ETV Bharat / international

పాకిస్థాన్‌లో నవాజ్‌ సంకీర్ణమే- పొత్తుకు భుట్టో పార్టీ ఓకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 12:37 PM IST

Updated : Feb 10, 2024, 1:05 PM IST

Pakistan Election Results
Pakistan Election Results

Pakistan Election Results : పాకిస్థాన్​లో రెండ్రోజుల నుంచి సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జరుగుతున్నప్పటికీ ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ దక్కించుకోలేదు. దీంతో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Pakistan Election Results : పాకిస్థాన్‌లో ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) అటు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్​) పార్టీలు వేటికవే విజయాన్ని ప్రకటించుకున్నాయి. ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(భిలావల్ భుట్టో పార్టీ) కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చాయి. దీనిలో భాగంగా ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్‌లో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపింది.

'షరీఫ్​ లండన్​ ప్లాన్ ఫెయిల్​'
మరోవైపు, తమ పార్టీ అగ్రనేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఏఐ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది. "మీ ఓట్ల వల్ల లండన్‌ ప్లాన్‌ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను (నవాజ్‌ షరీఫ్‌ను ఉద్దేశించి) విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇప్పుడు పోలింగ్‌ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్‌" అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.

మరోవైపు పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు నత్తనడకన సాగుతోంది. దాదాపు 48 గంటలు దాటినా ఇప్పటివరకు పూర్తి ఫలితాలు వెల్లడికాలేదు. జాతీయ అసెంబ్లీకి సంబంధించిన 265 స్థానాలకుగాను ఇప్పటివరకు 250 సీట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఓట్ల లెక్కింపు ఆలస్యం కావటంపై ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ఈసీ తారుమారు చేస్తోందని ఆరోపించారు.

ఈనెల 8న 265 స్థానాల పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యంలోని తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌-PTI పార్టీ మద్దతుదారులు 99చోట్ల విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- PML(N) 71స్థానాల్లో, బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ-PPP 53చోట్ల గెలుపొందాయి. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 133 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచినప్పటికీ...ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 34స్థానాలు కావాల్సి ఉంది.

Last Updated :Feb 10, 2024, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.