ETV Bharat / bharat

'ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్'- రాహుల్ న్యాయ్​ యాత్రపై ఎఫెక్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 11:53 AM IST

Updated : Feb 16, 2024, 1:25 PM IST

Congress Accounts Freeze : కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసినట్లు ఆరోపించారు ఆ పార్టీ అగ్రనేత అజయ్​ మాకెన్. శుక్రవారం నుంచి తాము జారీచేసిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లడంలేదని తెలిపారు. ఈ ప్రభావం రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై పడుతుందన్నారు.

Congress Accounts Freeze
Congress Accounts Freeze

Congress Accounts Freeze : కాంగ్రెస్‌కు చెందిన నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని తెలిపారు ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్​. అందులో యూత్ కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు సైతం ఉన్నట్లు చెప్పారు. శుక్రవారం నుంచి తాము జారీచేసిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లడం లేదని పేర్కొన్నారు. నాలుగు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేసినట్లు ప్రకటించగా, విశ్వసనీయ వర్గాలు మాత్రం తొమ్మిదిగా పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్​ను కాంగ్రెస్ ఆశ్రయించింది. దీంతో అకౌంట్ల ఫ్రీజ్​పై అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది.

అంతకుముందు, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ తమకు 210 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదాయపు పన్నుశాఖ అడిగినట్లు అజయ్​ మాకెన్​ తెలిపారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కాంగ్రెస్ సేకరించిన ఖాతాలను స్తంభింపజేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్​కు 2 వారాల ముందు ప్రతిపక్షం బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడమంటే ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేసినట్లేనని విలేకరుల సమావేశంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు అజయ్ మాకెన్​.

'ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది'
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అజయ్​ మాకెన్​ ఆరోపించారు. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ అకౌంట్లను స్తంభింపజేయడం వల్ల పార్టీ రాజకీయ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. 'దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు డొల్ల కారణాలతో స్తంభింపజేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దానిని న్యాయవ్యవస్థ కాపాడాలి. దేశం ఏకపక్ష ప్రజాస్వామ్యం వైపు పయనిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద ఖర్చులకు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ ప్రభావం భారత్ జోడో న్యాయ్​ యాత్ర సహా ఇతర రాజకీయ కార్యకలాపాలపై కూడా పడుతుంది' అని అజయ్ మాకెన్ ఆరోపించారు.

'అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని చెప్పా'
హస్తం పార్టీ బ్యాంకు అకౌంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్తంభింపజేయడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్​లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఖాతాలను మోదీ ప్రభుత్వం స్తంభింపజేసింది. బీజేపీ సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు. కానీ మేం క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారు. అందుకే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని నేను చెప్పాను. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నాను' అని ఖర్గే తెలిపారు.

'ఖాతాలు పునరుద్ధరణ'
ఈ క్రమంలో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కాంగ్రెస్ ఖాతాలను పునరుద్ధరించింది ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్. కాంగ్రెస్ అప్పీల్​పై తదుపరి విచారణ ఫిబ్రవరి 21న జరపనుంది. ఒకవేళ కాంగ్రెస్ ఖాతాలు స్తంభింపజేస్తే ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదని తాను ట్రిబ్యునల్​కు చెప్పినట్లు కాంగ్రెస్ నాయకుడు వివేక్ తన్ఖా చెప్పారు.

'అందుకే ఖాతాలను స్తంభింపజేశాం'
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ తాము పంపిన నోటీసులకు సరిగా స్పందించలేదని జరిమానా కూడా చెల్లించలేదని ప్రకటించింది. అందుకే ఖాతాలను స్తంభింపజేశామని తెలిపింది. 2018-19లో విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటివరకు స్పందించలేదని వివరించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లు సీజ్ చేసినట్లు పేర్కొంది. ఖాతాలను సీజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, అనుబంధ విభాగాలకు ఆదాయ పన్నుశాఖ సమాచారం పంపింది.

హెడ్​ కానిస్టేబుల్ సస్పెన్షన్​- మణిపుర్​లో మళ్లీ హింస- ఇంటర్నెట్ బంద్​

'పాజిటివ్'గానే సాగాయ్​- కానీ మరోసారి రైతులతో చర్చలు : కేంద్రం

Last Updated : Feb 16, 2024, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.