ETV Bharat / bharat

'రూ.3500 కోట్ల పన్ను నోటీసులు- కాంగ్రెస్​పై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం' - congress tax case

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 12:44 PM IST

Updated : Apr 1, 2024, 1:27 PM IST

Congress Income Tax Case Update
Congress Income Tax Case Update

Congress Income Tax Case Update : పన్ను నోటీసుల అంశంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు కాస్త ఊరట లభించింది. ఈ విషయంలో తుది తీర్పు వెలువడే వరకు పార్టీపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం సుప్రీంకోర్టుకు తెలిపింది. బకాయిలను ఇప్పుడే రికవరీ చేయబోమని వివరించింది. ఈ కేసు విచారణను జులైకు వాయిదా వేసింది న్యాయస్థానం.

Congress Income Tax Case Update : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.3500 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులపై కాంగ్రెస్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది తీర్పు వెలువడే వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనుకోవట్లేదని తెలిపింది.

'పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవు'
ఐటీ శాఖ నుంచి అందిన పన్ను డిమాండ్ల నోటీసులను కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఐటీ శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. 'కాంగ్రెస్‌ రాజకీయ పార్టీ. ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోం. దీనిపై తుది తీర్పు వచ్చేవరకు ముందస్తు చర్యలకు దిగబోం' అని కోర్టుకు తెలిపారు.

విచారణ జులైకు వాయిదా!
తుషార్‌ మెహతా వాదనలను జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మానం రికార్డు చేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఐటీ శాఖ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి స్వాగతించారు. వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.3500 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని మార్చిలో తమకు నోటీసులు అందాయని తెలిపారు.

మొత్తం రూ.3,567 కోట్లకు నోటీసులు!
Congress Income Tax : ఇటీవల ఐటీ విభాగం పన్ను బకాయిలకు సంబంధించి కాంగ్రెస్‌కు వరుసగా నోటీసులు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని గత శుక్రవారం నోటీసులు పంపింది. అనంతరం 2014-15 నుంచి 2016-17 మదింపు సంవత్సరాలకు సంబంధించి మరో రూ.1744 కోట్లు కట్టాలని మరో తాఖీదును ఇచ్చింది (IT Notices To Congress). ఈ నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ.3,567 కోట్లు ఐటీ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపుపన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను రికవరీ చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికల వేళ 'పన్ను ఉగ్రవాదం'తో ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

సీపీఐకి ఐటీ నోటీసులు- రూ.11కోట్లు ట్యాక్స్ కట్టాలట! - IT Notice to CPI

కాంగ్రెస్​కు మరో ఐటీ నోటీసు- మొత్తం రూ.3,567 కోట్లు ట్యాక్స్ కట్టాలట! - IT Notice To Congress

Last Updated :Apr 1, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.