ETV Bharat / bharat

తిరువనంతపురంలో టఫ్​ ఫైట్​! విజయంపై థరూర్​ ధీమా! కేరళలో జెండా పాతేందుకు బీజేపీ రె'ఢీ'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 6:39 PM IST

Thiruvananthapuram Seat Fight
Thiruvananthapuram Seat Fight

Thiruvananthapuram Seat Fight : సార్వత్రిక ఎన్నికల్లో 370 లోక్‌‌సభ సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దక్షిణ భారతదేశంలోనూ పార్టీ రాణించాల్సి ఉంటుందని కమలదళానికి తెలుసు. అందుకే దక్షిణాదిలోని 84 లోక్‌సభ సీట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా స్థానాల్లో గెలిచేందుకు ఉపయోగపడే ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మోదీ సేన ప్లాన్ చేసింది. ఇలాంటి హాట్ సీట్లలోనే ఒకటి కేరళలోని తిరువనంతపురం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) కూటమి మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈనేపథ్యంలో అభ్యర్థుల బలాబలాలపై ఓ ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Thiruvananthapuram Seat Fight : దేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళలో ఒకే దశలో ఏప్రిల్ 26న ఓట్ల పండుగ జరుగనుంది. రాష్ట్రంలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది. ఈసారి కనీసం ఒకటి, రెండైనా గెలవాలనే టార్గెట్‌తో మోదీసేన పావులు కదుపుతోంది. అయితే రాష్ట్ర రాజధాని కావడం వల్ల తిరువనంతపురంలో జరిగే లోక్‌సభ సమరంపై యావత్ రాష్ట్రం ఫోకస్ ఉంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ ఉన్నారు.

ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు తిరువనంతపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ట్రాక్ రికార్డు శశి థరూర్ సొంతం. 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్నందన వల్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలపైనా థరూర్‌కు మంచి పట్టు ఉంది. అక్కడి పార్టీ క్యాడర్‌తో అద్భుతమైన సమన్వయం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండటమే తన బలమని, గత పదిహేను సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో శశిథరూర్ ఉన్నారు. ఈసారి పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఎల్‌డీఎఫ్ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్‌లను తక్కువ అంచనా వేయలేమని శశిథరూర్ అంటున్నారు.

బీజేపీ, ఎల్‌డీఎఫ్‌లు బలంగా ఉన్నాయని అంటూనే!
''నియోజకవర్గ ప్రజల ముందు సిగ్గుతో తలదించుకునే పనులేవీ నేను చేయలేదు. వారి సమస్యలను పరిష్కరించడానికే నిరంతరం ప్రాధాన్యం ఇచ్చాను. ఈ అంశాలే నాకు విశ్వాసాన్ని అందిస్తుంటాయి'' అని శశిథరూర్​ చెబుతున్నారు. ''నేను వరుసగా గత మూడుసార్లు తిరువనంతపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాను. గత రెండు ఎన్నికల్లో రెండో స్థానంలో బీజేపీ నిలిచింది. నా కంటే ముందు వరుసగా రెండు సార్లు ఇక్కడి నుంచి సీపీఐ గెలిచింది. అలాంటప్పుడు బీజేపీ, ఎల్‌డీఎఫ్‌లను తక్కువ అంచనా వేయలేం'' అని శశిథరూర్ స్థానిక రాజకీయ సమీకరణాలను విశ్లేషిస్తున్నారు. ఈసారి ఎన్నికలను తాను సీరియస్‌గా తీసుకుంటున్నానని స్పష్టం చేస్తున్నారు.

మోదీ చరిష్మాయే గెలిపిస్తుంది!
ఈసారి మోదీ చరిష్మాయే తనను గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అంటున్నారు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేసిన ప్రజారంజక విధానాలను చూసి తిరువనంతపురం ప్రజలు తనకు ఓటు వేస్తారని ఆయన చెబుతున్నారు. కేంద్ర మంత్రి హోదాలో సాంకేతిక, పర్యాటక, ఎలక్ట్రానిక్స్, తయారీ, పరిశోధనా రంగాల్లో తిరువనంతపురం వికాసానికి తనవంతుగా కృషి చేశానని, అదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తానని రాజీవ్ తెలిపారు.

బీజేపీని ఎవరూ పట్టించుకోరు!
తిరువనంతపురంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఎల్‌డీఎఫ్ మధ్యే ఉందని బీజేపీని ఎవరూ పట్టించుకోరని ఎల్‌డీఎఫ్ అభ్యర్థి పన్నయన్ రవీంద్రన్ అంటున్నారు. ఎల్‌డీఎఫ్ కూటమి సిద్ధాంతాలను ప్రజలు ఆశీర్వదిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2005 సంవత్సరంలో తిరువనంతపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ట్రాక్ రికార్డు తనకు ఉందని రవీంద్రన్ గుర్తు చేస్తున్నారు.

గత ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి
2019 లోక్‌సభ ఎన్నికల్లో శశి థరూర్ 4,16,131 (41.4 శాతం) ఓట్లను సాధించి విజేతగా నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌కు 3,16,142 (31.4 శాతం) ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సి. దివాకరన్‌కు 2,58,556 ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో శశి థరూర్ 2,97,806 (34.09 శాతం) ఓట్లను సాధించి విజేతగా నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఓ.రాజగోపాల్‌కు 2,82,336 (32.32 శాతం) ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి బెన్నెట్ అబ్రహంకు 2,48,941 (28.50 శాతం) ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ?
పైన రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో శశిథరూర్ సాధించిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. బీజేపీ అభ్యర్థికి కూడా కొంతమేర ఓట్లు పెరిగాయి. దీన్నిబట్టి తిరువనంతపురంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రత మరింత పెరిగిందనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఈసారి ఎలాగైనా తిరువనంతపురం సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో కమలదళం ఉంది. ఇక 2014తో పోలిస్తే 2019లో సీపీఐ అభ్యర్థులకు పడిన ఓట్లు చాలా వరకు తగ్గిపోయాయి.

వారణాసి టు వయనాడ్​​- రసవత్తర పోరుకు అంతా రె'ఢీ'- లోక్‌సభ హాట్​ సీట్లు ఇవే!

మోదీ గ్యారంటీ Vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారెంటీ- 2024 యుద్ధం షురూ- టాప్ 10 ప్రచార అస్త్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.