తెలంగాణ

telangana

మధుమేహంతో​ ఇబ్బంది పడుతున్నారా?.. పెరుగు, గుడ్లు తినేయండి!

By

Published : Oct 1, 2022, 3:48 PM IST

DIABETES

వయసుతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం చాలామంది మధుమేహం బారినపడుతున్నారు. ఆహార అలవాట్లు, అనారోగ్య జీవనశైలి దానికి దోహదం చేస్తున్నాయి. అయితే రోజుకు రెండు సార్లు ఛీజ్, పెరుగు లేదా గుడ్లు తింటే మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

రోజుకు రెండు సార్లు ఛీజ్, పెరుగు లేదా గుడ్లు తింటే మధుమేహం వచ్చే అవకాశం తగ్గడానికి తోడ్పడుతున్నట్టు కెనడాలోని మెక్‌ మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అలాగే రోజుకు రెండు సార్లు పాల పదార్థాలు తీసుకుంటే రక్తపోటు, గుండెజబ్బుతో ముడిపడిన సమస్యలూ తగ్గుతున్నట్టు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో మొత్తం 21 దేశాలకు చెందిన 1.4 లక్షల మంది ఆహార అలవాట్లను తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు. పెరుగు వంటి పాల పదార్థాలు తీసుకోవటానికీ జీవక్రియ రుగ్మత (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) తగ్గటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు తేల్చారు.

మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలన్నీ మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కిందికే వస్తాయి. పాల పదార్థాలను రోజుకు రెండు సార్లు తినేవారిలో జీవక్రియ రుగ్మత 24% మేరకు తగ్గుతున్నట్టు బయటపడింది. అందుకే దీనిపై పెద్దఎత్తున ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిల్లోనూ ఇది రుజువైనట్లయితే తక్కువ ఖర్చుతోనే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులను తగ్గించుకునే కొత్త పద్ధతిగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.

ఇవీ చదవండి:చిన్నవయసులోనే గుండెపోటు.. సకాలంలో చికిత్సతో ప్రాణాలకు భరోసా!

అవయవాలన్నింటికీ మూలం గుండె.. దాని ఘోష అర్థం చేసుకోరూ..

ABOUT THE AUTHOR

...view details