ETV Bharat / bharat

అయోధ్య రాముడికి కొత్త పేరు- ఇకపై ఏమని పిలుస్తారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 2:52 PM IST

Updated : Jan 23, 2024, 3:02 PM IST

Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే?

ayodhya-ram-new-name
ayodhya-ram-new-name

Ayodhya Ram New Name : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తిని ఇక నుంచి 'బాలక్ రామ్​'గా పిలవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు నిర్ణయించినట్లు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు. వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ ఇప్పటివరకు 50-60 ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలలో భాగమయ్యారు. అయితే, అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమమే తన దృష్టిలో దైవికమైనది, ఉత్తమమైనదని చెప్పుకొచ్చారు. విగ్రహాన్ని తొలిసారి జనవరి 18న వీక్షించినట్లు చెప్పారు. అప్పుడు కళ్ల నుంచి ఆనందబాష్పాలు వచ్చాయని తెలిపారు. ఆ అనుభవాన్ని వర్ణించడం సాధ్యం కాదని భావోద్వేగానికి గురయ్యారు.

ayodhya-ram-new-name
అయోధ్య బాలక్ రామ్

వివిధ రంగాలకు చెందిన దేశ, విదేశీ ప్రముఖుల సమక్షంలో సోమవారం అంగరంగ వైభవంగా రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. లక్షలాది మంది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అప్పటివరకు చిన్న టెంట్​లో, ఆ తర్వాత తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి ప్రాణప్రతిష్ఠ వేడుకతో శాశ్వత ఆశ్రయం లభించినట్లైంది. ఇదివరకు పూజలు అందుకున్న పాత విగ్రహాన్ని కొత్త ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన పెద్ద విగ్రహం ముందు ఏర్పాటు చేశారు.

అత్యద్భుతంగా రాములోరి విగ్రహం
రామాలయంలోని కొత్త విగ్రహం మంత్రముగ్ధులను చేసేలా ఉంది. ప్రాణప్రతిష్ఠ రోజున పసుపు రంగు ధోతి; శంఖ, చక్ర, పద్మాలతో, బంగారు జరీతో నేసిన ఎర్రటి అంగవస్త్రంతో బాల రాముడు దర్శనమిచ్చాడు. దిల్లీకి చెందిన టెక్స్​టైల్ డిజైనర్ మనీశ్ త్రిపాఠి ఈ వస్త్రాలను రూపొందించారు. లఖ్​నవూకు చెందిన హర్​సహాయ్​మాల్ శ్యామ్​లాల్ జ్యువెలర్స్​ రాముడు ధరించిన ఆభరణాలను రూపొందించింది.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఆరు నెలల పాటు అకుంఠిత దీక్షతో విగ్రహాన్ని మలిచారు. తాను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు యోగిరాజ్. 'రాముడు నన్ను, నా కుటుంబాన్ని రక్షిస్తున్నాడని ఎప్పటి నుంచో భావించే వాడిని. రాముడే నన్ను ఈ పనికి ఎంచుకున్నాడు. విగ్రహాన్ని చెక్కేందుకు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది' అని చెప్పుకొచ్చారు.

వ్యవసాయ భూమిలో దొరికిన రాయి
మైసూరు, హెచ్​డీ కోటె తాలుకాలోని గుజ్జెగౌడనపురలో ఈ కృష్ణ శిల లభ్యమైంది. రామ్​దాస్ అనే స్థానిక కాంట్రాక్టర్(78) వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా ఈ రాయి బయటపడింది. రాయి నాణ్యతను పరిశీలించి అయోధ్య ఆలయం ట్రస్టీలకు సమాచారం ఇచ్చారు రామ్​దాస్.

అయోధ్య రామయ్యకు వెల్లువెత్తిన విరాళాలు- 101 కిలోల బంగారం కానుకగా ఇచ్చిన భక్తుడు

అయోధ్యకు పొటెత్తిన భక్తులు- దర్శనం కోసం భారీ క్యూ

'రామజ్యోతిని' వెలిగించిన మోదీ- పసిడి కాంతుల్లో అయోధ్య

Last Updated : Jan 23, 2024, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.