ETV Bharat / bharat

రణరంగంలా 'దిల్లీ చలో'- బారికేడ్లు తొలగించి దూసుకెళ్తున్న రైతులు! చర్చలకు సిద్ధమన్న కేంద్రం

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 5:03 PM IST

Updated : Feb 13, 2024, 10:55 PM IST

Farmers Protest Delhi 2024 :డిమాండ్ల సాధనకై దిల్లీ బాట పట్టిన రైతు సంఘాలను హరియాణా, పంజాబ్‌ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శంభు సరిహద్దు నుంచి ముందుకు వెళ్లేందుకు కర్షక సంఘాలు యత్నిస్తుంటే పోలీసులు భాష్పవాయుగోళాలతో నిలువరిస్తున్నారు. శంభు సరిహద్దు వద్దకు వందలాదిగా రైతులు చేరుకున్నారు. పోలీసు బలగాలు సైతం భారీ సంఖ్యలో మోహరించి ఉన్నాయి.

Farmers Protest Delhi 2024
Farmers Protest Delhi 2024

రణరంగంలా 'దిల్లీ చలో'- బారికేడ్లు తొలగించి దూసుకెళ్తున్న రైతులు!

Farmers Protest Delhi 2024 : కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీకి బయలుదేరిన రైతు సంఘాలను హరియాణా, పంజాబ్‌ సరిహద్దు ప్రాంతం శంభు వద్ద నుంచి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు, మేకులతో రోడ్డుకు అడ్డుగా పోలీసులు పెట్టిన ఆటంకాలను తొలిగించేందుకు రైతులు ప్రయత్నించారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలిగించేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. బాష్పవాయు గోళాలతో పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడం వల్ల రైతులు పరుగులు పెట్టారు. ఈ పరిణామాలతో శంభు సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

పోలీసులపై రాళ్లు రువ్విన రైతులు
బాష్ప వాయుగోళాలతో పాటు జలఫిరంగులను కూడా రైతులపైకి ప్రయోగించారు. భారీసంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో శంభు సరిహద్దుకు చేరుకున్న రైతులు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా బాష్ప వాయుగోళాలు జార విడిచారు. అయినా సరే బెదరకుండా ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నాలు కొనసాగించారు. శంభు వద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కిందపడేశారు. మరింత ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించిన కర్షకులపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ప్రస్తుతం శంభు సరిహద్దు వద్దే రైతులకు, పోలీసులకు మధ్య ప్రతిఘటన జరుగుతోంది.

రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రోడ్డు మార్గం ద్వారా కాకుండా పక్కనే ఉన్న పొలాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులను బాష్పవాయువు గోళాలతో అడ్డుకుంటున్నారు. ఆటంకాలను అధిగమించి పొలాల ద్వారా దిల్లీ వైపు దూసుకెళ్తున్న కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని జింద్‌ వద్ద కూడా కర్షకులు ముందుకు వెళ్లకుండా పోలీసు, పారామిలటరీ బలగాలు అడ్డుకుంటున్నాయి. రహదారిపై కాంక్రీటు స్లాబులు, ఇనుప మేకులు, ముళ్ల కంచెలతో అడ్డుకట్ట వేశారు. అయినా వెనక్కి తగ్గని రైతులపై బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు.

చర్చలకు సిద్ధమే
అంతకుముందు పంజాబ్ కిసాన్‌ మజ్దూర్ సంఘర్షణ సమితి సభ్యులు దేశ రాజధానికి ట్రాక్టర్లలో బయలుదేరారు. తాము సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకుండానే దిల్లీ చలో చేపడతామని తెలిపారు. చర్చల్లో కేంద్ర మంత్రుల నుంచి సానుకూల నిర్ణయాలు ఏమీరాలేదన్నారు. రైతుల ఆందోళనను బూచిగా చూపి భద్రత పేరుతో హరియాణా, పంజాబ్ ప్రజలను వేధిస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపించారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను అంతర్జాతీయ సరిహద్దు మాదిరి మార్చేశారని విమర్శించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమేనని తెలిపారు.

కేంద్రం స్పందన
సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపకుండా కనీస మద్దతు ధరపై చట్టాన్ని తొందరపడి తీసుకురాలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంఎస్​పీ గ్యారెంటీకి సంబంధించిన డిమాండ్​పై రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ నిరసనను అప్రతిష్ఠపాలు చేసే విషయంపై అప్రమత్తంగా ఉండాలని రైతులను హెచ్చరించారు. రెండు రౌండ్ల చర్చల్లో కర్షకుల అనేక డిమాండ్లను అంగీకరించామని, కొన్ని అంశాలపై ఇంకా ఒప్పందం కుదరలేదని చెప్పారు.

రాజధానిలో పోలీసుల పహారా
మరోవైపు దేశ రాజధాని మొత్తం పోలీసుల పహారా కొనసాగుతోంది. 144 సెక్షన్‌ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల సమన్వయంతో రైతులు ఎటు నుంచి వస్తారో అంచనా వేసి ఆయా ప్రాంతాల వద్ద పోలీసులతో పాటు RPF బలగాలను.. మోహరించారు. గాజీపుర్‌ సరిహద్దు వద్ద కాంక్రీట్‌ బారికేడ్లతో రహదారిని మూసివేశారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాత దిల్లీలోకి అనుతిస్తున్నారు. టిక్రీ సరిహద్దులను కూడా మూసివేశారు. పోలీసు బలగాలను, క్విక్ రెస్పాన్స్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. డ్రోన్లతో సైతం ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.

దిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్
పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్లతో దిల్లీలోకి దారితీసే మార్గాల్లో వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. గాజీపుర్ వద్ద, దిల్లీ-నోయిడా చిల్లా సరిహద్దు వద్ద భారీగా వాహనాలు నిలిచి చోదకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక కిలోమీటరు దూరానికి గంట పడుతోందని చోదకులు వాపోతున్నారు.

చర్యలు తీసుకోవాలని సీజేఐకు లేఖ
రాజధానిలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమార్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభ్యర్థించింది. సామాన్య ప్రజల రోజూవారీ పనులకు భంగం కలిగినందున సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరింది. ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లు వాస్తవమైనవే అయినా, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే హక్కు వారికి లేదని లేఖలో ప్రస్తావించింది.

తమిళనాడు రైతుల మద్దతు
దిల్లీకి బయలుదేరిన కర్షకులకు మద్దతుగా తమిళనాడులోని తిరుచ్చికి చెందిన కొందరు రైతులు మద్దతు తెలిపారు. మానవ అస్థి పంజరాలు పట్టుకుని రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు మొబైల్ ఫోన్ టవర్ ఎక్కి తమ మద్దతును తెలియజేశారు.

Farmers Protest Delhi 2024
మద్దతు తెలిపిన తమిళనాడు రైతులు

భారతరత్న ఇచ్చారు- కానీ!
రైతుల డిమాండ్ల పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం టియర్ గ్యాస్ ప్రయోగిస్తోందిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్​కు కేంద్ర భారతరత్న ప్రకటించిందని, కానీ ఆయన సూచనలను అమలు చేయదని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్​ అధికారంలో వస్తే ఎంఎస్​పీకి చట్టబద్ధమైన హామీ ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.

Last Updated :Feb 13, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.