ETV Bharat / bharat

'ఎలక్షన్ కింగ్' 239వ నామినేషన్- మోదీ, రాహుల్​తో ఢీ- ఇప్పటి వరకు రూ.కోటి లాస్​! - Election King Padmarajan

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 4:09 PM IST

Election King Padmarajan: పద్మరాజన్ 'ఎలక్షన్ కింగ్'!! ఈయన ఎంతటి వాళ్లనైనా డోంట్ కేర్ అంటారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ లాంటి అగ్రనేతలు పోటీచేసే స్థానాల్లోనూ ఏ మాత్రం ఆలోచించకుండా నామినేషన్లు వేసేస్తారు. ఎన్నికల్లో 238 సార్లు చిత్తుచిత్తుగా ఓడిపోయినా విక్రమార్కుడిని మించిన పట్టుదలతో తాజాగా 239వ సారి తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ స్థానం నుంచి పద్మరాజన్ నామినేషన్ వేశారు. ఇప్పటిదాకా 238 ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల దాదాపు రూ.కోటికిపైగా డిపాజిట్లు గల్లంతైన ఎలక్షన్ కింగ్‌ గురించి మీకోసం.

Election King Padmarajan
Election King Padmarajan

Election King Padmarajan : ఆయన పేరు పద్మరాజన్. కానీ అందరూ 'ఎలక్షన్ కింగ్' అని పిలుస్తుంటారు. 'ఎలక్షన్ కింగ్' అంటున్నారు కదా అని పద్మరాజన్ వరుస పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నాడని మీరు అనుకుంటే 'తప్పు'లో కాలేసినట్టే! అసలు సీన్​ అందుకు రివర్స్‌లో జరుగుతోంది. రిజల్ట్ సంగతి అలా ఉంచితే, వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి దాకా ప్రతీ ఎన్నికకు నామినేషన్లు వేయడంలో ఆయన కింగ్!!

సేలం జిల్లా మేట్టూరుకు చెందిన 64 ఏళ్ల పద్మరాజన్‌ ఇప్పటివరకు వివిధ ఎన్నికల్లో 239 సార్లు నామినేషన్లు వేశారు. తాజాగా బుధవారం (మార్చి 20న) ఆయన తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ స్థానం నుంచి తన 239వ నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతోపాటు తమిళనాడులోని మరో నాలుగు సీట్లలోనూ నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పద్మరాజన్ సొంతం చేసుకున్న అరుదైన ఎన్నికల రికార్డుల గురించి తెలుసుకుందాం.

నామినేషన్ దాఖలు చేస్తున్న పద్మరాజన్
నామినేషన్ దాఖలు చేస్తున్న పద్మరాజన్

నామినేషన్లు ఎందుకు వేస్తున్నారో తెలుసా?
టైర్ రీట్రేడింగ్ కంపెనీని కలిగి ఉన్న పద్మరాజన్ 1988 సంవత్సరం నుంచి ఇప్పటివరకు వివిధ ఎన్నికల్లో 239 సార్లు నామినేషన్లు వేశారు. అయితే ఒక్కసారి కూడా గెలవలేదు. కనీసం ఏ ఒక్క ఎలక్షన్‌లోనూ డిపాజిట్ కూడా పొందలేకపోయారు. వరుసపెట్టి ఓడిపోవడం వల్ల పద్మరాజన్ దాదాపు రూ.కోటికిపైగా ఎన్నికల డిపాజిట్లను కోల్పోయారు. ఇలా జరగడానికి కారణం, ఆయన కేవలం హాబీగా నామినేషన్ దాఖలు చేస్తుంటారు.

అంతేకానీ ప్రచారం అస్సలు చేయరు. 'ఎన్నికల్లో ప్రచారం చేసేంత టైం నాకు లేదు. ప్రజల్లో ఓటుహక్కుపై అవగాహన కలిగించేందుకే నేను ఇలా నామినేషన్లు దాఖలు చేస్తుంటా. నాకెలాంటి పదవీ వ్యామోహం లేదు' అని పద్మరాజన్‌ చెబుతుంటారు. '2011లో నేను మెట్టూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీ చేస్తే 6,273 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు నా ఎన్నికల కెరీర్‌లో వచ్చిన అత్యధిక ఓట్లు అవే. కొన్ని ఎన్నికల్లో నాకు సున్నా ఓట్లు వచ్చాయి' అని ఆయన వివరించారు.

ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, సీఎంలతో ఢీ
పద్మరాజన్‌ వృత్తిపరంగా హోమియోపతి వైద్యుడు. అయితే పద్మరాజన్‌ నామినేషన్ వేసేటప్పుడు పోటీలో ఉన్న ఇతర అభ్యర్థుల గురించి అస్సలు పట్టించుకోరు. వాళ్లు ఎంత రేంజులో ఉన్నవారైనా డోంట్ కేర్ అంటారు. మాజీ ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయీ (లఖ్‌నవూ), పీవీ నర్సింహారావు (నంద్యాల), మాజీ సీఎంలు కరుణానిధి (తమిళనాడు), జయలలిత (తమిళనాడు), యడియూరప్ప (కర్ణాటక), ఎస్‌ఎం కృష్ణ (కర్ణాటక), పినరయి విజయన్ (కేరళ), బీజేపీ దిగ్గజ నేత అడ్వాణీ (గాంధీనగర్)పై ఆయన పోటీ చేశారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వడోదర నుంచి పోటీ చేశారు.

కేరళలోని వయనాడ్ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా పోటీ చేశారు. దిగ్గజ నేతలు ఎంకే స్టాలిన్​, ఎడప్పాడి పళనిస్వామిలపైనా పోటీ చేసిన రికార్డు పద్మరాజన్‌కు ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలపై పోటీ చేశారు. ఈయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు చెరో ఆరుసార్లు, వివిధ రాష్ట్రాల్లో 33 సార్లు లోక్‌సభకు, 51 సార్లు రాజ్యసభకు, 78 సార్లు శాసనసభకు, 3 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి మేయర్, 3సార్లు జడ్పీ ఛైర్మన్, 4సార్లు పంచాయతీ ప్రెసిడెంట్, 12సార్లు మున్సిపల్ కౌన్సిలర్, 6సార్లు వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేశారు.

సీనియర్లు VS జూనియర్లు- మంత్రుల వారసులు బరిలోకి- కర్ణాటకలో రసవత్తర రాజకీయం - Lok Sabha Election 2024 Karnataka

కాంగ్రెస్​ కంచుకోటలకు బీటలు! అమేఠీ, రాయ్​బరేలీలో పోటీకి గాంధీల వెనకడుగు? - Congress Not Contest In UP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.