ETV Bharat / bharat

భారీ ఎన్​కౌంటర్-​ 29 మంది మావోయిస్టులు హతం - chhattisgarh encounter today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 5:47 PM IST

Updated : Apr 16, 2024, 7:23 PM IST

Chhattisgarh Encounter Today : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్​లో 29 మంది మావోయిస్టులు మృతి మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి.

Chhattisgarh Encounter Today
Chhattisgarh Encounter Today

Chhattisgarh Encounter Today : సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్​లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందాలు మంగళవారం సంయుక్త సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని జిల్లా ఎస్పీ ఇంద్రకల్యాణ్ తెలిపారు. ఈ అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆస్పత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేత శంకర్‌రావు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఎన్‌కౌంటర్‌పై బీఎస్ఎఫ్ ప్రకటన
కాంకేర్‌ జిల్లాలోని కల్పర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29 మంది సీపీఐ మావోయిస్టు కార్యకర్తల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి 7 ఏకే సిరీస్ రైఫిళ్లు, 3 నాస్ లైట్ మెషిన్ గన్‌లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది.

ఎన్‌కౌంటర్ ఇలా మొదలైంది
ఈనెల 19న దేశంలో పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇలాంటి కీలక సమయంలో సోమవారం కాంకేర్ జిల్లాలోని ఛోటేబైథియా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామస్థుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ తరుణంలో మావోయిస్టుల ఏరివేత కోసం మంగళవారం తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు, పోలీసులతో కూడిన స్పెషల్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు అడవుల్లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వారిని ప్రతిఘటించేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు.

Last Updated :Apr 16, 2024, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.