ETV Bharat / opinion

ఏపీలో తాలిబాన్లను మించిన అరాచక రాజ్యం - మరొక అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటి?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 9:43 AM IST

YSRCP Anarchy Rule in Andhra Pradesh: అఫ్గానిస్థాన్​లో తాలిబాన్లను మించిన అరాచకం ఆంధ్రప్రదేశ్​లో రాజ్యమేలుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ను మించిన నియంతగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మారారు. ప్రతిపక్షాలు గళం ఎత్తకూడదు, మీడియా కలం చూపకూడదు. ప్రజలు నోరు తెరవకూడదు. కోర్టులు, ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించడాన్ని సహించరు. ఎవరన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే భరించరు. భౌతికదాడులు చేయడానికి వైఎస్సార్సీపీ మూకలు ఆయుధాలతో నడిరోడ్డుపై స్వైరవిహారం చేస్తాయి. వాళ్ల అనుచరులు కబ్జాలు చేస్తారు. ప్రభుత్వ చెప్పుచేతల్లోని విచారణ సంస్థలు సైతం పనిచేస్తాయి. గిట్టనివారి వ్యాపారాలపై దాడులు చేస్తారు. ఇలాంటి ప్రభుత్వం మళ్లీ వస్తే జరిగేదేంటి? జనాల్ని బతకనిస్తారా?

YSRCP_Anarchy_Rule_in_Andhra_Pradesh
YSRCP_Anarchy_Rule_in_Andhra_Pradesh

YSRCP Anarchy Rule in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్​లో మీడియాపై, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులకు కారణం ఏంటి? తమ అరాచకాల గురించి ఎవరూ మాట్లాడకూడదనా? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? జగన్‌పై డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి. ఏడాదిన్నర జైలులో ఉన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నాటి సీఎం చంద్రబాబును కాల్చి చంపాలి. నడిరోడ్డున ఉరేయాలి అని హింసను ప్రేరేపించారు. అలాంటి నేరస్వభావికి ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని ప్రజలు అధికారం ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి అరాచక పాలనను చూస్తున్నాం.

ప్రజలు ఎవరికన్నా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అక్కడ న్యాయం జరగకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతారు, ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయి సామాన్యులను, ప్రతిపక్షాలను, మీడియాను హింసిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయటానికి వచ్చిన సీబీఐని కర్నూలులో ఏం చేశారో చూశాం. సీబీఐ పేరు చెబితే దేశంలో చాలామంది ఉలిక్కిపడతారు. అలాంటి సీబీఐకే ఇలాంటి దుర్గతి పడితే రేపు వీళ్లకి మళ్లీ అధికారం ఇస్తే జనం పరిస్థితి ఏంటి? ఇదే అంశంపై నేటి ‘ప్రతిధ్వని’ లో పాల్గొన్న వక్తలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రజాసేవ గాలికొదిలి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఆర్టీసీ

కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు: సీఎంగా జగన్‌ వచ్చిన తర్వాత అసమ్మతి స్వరాలు వినిపించకూడదనే కొత్త సంస్కృతిని తీసుకొచ్చారని సీనియర్‌ పాత్రికేయుడు కందుల రమేష్‌ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలన్నీ తన చేతిలో ఉన్నాయని, తాను చెప్పిందే జరగాలని, చేసిందే విధానం అనే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం ప్రారంభించారని, ఎవరైనా వ్యతిరేక స్వరం వినిపిస్తే జైలే గతి అని పేర్కొన్నారు.

భౌతికదాడుల నుంచి తప్పించుకోలేరనే భయానక వాతావరణం రాష్ట్రమంతటా వ్యాప్తి చేశారని, ఈ తరహా రాజకీయ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఆధారాలున్నా వారిపై నేటికీ చర్యలు లేవని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు వెళ్లి తలుపులు పగలకొట్టేందుకు నాయకత్వం వహించిన ఎమ్మెల్యేకు నజరానాగా మంత్రి పదవిని కట్టబెట్టారని అన్నారు.

పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైంది: డజన్ల కొద్దీ కేసులు, ఏడాదిన్నర జైలులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రవృత్తికి తగ్గట్లుగానే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ‘చంద్రబాబును కాల్చి చంపాలి’, ‘నడిరోడ్డుపై ఉరి తీయాలి’ అంటూ హింసను ప్రేరేపించారని కందుల రమేష్‌ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభిమానులకు బీపీ వచ్చి దాడులు చేశారంటూ రాజ్యాంగ పదవిలో ఉండి మాట్లాడడం సరికాదని, జగన్‌ ప్రభుత్వంలో విచిత్రాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు అనేకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సొంత చిన్నాన్నను హత్య చేసిన కేసులో సీఎం సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయటానికి కర్నూలు వచ్చిన సీబీఐ ఆ పని చేయలేకపోయిందని, దేశ చరిత్రలో సీబీఐకి అలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమం అని తెలిపారు. జగన్‌ అండతో పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన పాదాక్రాంతమైందని, ప్రజల ఓట్లతో అపరిమితమైన అధికారాన్ని జగన్‌కు కల్పించారని కందుల రమేష్‌ పేర్కొన్నారు.

మీడియా సంస్థలపై జగన్ యుద్ధం - విలేకరులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దాడి

మళ్లీ వస్తే మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారు: తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాననేది ఇప్పటికే జగన్‌ ప్రజలకు రుచి చూపారన్న కందుల రమేష్‌, మళ్లీ అధికారంలోకి వస్తే ఇంతకు మించి నియంతృత్వంలో కొత్త పోకడలు, మాఫియా రాజ్యం ప్రత్యక్షంగా చూపిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తమది హింసా ప్రవృత్తి, మాఫియా మనస్తత్వం, రక్తపిపాసి భావన అని చాటుతారని, 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహించకపోవడం వల్లే జగన్‌ స్వేచ్ఛగా పాదయాత్ర చేశారని తెలిపారు.

అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారన్న రమేష్, ఇప్పుడు ఎవరు విమర్శించినా వ్యక్తిగతంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి, సంప్రదాయాలను గౌరవించాయని, వాటికి జగన్‌ వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలను నాశనం చేయాలి, ఇష్టంలేని శక్తులను, వర్గాలను అణచివేయాలి, ఇందుకు అధికారాన్ని తీవ్రంగా ఉపయోగించుకోవాలి అనే కొత్త ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలను జగన్‌ పాలన నేర్పిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రమంతటా ఫ్యాక్షన్‌ సంస్కృతి: ప్రభుత్వం మారితే వైసీపీ నేతల అరాచకాలపై కేసులు నమోదు చేస్తే వారంతా తీవ్రమైన శిక్షలకు గురికావాల్సి ఉంటుందని, మరోసారి జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తే ఎన్నికల ద్వారా విజయం సాధించి నియంతగా వ్యవహరించడం ఎలా? అనే విషయంలో సీఎం పీహెచ్‌డీ పొందినట్లే అనుకోవాలని తెలిపారు. పోలీసులపై ఫిర్యాదులు చేసేందుకు ఉన్న పోలీసు కంప్లయింట్‌ అథారిటీ నిర్వీర్యమైందన్న రమేష్, అంతా కోర్టుల మీద ఆధారపడుతున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నమోదవుతున్న వందల సంఖ్యలో కేసుల్లో చాలావాటికి కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ న్యాయస్థానాల ఆదేశాలను సైతం అమలు చేయడంలేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్‌ అరాచకం ముందు ప్రజలు విలవిలలాడిపోతారని, ప్రతిపక్షాలను రాచి రంపాన పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించి, మరుగున పడుతోందనుకున్న ఫ్యాక్షన్‌ సంస్కృతి రాష్ట్రమంతటా వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో ప్రజలు తేరుకునే అవకాశం ఉండదని సీనియర్‌ పాత్రికేయుడు కందుల రమేష్‌ తెలిపారు.

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?

తాలిబన్లు సైతం జగన్‌ ముందు దిగదుడుపే: విచారణ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్షాలు, సంస్థలపై దాడులు చేయడం నిలువునా నియంత పాలనకు నిదర్శనం అని ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దాడులకు పాల్పడిన వారి దృశ్యాలు, చిత్రాలు బయటికొచ్చినా బాధ్యులను అరెస్టు చేయడానికి దర్యాప్తు సంస్థలకు చట్టాలు గుర్తుకురావడంలేదని పేర్కొన్నారు. అల్లరిమూకలకు అధికార పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తోందని, ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై దేశద్రోహం కేసులు కూడా పెడుతున్నారని ముప్పాళ్ల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు సైతం జగన్‌ ముందు దిగదుడుపే అని మండిపడ్డారు.

