ETV Bharat / business

ఈసారి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ఉంటుందా? మోదీ సర్కార్ వ్యూహం ఏమిటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 4:58 PM IST

Economic Survey 2024 In Telugu : భారతదేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, ఆర్థిక సర్వేను పార్లమెంట్​కు సమర్పించడం అనవాయితీ. అయితే ఈసారి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టే ముందు, ఆర్థిక సర్వేను కూడా పార్లమెంట్​లో ప్రవేశపెడతారా? లేదా? మోదీ సర్కార్ వ్యూహం ఏమిటి అనేది చూడాలి.

Economic Survey 2024
ఆర్థిక సర్వే 2024

Economic Survey 2024 : ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్​పైనే అందరి దృష్టి ఉంది. అనవాయితీ ప్రకారం, పూర్తి స్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్​లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇది మధ్యంతర బడ్జెట్ కనుక మోదీ ప్రభుత్వం పార్లమెంట్​లో ఆర్థిక సర్వే (Econimic Survey) ప్రవేశపెడుతుందా? లేదా? అనేది చూడాలి.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
గత ఏడాది కాలంలోని దేశ ఆర్థికవ్యవస్థ పనితీరు గురించి, రానున్న సంవత్సర కాలంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ల గురించి ముందుగా అంచనా వేసేదే ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ ఎకనామిక్ సర్వేను ఆధారం చేసుకునే యూనియన్ బడ్జెట్​ను రూపొందిస్తుంటారు.

సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వే రూపొందుతుంది. ఈ సర్వే రానున్న రోజుల్లో దేశానికి ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసి, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి పలు సూచనలు చేస్తుంది.

సర్వేలో ఏముంటుంది?
ఎకనమిక్‌ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను స్పష్టంగా వివరిస్తుంది. కీలక రంగాలైన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల గురించి తెలియజేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల లాంటి కీలక అంశాలను వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది. వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు గురించి, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను గురించి కూడా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇది బడ్జెట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది.

బడ్జెట్‌కు ఆర్థిక సర్వేకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల ద్వారా వస్తున్న రాబడులను, ఖర్చులను, ఆయా రంగాలకు చేసిన కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రధానంగా విశ్లేషిస్తారు.

ఆర్థిక సర్వేను మొదటిసారి ఎప్పుడు ప్రవేశపెట్టారు?
పార్లమెంట్​లో బడ్జెట్‌ కన్నా ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వాస్తవానికి 1963 వరకు సాధారణ బడ్జెట్‌తో కలిపి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. కానీ 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు.

మోదీ ప్రభుత్వం ఈసారి ఆర్థిక సర్వే ప్రవేశపెడుతుందా?
పార్లమెంట్‌ సంప్రదాయం ప్రకారం, పూర్తిస్థాయి బడ్జెట్​కు ముందే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. తాత్కాలిక బడ్జెట్ ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే ప్రభుత్వమే, పార్లమెంట్​లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. జూన్‌- జులై నెలల్లో మిగిలిన ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది.

అయితే ఇది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల, దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంక్షిప్త నివేదికను మోదీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జీడీపీ వృద్ధి రేటు, దేశ ఆర్థికవృద్ధి అంచనాలు, చమురు ధరలు మొదలైన అంశాలు దీనిలో ఉండవచ్చని చెబుతున్నారు.

ఎన్నికల పద్దులో ప్రజలకు వరాలుంటాయా? మధ్యంతర బడ్జెట్ ఎలా ఉండనుంది?

ఈసారి కూడా పేపర్‌లెస్‌ బడ్జెట్- ఆ యాప్‌లోనే అన్ని డాక్యుమెంట్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.