ETV Bharat / bharat

ఇద్దరు సీఎంల కుటుంబాల మధ్య 'ఢీ'- 4సార్లు యడ్డీ ఫ్యామిలీదే విజయం- మరి ఈసారి?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 11:12 AM IST

Updated : Mar 12, 2024, 11:41 AM IST

Shivamogga Loksabha Election 2024 : దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అయితే కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో 2009 నుంచి ఇద్దరు మాజీ సీఎంల కుటుంబాల మధ్య పోరు నెలకొంటోంది. ఇప్పుడు మరోసారి ఆ రెండు కుటుంబాల నుంచే బరిలోకి దిగనున్నారు. ఈసారి మరి ఎవరు గెలవనున్నారో?

Shivamogga Loksabha Election 2024
Shivamogga Loksabha Election 2024

Shivamogga Loksabha Election 2024 : త్వరలో లోక్​సభ ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం మరికొద్దిరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో తలమునకలయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్​ తొలి జాబితాను విడుదల చేయగా, రెండో లిస్ట్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. తమ మేనిఫెస్టోలకు కూడా తుదిరూపినిస్తున్నాయి.

అయితే కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం బంగారప్ప కుటుంబం మరోసారి పోటీలో దిగుతోంది. బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్‌ కుమార్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇటీవలే కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో గీత పేరు ఉంది. అయితే ఆమెకు పోటీగా మరో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యడ్యూరప్ప తనయుడు పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Shivamogga Loksabha Election 2024
శివరాజ్​ కుమార్​, గీత
Shivamogga Loksabha Election 2024
బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్ర

ఇప్పటికే నాలుగుసార్లు!
బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బీవై రాఘవేంద్రకు టికెట్‌ కన్ఫామ్​ అని వార్తలు వస్తున్నా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో శివమొగ్గలో మరోసారి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబసభ్యులు పోటీపడనున్నారు. దీంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. అయితే మాజీ సీఎంల కుటుంబాల మధ్య పోరు ఇది తొలిసారి కాదు. 2009 నుంచి ఇలానే జరుగుతోంది.

2009లో తొలిసారి
2009లో యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర తొలిసారిగా బీజేపీ నుంచి దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్పపై పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో యడ్యూరప్పపై గీతా శివరాజ్‌కుమార్‌ పోటీ చేసి ఓడిపోయారు. 2018 లోక్‌సభ ఉప ఎన్నికలో మధు బంగారప్ప జేడీఎస్ గుర్తుపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా బీవై రాఘవేంద్ర చేతిలో ఓటమి పాలయ్యారు. షికారిపుర నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ప్రస్తుత ఎంపీ బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇప్పుడు ఐదోసారి!
2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా జేడీఎస్ నుంచి బీవై రాఘవేంద్రపై పోటీ చేసిన మధు బంగారప్ప మళ్లీ ఓటమి చవిచూశారు. ఇలా గడిచిన నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుటుంబీకులు నేరుగా తలపడ్డారు. ఇప్పుడు ఐదోసారి పోటీ పడనున్నారు. అయితే కన్నడ నటుడు శివరాజ్ కుమార్​ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాలకు దూరంగా గీత, 2014లో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గీత సోదరుడు శివమొగ్గ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఉన్నారు.

ప్రచారానికి సినీనటులంతా!
గతసారి గీతా శివరాజ్‌కుమార్‌ తరఫున ఉపేంద్ర, విజయ రాఘవేంద్ర, శ్రీమురళి, వినోద్‌ ప్రభాకర్‌తో పాటు పలువురు కన్నడ నటీనటులు ప్రచారానికి వచ్చారు. ఇప్పుడు కూడా ప్రచారానికి చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. గీత భర్త, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే గీతను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఆమె నగరంలోని తన సోదరుడు మధు బంగారప్ప ఇంటి పక్కనే ఇల్లును అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

యూసుఫ్​ పఠాన్​కు ఎంపీ టికెట్​- మహువా సహా 42మంది అభ్యర్థుల లిస్ట్​ రిలీజ్​- కాంగ్రెస్​కు దీదీ గట్టి షాక్

డీఎంకేతో కమల్ హాసన్ పార్టీ పొత్తు- లోక్​సభ ఎన్నికల్లో పోటీకి దూరం

Last Updated : Mar 12, 2024, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.