ETV Bharat / international

రష్యాలో తొలిసారి 3రోజుల ఎన్నికలు- పుతిన్​దే మళ్లీ పీఠమా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 4:07 PM IST

Russia Elections 2024 : రష్యా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. చరిత్రలోనే మొదటిసారిగా మూడు రోజులపాటు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశాబ్దాలుగా అధికార పీఠంలో ఉన్న వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి విజయబావుటా ఎగురవేస్తారని రష్యా జాతీయ మీడియా చెబుతోంది. నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్‌ను ఎలాగైనా గద్దె దించుతామని అక్కడి విపక్షాలు ప్రతినబూనాయి.

Russia Elections 2024
Russia Elections 2024

Russia Elections 2024 : రష్యా చరిత్రలోనే మొదటిసారిగా అధ్యక్ష పదవికి మూడు రోజులపాటు ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన రష్యా అధ్యక్ష ఎన్నికలు శనివారం, ఆదివారం కూడా కొనసాగనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు అధ్యక్ష పీఠాన్ని వ్లాదిమిర్‌ పుతిన్‌ అధిరోహించారు. సోవియట్‌ యూనియన్‌ పాలకుడు జోసఫ్‌ స్టాలిన్‌ కంటే ఎక్కువ కాలం రష్యాను పరిపాలించిన వ్యక్తిగా నిలిచిన పుతిన్‌ మరోసారి అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు రాజ్యాంగ సవరణ చేసి మరీ ఎన్నికల బరిలోకి దిగారు పుతిన్.

గెలిస్తే మరో ఆరేళ్ల పాటు పుతినే!
ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే మరో ఆరేళ్ల పాటు రష్యా అ‍ధ్యక్ష పదవిలో కొనసాగుతారు పుతిన్. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థులుగా కేవలం ముగ్గురు అభ్యర్థులనే అక్కడి కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతించింది. లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ వ్లాదిస్లవ్‌ డవాంకోవ్‌, కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన నికోలోయ్‌ ఖరితోనోవ్‌ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా పుతిన్‌కు అనుకూలురనే తెలుస్తోంది.

Russia Elections 2024
రష్యా ఎన్నికలు
Russia Elections 2024
రష్యా ఎన్నికలు
Russia Elections 2024
రష్యా ఎన్నికలు

ఆ ప్రాంతాల్లో కూడా ఎన్నికలు
గురువారమే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ మొదలైంది. గత ఎన్నికల్లో 68శాతం పోలింగ్‌ నమోదు కాగా ఇప్పుడు పోలింగ్‌ శాతం పెరగొచ్చనే అంచనా ఉంది. ఇతర దేశాల్లో ఉండే రష్యన్‌ పౌరులు అక్కడి నుంచే తమ ఓటును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ గెలిచి తన చర్యలను సమర్థించుకోవచ్చని పుతిన్‌ యోచిస్తున్నారు. ఉక్రెయిన్‌ విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘించారంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టినా పుతిన్‌ పట్టించుకోవడంలేదు.

Russia Elections 2024
రష్యా ఎన్నికలు
Russia Elections 2024
రష్యా ఎన్నికలు

పుతిన్‌కు ప్రత్యర్థులు ముగ్గురే
ఉక్రెయిన్‌పై దురాక్రమణ, మానవ హక్కుల ఉల్లంఘన, విపక్ష నేత నావల్నీ అనుమానాస్పద మృతి అంశాలు పుతిన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం పుతిన్‌కు ప్రత్యర్థులుగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకించిన నేతలు బోరిస్‌ నదేహ్‌దిన్‌, యెకటేరియా డుంట్‌సోవా అభ్యర్థిత్వాలను ఏదో కారణాలు చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిందనే ఆరోపణలు వస్తున్నాయి.

నావల్నీ మృతితో వ్యతిరేకత!
విపక్షనేత నావల్నీ అనుమానాస్పద మృతితో పుతిన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కాస్త పెరిగింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర ధరలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ పుతిన్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలంటే మార్చి 29 వరకు వేచి చూడాల్సిందే.

'అంతరిక్షంలోకి అణ్వాయుధాలకు వ్యతిరేకం- వాటిని మాత్రమే అభివృద్ధి చేస్తున్నాం'

పుతిన్ దోస్త్​ మేరా దోస్త్- ప్రపంచాన్ని ఎదురించి మరీ కిమ్​కు స్పెషల్ గిఫ్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.