ETV Bharat / business

విదేశీ విద్య కోసం లోన్ కావాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - Education Loans For Studying Abroad

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:23 PM IST

Education Loan for Foreign Education
Education Loans For Studying Abroad

Education Loans For Studying Abroad : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని చాలా మంది విద్యార్థుల కల. అయితే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఉన్నత విద్యసాకారం కోసం ఎక్కువ మంది విద్యార్థులు స్కాలర్ షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్​పై ఆధారపడుతుంటారు. అయితే ఈ లోన్స్ తీసుకునేముందు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Education Loans For Studying Abroad : నేడు ఎంతో మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విదేశి విద్యకు అయ్యే ఖర్చు గతంతో పోల్చితే నేడు బాగా పెరిగింది. ఈ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు, పిల్లల విదేశీ విద్య కలను నెరవేర్చడంలో విఫలం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ విద్యా రుణం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయి. అయితే ఎడ్యుకేషన్ లోన్స్ గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్​. విదేశీ విద్యారుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలకమైన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.

అంతర్జాతీయ కోర్సులు : చాలా మంది విద్యార్థులకు అన్ని అంతర్జాతీయ కోర్సులకు ఎడ్యుకేషన్ లోన్ లభిస్తుందా? లేదా? అనే సందేహం ఉంటుంది. అయితే అన్ని బ్యాంకులు, ఎఫ్​బీఎఫ్​సీలు విదేశీ విద్యను ఆకాంక్షించే విద్యార్థుల కోసం రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాల పరిధి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా ఏవియేషన్, ఫిల్మ్ మేకింగ్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సంప్రదాయేతర రంగాలకు కూడా విస్తరించాయి. ఇంకా కొన్ని రుణ సంస్థలు అయితే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఒకేషనల్, స్కిల్లింగ్, అప్​స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కోసం కూడా విద్యారుణాలను అందిస్తున్నాయి.

యూనివర్సిటీలు : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ యూనివర్సిటిలోనైనా చదువుకునేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చా? లేదా? అనేది ముందుగా తెలుసుకోవాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఏ యూనివర్సిటిలోనైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందేందుకు రుణాలు అందిస్తున్నామని బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు చెబుతున్నాయి. రుణ సంస్థలు, విద్యార్థుల విద్యాపరమైన ఆకాంక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రుణ సహాయం అందిస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు, వసతి, ప్రయాణ ఖర్చులు, అభ్యాస పరికరాల ఖర్చు, జీవన వ్యయాలు, ఇతర విద్యా సంబంధిత ఖర్చులను విద్యారుణంలో భాగంగా రుణ సంస్థలు కవర్ చేస్తున్నాయి.

వడ్డీ రేట్లు : ఈ విద్యా రుణాల వడ్డీరేట్లు - బేస్ రేటు, స్ప్రెడ్​ రేటు అనే రెండు విధాలుగా ఉంటాయి. బేస్​ రేటును రుణ సంస్థలు ముందుగానే నిర్ణయిస్తాయి. ఇవి బ్యాంకులను బట్టి మారుతాయి. స్ప్రెడ్​ రేటు రుణకాలవ్యవధిలో మార్కెట్ కదలికలను బట్టి మారుతాయి. కాబట్టి దీన్ని వేరియబుల్ వడ్డీ రేటు అంటారు. ఈ వడ్డీ రేట్లు విద్యార్థి ఎంచుకున్నదేశం, యూనివర్సిటీ, కోర్సు, ఎంత రుణం, రుణ రకం, ఎంచుకున్న రుణ కాలవ్యవధి, సహ రుణగ్రహీత రుణ చెల్లింపుల చరిత్ర వంటి బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇక నిర్ధిష్ట రుణానికి వడ్డీ రేటును నిర్ణయించే ముందు ఆర్థిక సంస్థలు పలు అంశాలను అంచనా వేస్తాయి. విద్యార్థికి సంబంధించిన భవిష్యత్తు ఉపాధి సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు విశ్వవిద్యాలయ చరిత్ర, విద్యార్థి అకడమిక్ స్కోర్లు, ప్రవేశ పరీక్ష స్కోర్లు వంటి వాటిని చూస్తాయి. అయితే కొంతమంది విద్యార్థులు కేవలం వడ్డీ రేట్ల ఆధారంగా రుణ సంస్థలను షార్ట్ లిస్ట్ చేసి, పెద్ద తప్పు చేస్తుంటారు. అందుకే ఫైనాన్సింగ్, కస్టమర్ సర్వీస్ మంచిగా ఉన్న రుణ సంస్థలనే ఎంచుకోవాలి.

