ETV Bharat / international

ఆధిక్యంలో ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ!- పాక్​ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 6:50 AM IST

Updated : Feb 9, 2024, 8:13 AM IST

Pakistan Election Results
Pakistan Election Results

Pakistan Election Results : దాయాది పాకిస్థాన్​ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంచనాలకు భిన్నంగా ఇమ్రాన్​ ఖాన్​ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం.

Pakistan Election Results : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ, నాలుగు ప్రావిన్సుల్లో శాసన సభల కోసం జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఎలక్షన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్-నవాబ్-PMLN సునాయసంగా గెలుస్తుందని అంచనాలు వెలువడ్డప్పటికీ కౌంటింగ్‌లో భిన్నంగా ఫలితాలు వచ్చినట్టు సమాచారం. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభ్యర్థులు దూసుకుపోతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుమారు 154 స్థానాల్లో పీటీఐ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో అత్యధిక స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు విజయం సాధించారని సమాచారం. కాగా, కారణం చెప్పకుండా రిటర్నింగ్ అధికారులు మీడియాకు ఫలితాలను విడుదల చేయడాన్ని నిలిపివేశారు.

ఫలితాలపై ఇమ్రాన్ ఖాన్​ హర్షం
మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం తమ పార్టీ 'పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌' గెలుపొందిందని ప్రకటించుకున్నారు. ఎన్నికల ఫలితాలలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యం ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు​. పాకిస్థాన్​ ప్రజలు తమ పార్టీని ఎన్నుకోవాలనే పట్టుదలను ప్రదర్శించారని ఇమ్రాన్​ ఖాన్​ తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు, దానిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్​ ఖాతాలో ట్వీట్ చేశారు.

మరోవైపు అనూహ్య ఫలితాలు వస్తుండటం వల్ల PMLN అధినేత నవాజ్ షరీఫ్ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మరణించడం వల్ల 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 133 సీట్లు సాధించాలి. శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.

తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్‌ ఇక్బాల్‌ మీడియాకు ప్రకటించారు. కైబర్‌ పంఖ్తుంక్వా ప్రావిన్సియల్‌ అసెంబ్లీకి చెందిన పీకే-76 స్థానంలో గెలిచినట్లు వివరించారు. పీకే-6లోనూ పీటీఐ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఫజల్‌ హకీమ్‌ ఖాన్‌ విజయం సాధించినట్లు చెప్పారు. స్వాట్‌లోని పీకే-6 నియోజకవర్గంలోనూ పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి అలీ షా గెలుపొందినట్లు ప్రకటించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్​ అదృశ్యం!
మరోవైపు పాకిస్థాన్​ ప్రధాన ఎన్నికల కమిషనర్​ అదృశ్యం అయినట్లు వార్తలు వచ్చాయి. దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్​ కనిపించకుండా పోయారని, ఆయన తన ఆఫీసులో లేరని మీడియా కథనాలు పేర్కొన్నట్లు ఓ నెటిజన్​ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరలైన కాసేపటికే ప్రధాన ఎన్నికల కమిషనర్​ తన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో వెంటనే ఆ నెటిజన్​ కమిషనర్​ కనిపించారంటూ తిరిగి పోస్ట్ చేశారు.

బాంబు పేలుళ్లు, కాల్పుల మధ్య పాక్​లో ఎన్నికలు​- నలుగురు మృతి- షరీఫ్​కు పీఠం!

పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్- ఇంటర్నెట్ సేవలు బంద్?

Last Updated :Feb 9, 2024, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.