ETV Bharat / bharat

క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్- స్పీకర్ అనర్హత వేటు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 11:33 AM IST

Updated : Feb 29, 2024, 12:55 PM IST

Himachal Pradesh Politics Today : హిమాచల్​ ప్రదేశ్​లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్​ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు ఆయన తెలిపారు

himachal pradesh politics today
himachal pradesh politics today

Himachal Pradesh Politics Today : హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ విప్‌ను ధిక్కరించిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్ , చెతన్య శర్మగా స్పీకర్ వెల్లడించారు.

తక్షణమే అమల్లోకి!
ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా- హస్తం పార్టీ గుర్తుపై ఎన్నికైనందున ఈ శాసనసభ్యులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని శిమ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ ఎమ్మెల్యేలందరూ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

బీజేపీ విఫలయత్నం
హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. అనంతరం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై ఓటింగ్‌కు వీరు దూరంగా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని ఆ రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లాను కలిసిన బీజేపీ నేతలు అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కాంగ్రెస్ సేఫ్​!
సభలో నినాదాలు చేసిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పథానియా సస్పెండ్ చేశారు. అనంతరం వాయిస్ ఓటింగ్ ద్వారా ఆర్థిక బిల్లును సభ ఆమోదించింది. తర్వారా సభను స్పీకర్‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్ ప్రదేశ్​ అసెంబ్లీ బలం 68 నుంచి 62కి తగ్గింది. మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32 తగ్గింది. ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఉన్నారు.

Last Updated : Feb 29, 2024, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.