తల్లిదండ్రుల పాత్ర : ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు విద్యార్థి తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైంది. పిల్లల విద్యా ప్రణాళికలో వారు ఎప్పుడూ భాగమే. పిల్లలను మొదటి నుంచి అర్థం చేసుకుని, సరైన గైడెన్స్ ఇవ్వడమే కాదు, సహ రుణగ్రహీతలుగా వారు సంతకం చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియలో చరుకుగా వ్యవహారిస్తారు. ఇది రుణ దరఖాస్తుకు సంబంధించిన మొత్తం క్రెడిట్ యోగ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పిల్లల విద్యారుణానికి తల్లిదండ్రులు వారి ఆస్తి లేదా ఎఫ్డీలను తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆర్ధిక సహాయం, నిబద్ధత, రుణం గురించి పరిజ్ణానం, పిల్లల విదేశీ చదువుల కోసం విద్యా రుణాన్ని విజయవంతంగా పొందేందుకు ఉపయోగపడుతుంది.

రుణ చెల్లింపులు : ఎడ్యుకేషన్ లోన్ ఎంచుకునే విద్యార్థులు రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించే అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆర్థిక క్రమశిక్షణతో ఈఎంఐలను సరైన సమయానికే చెల్లించాలి. దీనివల్ల మెరుగైన క్రెడిట్ స్కోరు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థికి రుణం చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ వెసులుబాటు ఉన్నప్పటికీ, ఈ సమయంలోనూ తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించడం ఉత్తమం. దీనివల్ల రుణ బకాయిలు పేరుకుపోకుండా ఉంటాయి. అంతేకాదు ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనూ విద్యారుణ చెల్లింపును కొనసాగించేందుకు విద్యార్థులు తప్పనిసరిగా కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి.

అడ్మిషన్ లెటర్, వీసా : విదేశీ విద్య కోసం లోన్ పొందే ప్రక్రియ సాధారణంగా విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ లెటర్, వీసా రెడీగా ఉందో, లేదో అనే దానితో సంబంధం లేకుండా, ముఖ్యమైన దశలలో ప్రారంభం అవుతుంది. ముందుగా విద్యార్థి తన ఆర్థిక అవసరాలను తీర్చగల ఆర్థిక సంస్థను గుర్తించడానికి సమగ్ర పరిశోధన చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఫైనాన్షియర్ వెబ్​సైట్ లేదా ఆ శాఖ కార్యాలయాన్ని సందర్శించి అప్లికేషన్ పెట్టవచ్చు. లేదా ఆన్​లైన్​లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుకు సంబంధించిన విద్యా రుణ కన్సల్టెంట్​తో మాట్లాడిన అనంతరం విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను అందించాలి. విద్యార్థికి సంబంధించిన అన్ని అర్హతలు రుణానికి నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా అవసరం. కానీ రుణ దరఖాస్తు ప్రారంభంలో ఇది తప్పనిసరి కాదు. విద్యా రుణ మంజూరుకు ముందు విదేశీ విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ లెటర్ తప్పనిసరి. ఈ అడ్మిషన్ లెటర్ రుణం త్వరగా పొందేందుకు విలువైన పత్రంలా పనిచేస్తుంది. ఇది విద్యార్థి కోర్సు వివరాలతో పాటు రుణ మొత్తాన్ని అంచనా వేసేందుకు వీలు కల్పిస్తుంది. విద్యార్ధి విదేశాల్లో చదువుకునేందుకు అవసరమైన నిధులను వారి ఖాతాలో చూపినప్పుడు మాత్రమే ఆయా దేశాలు వీసాను జారీచేస్తాయి.

రుణ మంజూరు : విదేశీ విద్యకు రుణం చాలా అవసరం. ఇది రెండు లేదా మూడేళ్ల కోర్సుకు ఒకేసారి మంజూరు చేస్తారా? లేదా? కోర్సు సెమిస్టర్స్​ను బట్టి దశలవారీగా మంజూరు చేస్తారా? అనేది ముందుగా తెలుసుకోవాలి. రుణానికి దరఖాస్తు చేసినప్పుడు విద్యార్థి తన ప్రొఫైల్ తోపాటు ముఖ్యమైన అన్ని పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని నిర్ణీత ప్రమాణాల మేరకు ఉంటేనే రుణం మంజూరు అవుతుంది.

సొంతంగా వ్యాపారం చేయాలా? మీకు సూట్​ అయ్యే లోన్​ ఇదే! - Types Of Business Loans In India

గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి! - RBI Retail Direct Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.