ETV Bharat / bharat

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 6:38 PM IST

Updated : Mar 2, 2024, 10:42 PM IST

BJP Candidate List 2024
BJP Candidate List 2024

BJP Candidate List 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. మొత్తం 195 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా​ గాంధీనగర్​ నుంచి పోటీ చేయనున్నారు.

BJP Candidate List 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. మొత్తం 195 స్థానాలకుగానూ బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ తొలి జాబితా వెల్లడైంది.

34 మంది కేంద్రమంత్రులకు చోటు
ఈ జాబితాలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతీ ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు చోటు కల్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తావ్‌డే విశ్వాసం వ్యక్తంచేశారు.

రాష్ట్రాలవారీగా అభ్యర్థుల లెక్కలు

  • బంగాల్‌- 27
  • మధ్యప్రదేశ్‌- 24
  • గుజరాత్‌- 15
  • రాజస్థాన్‌- 15
  • కేరళ- 12
  • తెలంగాణ- 9
  • ఝార్ఖండ్‌- 11
  • ఛత్తీస్‌గఢ్​- 12
  • దిల్లీ- 5
  • జమ్మూకశ్మీర్‌- 2
  • ఉత్తరాఖండ్‌- 3
  • అరుణాచల్‌ ప్రదేశ్‌- 2
  • గోవా- 1
  • త్రిపుర- 1
  • అండమాన్‌ నికోబార్‌- 1
  • దమన్‌ అండ్‌ దీవ్‌- 1

బీజేపీ విడుదల చేసిన ఈ తొలి జాబితాలో 28 మంది మహిళలకు, 47 మంది యువతకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు అవకాశం కల్పించినట్లు వినోద్‌ తావ్‌డే తెలిపారు. 57 మంది ఓబీసీలను బరిలో నిలిపామని చెప్పారు.

పోటీలో ఉన్న కేంద్ర మంత్రులు వీరే

  1. అమిత్‌షా
  2. రాజ్‌నాథ్‌ సింగ్‌
  3. స్మృతీ ఇరానీ
  4. మన్‌సుఖ్‌ మాండవీయ
  5. జితేంద్ర సింగ్‌
  6. సర్బానంద సోనోవాల్‌
  7. గజేంద్ర షెకావత్‌
  8. భూపేంద్ర యాదవ్‌
  9. కిషన్‌ రెడ్డి, కిరెన్‌ రిజిజు
  10. జ్యోతిరాదిత్య సింధియా
  11. రాజీవ్‌ చంద్రశేఖర్‌
  12. అర్జున్‌ రామ్‌ మేఘ్​వాల్
  13. అర్జున్‌ ముండా

తొలిసారి ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్‌ కుమార్తె

  • గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి పోటీ చేయనున్నారు.
  • యూపీలోని లఖ్‌నవూ స్థానం నుంచి రాజ్‌నాథ్‌ సింగ్, అమేఠీ స్థానం నుంచి స్మృతీ ఇరానీ మరోసారి బరిలో నిలవనున్నారు.
  • రమేశ్‌ బిధూరి, పర్వేష్‌ వర్మ, మీనాక్షి లేఖి, హర్ష వర్ధన్‌, సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌ పేర్లను వారి స్థానాల నుంచి తప్పించారు.
  • న్యూదిల్లీ నుంచి సుష్మా స్వరాజ్‌ కుమార్తె బన్సురీ స్వరాజ్‌ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు.
  • కేరళలోని త్రిసూర్‌ లోక్‌సభ స్థానం నుంచి సినీ నటుడు సురేశ్‌ గోపి, యూపీ నుంచి హేమమాలిని, రవి కిషన్‌ లోక్‌సభ బరిలో నిలవనున్నారు.
  • వచ్చేవారం మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మరిన్ని పేర్లపై తదుపరి భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ నుంచి 9 మంది

  1. కరీంనగర్‌ - బండి సంజయ్‌కుమార్‌
  2. నిజామాబాద్‌- ధర్మపురి అర్వింద్‌
  3. జహీరాబాద్‌- బీబీ పాటిల్‌
  4. మల్కాజ్‌గిరి- ఈటల రాజేందర్‌
  5. సికింద్రాబాద్‌- కిషన్‌ రెడ్డి
  6. హైదరాబాద్‌- డాక్టర్‌ మాధవీ లత
  7. చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి
  8. నాగర్‌ కర్నూల్‌- పి.భరత్‌
  9. భువనగిరి- బూర నర్సయ్య గౌడ్‌

అభ్యర్థులకు మోదీ విషెస్​
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్న నేతలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రజలు మళ్లీ తమని అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదిస్తారని ఎక్స్​ వేదికగా విశ్వాసం వ్యక్తం చేశారు. 'మా పాలనలో జరిగిన అభివృద్ధి ట్రాక్​ రికార్డ్​తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రగతి ఫలాలు పేదలకు అందేలా మరింత కృషి చేస్తాం' అని అన్నారు.

పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.60 కోట్లు విలువైన కార్లు- రూ.2.5 కోట్ల వాచీలు, గోల్డ్​!

సముద్రంలో శత్రువుల వేటకు ఇండియన్ నేవీ రెడీ- రంగంలోకి MH 60R సీహాక్ హెలికాప్టర్​

Last Updated :Mar 2, 2024, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.