ETV Bharat / education-and-career
గేట్ పరీక్షలో టాప్ స్కోర్ సాధించడం ఎలా? - నిపుణుల సూచనలు ఇవే
పబ్లిక్, ప్రైవేట్ రంగ ఉద్యోగ నియామకాల్లో కీలకంగా గేట్ స్కోర్ - పరీక్షలో ఉత్తమ స్కోర్ సాధించడం ఎలా? - ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ సీఎండీ ప్రొ.వి. గోపాలకృష్ణమూర్తి సలహాలు, సూచనలు

Published : August 18, 2025 at 7:05 PM IST
Gate Exam Preparation Tips and Strategy : ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి పరీక్ష గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)- 2026కు సంబంధించి ప్రకటన వెలువడింది. ఈ ఏడాది గేట్ ఎగ్జామ్‌ను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ (పీఎస్‌యూలు), ప్రైవేట్ సంస్థలూ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గేట్ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ గేట్ పరీక్ష స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశంతో పాటు నెలకు రూ.12,400 స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ పరీక్షలో మెరుగైన స్కోరుకు ఏవిధంగా సన్నద్ధం కావాలనే దానిపై ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ సీఎండీ ప్రొ. వై.వి.గోపాలకృష్ణమూర్తి సలహాలు, సూచనలు మీ కోసం.
వాటికి గేటు స్కోరే ప్రామాణికం : గేట్ స్కోరు ఆధారంగా ఐఐటీల్లో, ఐఐఎస్సీ బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ సైన్స్/ ఫార్మసీ/ ఆర్కిటెక్చర్/ హ్యుమానిటీస్ సంబంధిత విభాగాల్లో/ శాఖల్లో మాస్టర్ ప్రోగ్రామ్స్, డైరెక్ట్ డాక్టొరల్ ప్రోగ్రాములు, డాక్టొరల్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ లభిస్తుంది. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు (బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ తత్సమాన కోర్సు తర్వాత చెల్లుబాటయ్యే గేట్ స్కోరుతో డైరెక్ట్ పీహెచ్‌డీ) మొదటి రెండు సంవత్సరాలకు నెలకు రూ.37,000, మూడో సంవత్సరం నుంచి నుంచి ఐదో ఏడాది వరకు నెలకు రూ.42,000 ఆర్థిక సహాయం అందుతుంది. మహారత్న, నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్ స్కోరు అనేది ప్రామాణికం. అందువల్ల ఈ ఎగ్జామ్‌కు ప్రాముఖ్యం కొనసాగుతోంది.
గేట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు ఇవే : గేట్‌లో కొన్నేళ్లుగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త పేపర్లను ప్రవేశపెట్టడంతో పాటు సిలబస్‌లో మార్పులు, బీఎస్సీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్ విద్యార్థులకూ పరీక్షను రాసే అవకాశం కల్పించడం లాంటివి చూశాం. ఈసారి ఇంజినీరింగ్ సైన్సెస్ (ఎక్స్‌ఈ)కు సంబంధించిన పేపర్‌లో ఎనర్జీ సైన్స్ (ఎక్స్‌ఈ-1) కొత్త సెక్షనల్ పేపర్‌ను ప్రవేశపెడుతున్నారు.
గేట్-2026ను అభ్యర్థులు రెండు పేపర్లలో రాసేందుకు అవకాశం ఉంటుంది. తమ ఇష్ట ప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. రెండో పేపర్ ఎంపిక మొదటి పేపర్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. గేట్ స్కోరు పీజీ ప్రవేశానికి మూడేళ్లు, పీఎస్‌యూల్లో నియామకానికి ఒకటి లేదా రెండేళ్లు చెల్లుతుంది.
పరీక్ష విధానం: గేట్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. క్వశ్చన్ పేపర్‌లో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1 (జనరల్ ఆప్టిట్యూడ్) :
- ఇందులో 10 ప్రశ్నలుంటాయి. 5 ఒక మార్కు ప్రశ్నలు, మరో 5 రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగంలోని 4-5 ప్రశ్నలు ఇంగ్లిష్ (వెర్బల్ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వొచ్చు.
- రోజువారీ న్యూస్ పేపర్ చదవడం, క్యాట్ లాంటి ఇతర కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులకు సాధించేందుకు వీలుంది.
విభాగం-2 : రెండో విభాగంలో (సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టులు) ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి.
