ETV Bharat / bharat

చైనా సరిహద్దులో 'సేలా టన్నెల్‌' ప్రారంభం- అరుణాచల్​ వస్తే 'మోదీ గ్యారంటీ' చూడొచ్చన్న ప్రధాని

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 12:47 PM IST

Updated : Mar 9, 2024, 2:17 PM IST

Sela Tunnel Pm Modi : భారత సరిహద్దులో ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మక సేలా టన్నెల్‌ను ప్రారంభించారు. దీనితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

Sela Tunnel Pm Modi
Sela Tunnel Pm Modi

Sela Tunnel Pm Modi : ఇండియా- చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్​లో నిర్మించిన సేలా టన్నెల్​ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన 'వికసిత్ భారత్‌- వికసిత్‌ నార్త్‌ ఈస్ట్' కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.

'అరుణాచల్​ వస్తే మోదీ గ్యారంటీ ఎంటో చూడొచ్చు'
"దక్షిణ, తూర్పు ఆసియాతో భారతదేశ వాణిజ్యం, పర్యాటకం, ఇతర సంబంధాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఒక బలమైన వారిధిగా మారనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మేము ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ చేయడానికి 20ఏళ్లు పడుతుంది. అరుణాచల్​ప్రదేశ్​ను సందర్శిస్తే 'మోదీ గ్యారంటీ' ఏమిటో స్పష్టంగా చూడవచ్చు. మోదీ 'గ్యారంటీ' ఎలా పని చేస్తుందో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు గమిస్తున్నాయి. నేను దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను, అందుకే విపక్ష ఇండియా కూటమి నాయకులు నాపై దాడి చేస్తున్నారు" అని ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

సేలా టన్నెల్ విశేషాలు

  • సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్‌-తవాంగ్‌ (BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.
  • ఈ సేలా టెన్నెల్​ను సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్​ఓ) నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 980 మీటర్లు, టన్నెల్‌-2 రెండు సొరంగమార్గాలతో 1,555 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్‌-2 సొరంగ మార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు.
  • పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక-ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది.
  • ఈ టన్నెల్ వల్ల తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
  • ఈ టన్నెల్‌ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్‌ వ్యవస్థలు, లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగాల్లో ఏర్పాటు చేశారు.
  • 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఈ సొరంగమార్గంతో అత్యవసర పరిస్థితుల్లో భారత దళాలు త్వరగా సరిహద్దులకు చేరుకునే అవకాశం ఉంది.
  • చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటం వల్ల డ్రాగన్‌ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే ఈ సొరంగమార్గం అందుబాటులోకి రావడం వల్ల వారికి ఆ అవకాశం ఉండదు.

అహోం ఆర్మీ కమాండ్ విగ్రహ ఆవిష్కరణ
ఈటానగర్ కార్యక్రమం తర్వాత అసోంలోని జోర్హాట్​లో ప్రధాని మోదీ పర్యటించారు. లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల క్యాంస విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని రామ్ వంజీ సుతార్ నిర్మించారు. 84 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని, 41 అడుగల పీఠంపై ఏర్పాటు చేశారు. 2022లోనే మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.

దేశంలోనే ఫస్ట్ అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ- విద్యార్థులతో కలిసి ప్రయాణం

జమిలి ఎన్నికలపై ముగిసిన కసరత్తు! త్వరలో కేంద్రానికి కోవింద్‌ కమిటీ నివేదిక

Last Updated : Mar 9, 2024, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.