ETV Bharat / bharat

సొంత భూమి, ఇల్లు, కారు లేని మోదీ- అకౌంట్​లో ఎంత ఉందంటే? - PM Modi Property

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 8:12 PM IST

Updated : May 14, 2024, 9:02 PM IST

PM Modi Assets : వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, తనకు సొంత ఇల్లు, భూమి, కారు లేదని అఫిడవిట్‌లో వెల్లడించారు. 3 కోట్లకుపైగా విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు.

PM Modi
PM Modi (Source : Getty Images)

PM Modi Assets : ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు 3 కోట్ల 2 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో మోదీ పేర్కొన్నారు. 52,920 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు పత్రాల్లో మోదీ వెల్లడించారు. సొంత భూమి, ఇల్లు, కారు తనకు లేవని స్పష్టం చేశారు.

మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షలు ఉండగా, అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23.5 లక్షలు అయ్యింది. ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ ఖాతాలో 73వేల 304 రూపాయల డిపాజిట్ ఉండగా, వారణాసి బ్రాంచ్‌లో ఏడు వేలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎస్‌బీఐలో మోదీ పేరిట 2 కోట్ల 85 లక్షల 60వేల 338 రూపాయల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది.

2,67,750 రూపాయల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మోదీకి ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్‌డీఏ అభ్యర్థిగా మోదీ పోటీ చేశారు. మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకుంటున్న మోదీ, ఈసారి మళ్లీ వారణాసి స్థానం నుంచే నామినేషన్‌ దాఖలు చేశారు. గంగా సప్తమి, పుష్య నక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్‌ పత్రాలను సమర్పించారు. అయితే, ఈ నామినేషన్‌ ప్రక్రియలో మోదీ పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ నలుగురు ఎవరంటే?

  • పండిత్‌ గణేశ్వర్‌ శాస్త్రి : బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శాస్త్రి ప్రముఖ జ్యోతిష్యుడు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన భవ్య మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించింది ఈయనే.
  • బైజ్‌నాథ్‌ పటేల్‌ : వారణాసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సేవాపురి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈయన. ఓబీసీ వర్గానికి చెందిన పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. సుదీర్ఘకాలంగా జన్‌సంఘ్‌, భాజపాతో కలిసి పని చేస్తున్నారు. కుర్మీ పటేల్‌ వర్గానికి సేవాపురి, రోహానియాలో గట్టి పట్టు ఉంది.
  • లాల్‌చంద్‌ కుశ్వాహా : ఈయన కూడా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తే. కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సిగ్రా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల కుశ్వాహా సుదీర్ఘకాలంగా బీజేపీ కేడర్‌లో ఉన్నారు. స్థానికంగా టెక్స్‌టైల్‌ దుకాణం నిర్వహిస్తున్నారు.
  • సంజయ్‌ సోంకర్‌ : దళిత సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌ సోంకర్‌ వారణాసి భాజపా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఎస్సీ కమ్యూనిటీలో ఈయనకు మంచి పలుకుబడి ఉంది.

తమ ప్రభుత్వంలో అన్నివర్గాల వారికీ సమ ప్రాధాన్యం కల్పిస్తామనే ఉద్దేశాన్ని చాటిచెప్పేందుకే ప్రధాని ఇలా విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వారిని ప్రతిపాదకులుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలోనూ ప్రధానిని నలుగురు భిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు ప్రతిపాదించారు.

Last Updated :May 14, 2024, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.