గణితం : 10 నుంచి 15 మార్కులు వస్తాయి. మ్యాథ్స్ విభాగంలోని ప్రశ్నలు శుద్ద గణితంలా ఉండవు. ఇంజినీరింగ్ అప్లికేషన్‌తో కూడినవి ఉంటాయి.
ఈ పరీక్షను ఆన్‌లైన్ పరీక్ష విధానంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్ గుర్తించాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్(బహూలైచ్ఛిక) విధానంలో ఉంటుంది. ఇందులో 3 రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.
రుణాత్మక మార్కులు : గేట్ పరీక్షలో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం నెగిటివ్ మార్కులు ఉంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్ మార్కులుంటాయి. న్యూమరికల్ ప్రశ్నలకూ, బహుళ ఎంపిక ప్రశ్నలకూ రుణాత్మక మార్కులుండవు.
సన్నద్దత వ్యూహం : గేట్ పరీక్ష సమయానికి ముందుగానే సన్నద్ధతను మొదలుపెట్టడం వల్ల పరీక్ష ప్రణాళికను, సంబంధిత మెటీరియల్‌ను సమకూర్చుకోవడానికి వీలు కలుగుతుంది. సన్నద్ధత వ్యూహ రచన, సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్స్, విషయాలను కూడా ఎక్కువగా సాధన చేసుకోవచ్చు.
- గేట్ గత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏ అంశాలకు, ఏ కాన్సెప్ట్‌లకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారు అనే విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఏయే టాపిక్లపై ఎక్కువ దృష్టిపెట్టాలో తెలుస్తుంది.
- గత గేట్ ప్రశ్నపత్రాలతోపాటు ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూల ప్రశ్నపత్రాలను సాధన చేయడం ఉత్తమం. దీనవల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడిగేందుకు అవకాశం ఉందో తెలుస్తుంది.
- ప్రామాణిక పాఠ్య పుస్తకాలు లేదా స్టడీ మెటీరియల్ ఎంచుకోవడం సన్నద్ధతకు అతిముఖ్యం.
- ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలను చిన్న చిన్న పట్టికలుగా తయారు చేసుకోవడం ఉత్తమం.
- కఠినమైన, సాధారణ, అతి సాధారణమైన టాపిక్‌లకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
- ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రముఖ విద్యా సంస్థలు అందించే ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌ను రాయాలి. సన్నద్ధత పూర్తయిన క్రమంలో మాక్ టెస్టులు రాయాలి.
- ఎన్‌టీపీఈఎల్ పాఠాలు విద్యార్థులకు ప్రాథమిక అంశాలను అవగాహన చేసుకునేందుకు తోడ్పడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి కూడా ఉపయోగపడతాయి.
- పరీక్ష సన్నద్ధతలో భాగంగా గత సంవత్సర ప్రశ్నపత్రాల్లో ఏదేని ఒకటి పరీక్షకు కేటాయించిన సమయంలో రాయాల్సి ఉంటుంది. దాంతో ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయం అభ్యర్థులకు అర్థమవుతుంది. ఎలాంటి మార్పులు అవసరమో తెలుస్తుంది.
గేట్ సిలబస్ 60 శాతమే : 4 ఏళ్ల ఇంజినీరింగ్‌లో చదివే సిలబస్‌తో పోలిస్తే గేట్ పరీక్ష సిలబస్ 60 శాతం మాత్రమే ఉంటుంది. మొత్తం ఇంజినీరింగ్ బ్రాంచి మూలాలు, నూ ట్రెండ్స్ మాత్రమే గేట్ సిలబస్‌లో ఉంటాయి. ఒక పెద్ద పర్వతం సైతం రోజుకో బండ తొలగిస్తే కొంత కాలానికి మటుమాయమవుతుంది.
ముఖ్య సమాచారం :
అర్హతలు : ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి : గరిష్ఠ పరిమితి లేదు.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: 25.08.2025.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు ప్రక్రియ ముగింపు : 25.09.2025వ తేదీ నుంచి
పరీక్ష తేదీలు : 2026 ఫిబ్రవరి 7, 8, 14, 15 ఫలితాల విడుదల చేయు తేదీ : 19.03.2026
వెబ్‌సైట్ : https://gate2026.iitg.ac.in
పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు - మొదటి నెల నుంచే రూ.45,000వేల జీతం!
చదవడం కాదు, నేర్చుకోవడం అలవాటు చేసుకోండి - భవిష్యత్తుకు అదే మార్గం చూపుతుంది

