ETV Bharat / bharat

భర్తల కోసం మండుటెండలో 'రాయల్​'​ భార్యల ప్రచారం- సింధియా, నకుల్​​కు కలిసొస్తుందా? - Wives Campaign For Husbands

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 1:00 PM IST

Wives Campaign For Husbands in MP : వారంతా ఎండకన్నెరగకుండా పెరిగారు. ఎంతో కాలంగా సామాన్య ప్రజలకు దూరంగానే ఉన్నారు. కానీ ఎన్నికలు వాళ్ళను మండే ఎండలోనూ బయటకు రప్పించాయి. ఎన్నికల్లో తమ భర్తల గెలుపుకోసం ఇబ్బందులను లెక్కచేయకుండా ప్రచారంలో దిగారు రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింథియా సతీమణి ప్రియదర్శిని రాజే సింధియా, అపర కుబేరుడు నకుల్‌నాథ్‌ సతీమణి ప్రియా నాథ్.

Wives Campaign For Husbands in MP
Wives Campaign For Husbands in MP

Wives Campaign For Husbands in MP : సార్వత్రిక ఎన్నికల సమరం దేశంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ వారి విజయం కోసం కుటుంబ సభ్యులు ప్రచార బరిలోకి దిగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో భర్తల గెలుపు కోసం భార్యలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా భార్య, అపర కుబేరుడు నకుల్‌నాథ్‌ సతీమణి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి తమ భర్తల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో తమ భర్తలకు గెలుపు భరోసా కల్పించాలనే తపనతో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ వారి సతీమణులు ప్రజలతో మమేకమవుతున్నారు. రాజ వంశానికి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శిని రాజే సింధియా, అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరైన కాంగ్రెస్ నాయకుడు నకుల్ నాథ్ భార్య ప్రియా నాథ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పతులకు విజయాన్ని కట్టబెట్టడం కోసం వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దైవ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటున్నారు. సామాన్య ప్రజలను ఆకర్షించే కార్యక్రమాల్లో ప్రియదర్శిని రాజే సింధియా, ప్రియా నాథ్ పాల్గొంటున్నారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి వారితో మాటలు కలిపి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

భర్త గెలుపు కోసమే
ఛింద్వాడాలో సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.697 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 475 మంది లోక్‌సభ అభ్యర్థుల కోటీశ్వరుల జాబితాలో నకుల్‌నాథ్‌ అగ్రస్థానంలో ఉన్నారు. నకుల్‌ నాథ్‌ సతీమణి ప్రియా నాథ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌరై ప్రాంతంలోని ఓ వ్యవసాయ పొలంలో పంటలు కోస్తూ కనిపించారు. అంతేకాకుండా నవేగావ్‌ గ్రామంలో భగవత్ కథ చెప్పే మండపం వద్ద ప్రియా నాథ్‌ భక్తి పాటలకు గ్రామ మహిళలతో కలిసి నృత్యం చేశారు.

వడోదరలోని గైక్వాడ్ రాజకుటుంబానికి చెందిన ప్రియదర్శిని రాజే సింధియా తన భర్త జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్న గుణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ, మార్కెట్ ప్రదేశాల్లో ఓటర్లను కలుసుకుని తన భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గత వారం ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రియదర్శిని రాజే గత 20 సంవత్సరాలుగా జ్యోతిరాధిత్య సింధియా గుణ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజల పట్ల ఎంతో అప్యాయతతో ఉంటున్నారని తెలిపారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో గుణ ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు, ట్యాంకర్లు, ఆసుపత్రుల్లో మందులతో పాటు ఆహారం, నీరు సహా ఇతర అవసరాలకు ఎలాంటి కొరత ఉండకూడదని ఆయన తపించారని గుర్తు చేసుకున్నారు.

ప్రచారాల్లో ప్రత్యర్థులపై విమర్శలు
ఛింద్వాడాలో ప్రియా నాథ్ రాజకీయంగా విమర్శనాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన కమల్ నాథ్​కు అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు వీరంతా ద్రోహం చేశారని ఆమె మండిపడ్డారు. ఛింద్వాడా ప్రజలు 44 సంవత్సరాలుగా తమతో కలిసి ఉన్నారని, ఎన్నికలకు 44 రోజుల ముందు ఈ బంధాన్ని ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదని ప్రియా నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

భార్యల ప్రచారాలు గెలిపిస్తాయా?
నకుల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరికీ ఎన్నికల పోరు ఈసారి కఠినంగా కనిపిస్తోంది. సింధియా గత ఎన్నికల్లో గుణలో పరాజయం పాలయ్యారు. గుణ లోక్‌సభ స్థానాన్ని సింధియా కుటుంబ సభ్యులు 14 సార్లు గెలుచుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా గుణ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. రాజమాత విజయరాజే సింధియా 1957- 1998 మధ్య ఆరుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా 2002-2014 మధ్య నాలుగు సార్లు గుణ నుంచి ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఛింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 లోక్‌సభ ఎన్నికలలో ఇదే స్థానం నుంచి గెలిచారు. 1997లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి సుందర్‌లాల్ పట్వా చేతిలో కమల్ నాథ్ ఓడిపోవడం మినహా 1980 తర్వాత ఛింద్వాడా నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో నాథ్ కుటుంబం విజయం సాధించింది.

వ్యాపారి ఇంట్లో నోట్ల గుట్టలు, బంగారం బ్యాగులు- లోక్​సభ ఎన్నికల వేళ భారీగా పట్టివేత - Money Seized By Police In Karnataka

అమితాబ్​పైకి చున్నీలు విసిరి అమ్మాయిల సందడి- 4వేల బ్యాలెట్ పేపర్లపై లిప్​స్టిక్​ గుర్తులు! - 1984 LS Polls Amitabh Bachchan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.