ETV Bharat / bharat

బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత - Sushil Kumar Modi Death

author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 10:44 PM IST

Updated : May 14, 2024, 6:41 AM IST

Sushil Kumar Modi Passed Away : బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ తుదిశ్వాస విడిచారు. దిల్లీ ఎయిమ్స్​లో చికిత్స తీసుకుంటూ సోమవారం రాత్రి కన్నుమూశారు.

Sushil Kumar Modi
Sushil Kumar Modi (Source : ANI)

Sushil Kumar Modi Passed Away : బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ(72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

సుశీల్ కుమార్ మోదీ మరణించిన విషయాన్ని బిహార్ బీజేపీ సోషల్ మీడియాలో వెల్లడించింది. సుశీల్ కుమార్ మోదీ మరణవార్తతో బీజేపీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని చెప్పింది. ఆయన మరణం బీజేపీ కుటుంబానికి తీరని లోటుగా తెలిపింది.

బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర : ప్రధాని మోదీ
సుశీల్‌ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సుశీల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుశీల్‌ అకాల మరణం పార్టీకి తీరని లోటు అని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని, బిహార్‌లో బీజేపీ ఎదుగుదల, విజయంలో సుశీల్‌ ఎనలేని పాత్ర పోషించారని కొనియాడారు. బిహార్‌ గొప్ప మార్గదర్శకుడిన కోల్పోయిందని పేదలు, వెనకుబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడ్డారని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు. సుశీల్‌ తన జీవితాన్ని బిహార్‌ అభివృద్ధికి అంకితం చేశారని జేపీ నడ్డా అన్నారు.

'బిహార్ సుశీల్​ను ఎప్పటికీ మరిచిపోదు'
'మా కుటుంబంలోని సీనియర్ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ మరణించారు. ఇది మా అందరికీ పెద్ద షాక్. బిహార్​, బీజేపీని ముందుకుతీసుకెళ్లడంలో కృషి చేసిన ఆయన్ను బిహార్​ ఎప్పటికీ మరిచిపోదు. ఆయన కుటుంబ సభ్యులు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి' అని కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్ ఎక్స్​ వేదికగా ట్వీట్ చేశారు.

తీరని లోటు : సమ్రాట్ చౌదరి
సుశీల్​ కుమార్​ మోదీ మృతి పట్ల బిహార్​ బీజేపీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సంతాపం తెలిపారు. ఆయనకు నివాళులు అర్పించారు. ఇది బిహార్ బీజేపీకి తీరని లోటు అని అన్నారు. 'సుశీల్ కుమార్ మోదీ ఇక లేరు. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారికి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని బిహార్ మాజీ మంత్రి, లాలూ యాదవ్ కుమారుడు తేజ్​ ప్రతాప్​ యాదవ్​ అన్నారు.

సుశీల్ కుమార్​ మోదీ రాజకీయ ప్రస్థానం
సుశీల్‌ కుమార్‌ మోదీ 1952 జనవరి 5న పట్నాలో జన్మించారు. జయప్రకాశ్​ నారాయణ నేతృత్వంలోని ఉద్యమంలో చేరారు. 1990లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సారి బిహార్​లోని కుంహార్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో భగల్​పుర్ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఆయన పదవీకాలం ముగిసింది.

Last Updated : May 14, 2024, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.