ఎవరైనా విమర్శిస్తే తమ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు తిరగబడతారని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ చెబుతున్నారని, సాధారణంగా ఏ నాయకుడైనా సంయమనం పాటించాలని హితవు పలుకుతారని తెలిపారు. జగన్‌ మాటలు హింసను, ఉద్రిక్తతలను ప్రోత్సహించేలా ఉంటున్నాయన్న ముప్పాళ్ల, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే ధోరణి ఉండేదని, ఇప్పటికీ ఆ భావనలో మార్పు లేదని తెలిపారు. అనంతపురం తర్వాత వరుసగా రెండు సంఘటనలు జరిగాయన్న ముప్పాళ్ల సుబ్బారావు గుర్తు చేశారు.

అణగదొక్కాలని చూస్తున్నారు: సీఎం, వైసీపీ నేతలు ఆలోచన ధోరణిలో ఫ్యాక్షన్‌ భావజాలమే కనిపిస్తోందని, రాష్ట్రంలోని ఏ వ్యవస్థా స్వతంత్రంగా పనిచేయలేకపోతోందని, వాటిని నిర్వీర్యం చేశారని తెలిపారు. ఫ్యాక్షన్‌ పోకడలు, ముద్దాయి ఆలోచనలు, సంస్కృతిని జగన్‌ కొనసాగిస్తున్నారని, కంచే చేను మేసినట్లుగా చట్టాలను రక్షించాల్సిన వారే ఆ పని తమది కాదన్నట్లుగా పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా, పార్టీ కార్యకర్తల్లా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు బదులు పోలీసులే ఫిర్యాదులు చేసి మరీ కేసులు పెడుతున్నారని, అర్ధరాత్రి వేళ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ద్వారా రాజకీయంగా వారిని అణగదొక్కాలని చూస్తున్నారని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?

దాడులు చేసేలా ప్రోత్సహిస్తున్నారు: హిట్లర్‌ కూడా ముఖ్యమంత్రి ఎదుట దిగదుడుపే అని ముప్పాళ్ల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులతోపాటు అధికారులు కూడా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, ‘ఈనాడు’కు ఆర్థిక ఇబ్బందులు కలిగించాలనే మార్గదర్శి సంస్థపై దాడులు చేశారని తెలిపారు. న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించి మరీ బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేశారని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని అంతా ఆకాంక్షిస్తుంటే, అలాంటి వ్యవస్థపై దాడులు చేసేలా అధికార పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారని ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.

గత ఎన్నికల్లో గంపగుత్తుగా దళితులు జగన్‌కు ఓట్లేశారని, దానికి ప్రతిఫలంగా డాక్టరు సుధాకర్‌ నుంచి సుబ్రమణ్యం వరకు దళితులపై దాడులు, హత్యలు చేశారని ముప్పాళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాను దళితులు అడ్డుకుంటే వారిపై కేసులు పెడుతున్నారని, సీతానగరంలో ఓ దళిత యువకుడికి శిరోముండనం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రపతికి లేఖ రాసి నక్సలైట్లలో కలిసిపోతానన్నా అతనికి దిక్కులేదని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ వ్యక్తిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసినట్లు ఆరోపణలు వస్తే ఆయనకు బెయిల్‌ ఇప్పించడమే కాకుండా ఊరేగింపులు జరిపించారని అన్నారు.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేస్తారు: ఐఏఎస్‌ అధికారులు పలువురు అయ్యా, ఎస్‌ అంటుంటే, కొందరు ఐపీఎస్‌ అధికారులు నీ బాంచన్‌ దొర అంటూ మొక్కుతున్నారని ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు కదా అనే అపోహతో వైసీపీకు ఓటు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేమని ముప్పాళ్ల తెలిపారు. రాష్ట్రం అప్పుల ఆంధ్రాగా మారిందని, ఉద్యోగాలు లేవని, పనులు చేద్దామన్నా అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త పరిశ్రమలు రావడంలేదన్న ముప్పాళ్ల, స్వయం ఉపాధి చేసుకోవాలన్నా అవకాశాలు లేవని తెలిపారు. నియంత పాలన కొనసాగితే ప్రజల ఆస్తులను అప్పనంగా ఆక్రమించుకుంటారని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నాశనం చేస్తారని తెలిపారు. రాజ్యహింసకు అడ్డు లేకుండాపోతుందని, మేధావులు, పారిశ్రామికవేత్తలు వంటి వారు వేరే చోటకు తరలిపోయే ప్రమాదం ఉందని ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్‌ కుటుంబాన్ని కడుపులో పెట్టుకున్న కడప జిల్లాకు జగన్ చేసిందేమిటి ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.