 2024, 1:36 PM IST

BRS Chalo Medigadda Tour : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోయాల్సిందేనని స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నట్లు వెల్లడించారు.

KTR on Kaleshwaram Project Latest
KTR

మార్చి 1 నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ : కేటీఆర్

BRS Chalo Medigadda Tour : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ గర్జించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వందల కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తున్నా గతంలో ఎడారిగా ఉండేదని తెలిపారు. తలాపున మారుతుంది గోదావరి మన చేను, సేలక ఎడారి అని అప్పట్లో పాటలు రాశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ కన్నీళ్లు పెట్టించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ గతంలో జలయజ్ఞం చేపట్టిందని, కానీ అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదని మండిపడ్డారు.

KTR On Kaleshwaram Project : కాళేశ్వరం జలాలతో వాగులు, చెరువులు నింపామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగి చెరువులు నిండాయని తెలిపారు. కాళేశ్వరం వల్ల పాతాళగంగం పైకి వచ్చిందన్న కేటీఆర్‌, తెలంగాణకు నీళ్లు కావాలంటే ఎత్తిపోయాల్సిందేనని అన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం వల్ల నీళ్లు కావాలంటే ప్రాజెక్టులు కట్టి ఎత్తిపోయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆకలి కేకల తెలంగాణ కాళేశ్వరం (Kaleshwaram Project) వల్ల అన్నపూర్ణగా మారిందని పునరుద్ఘాటించారు. కాళేశ్వరమంటే ఏంటో సజీవంగా చూపాట్టాలనుకున్నామని వెల్లడించారు.

గత పదేళ్లలో కేసీఆర్‌ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారు : సీఎం రేవంత్

"తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పింది. తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ. మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ కాబట్టే కాళేశ్వరం ప్రారంభించాం. కాళేశ్వరం నిర్మించడం కోసం మహారాష్ట్రతో వివాదం ఉన్నా సామరస్యంగా పరిష్కరించాం. కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజీ కాదు. 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కిలో మీటర్ల సొరంగాలు. మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 కుంగిపోయాయి. 3 పిల్లర్లు కుంగితే బ్యారేజీ మెుత్తం కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. గతంలో ఫరక్కా బ్యారేజీలోనూ ఇలా జరిగింది. 1957లో కడెం ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయి". - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

KTR On Medigadda Barrage Damage : ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ (Medigadda Barrage) వెళ్తామని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని చెప్పారుయ మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందని, 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో చలో మేడిగడ్డ నిర్వహిస్తామని ప్రకటించారు. చలో మేడిగడ్డ కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తామని, విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందని వివరించారు.

రూ.90 వేల కోట్లు పెట్టి 90 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్‌ అంటున్నారు. ఎస్సారెస్పీ కట్టిన 11 ఏళ్లకు 25 వేల ఎకరాలకు కాంగ్రెస్‌ నీళ్లు ఇచ్చింది. కాళేశ్వరం వల్ల గోదావరిలో మన వాటా సాధించుకున్నాం. కాళేశ్వరం కట్టి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని లిఫ్ట్‌ చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మించాం. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్‌ చేసేలా కాళేశ్వరం నిర్మించాం. ముంపు ఉంటుందని తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత నిర్మాణానికి మహరాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించలేదు. తుమ్మడిహట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పింది. నీటి కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ సూచించింది. వ్యాప్కోస్‌ సర్వే, నిపుణులతో సంప్రదింపుల తర్వాతే కాళేశ్వరం నిర్మించాం. - కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుందని కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలూ కొట్టుకుపోవాలనేది సీఎం ఆలోచన అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వమే కుట్ర చేస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోయేలా చేసే ఆలోచనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. క్షుద్ర రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేయవద్దని హితవు పలికారు. తమపై కక్షతో నీళ్లు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయవద్దని సూచించారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం మాని పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వానాకాలం రాకముందే మేడిగడ్డపై మేల్కొని, కాలయాపన చేయకుండా కాళేశ్వరంపై పరిష్కారం చూపండని రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ బ్యారేజీపై అధికారుల విశ్లేషణ - దశల వారీగా మిగతా బ్లాకులు, ఆనకట్టలపై ఇన్వెస్టిగేషన్​

తెలంగాణ జలాలు తీసుకెళ్దామనుకున్న స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక : కేసీఆర్

Last Updated :Feb 27, 2024, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.