తెలంగాణ

telangana

మునుగోడు సీటు కూసుకుంట్లకు వద్దు.. తెరాసలో బయటపడ్డ విభేదాలు

By

Published : Aug 10, 2022, 3:37 PM IST

trs

Differences between TRS leaders in Munugodu: ఉపఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో తెరాస నాయకుల మధ్య విబేధాలు బయట పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్ల తెరాస కీలక నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దని సీఎం కేసీఆర్​కు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. తెరాస శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్​లోని తన నివాసంలో ఇవాళ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

Differences between TRS leaders in Munugodu: మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి తెరాస నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేందుకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెరాస ముఖ్య నేతలు సంకేతాలిస్తున్నారు.

TRS survey report: గుత్తా సుఖేందర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్​ను నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయిలో వారి సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సర్వేలన్నీ కూసుకుంట్లకే ప్రాధాన్యమిచ్చాయని జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మంత్రి జగదీష్ రెడ్డి కూడా మొగ్గు చూపుతున్నారు.

Letter to KCR: ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు నేతల్లో అసంతృప్తి నెలకొంది. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ ఇటీవల సుమారు 12 మంది స్థానిక నాయకులు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా తెరాస గాలి వీచిన 2018 ఎన్నికల్లో కూసుకుంట్ల ఓడిపోయారని.. ఉపఎన్నికల్లో అభ్యర్థిని మార్చాలని నియోజక వర్గంలోని కొందరు నేతలు కోరుతున్నారు.

Meeting with Jagadeeshwar Reddy: ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతను మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ అప్పగించారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో జగదీష్ రెడ్డి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశయ్యారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు తదితర సుమారు ముప్ఫై మంది నాయకులు సమావేశానికి హాజరయ్యారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులకు జగదీష్ రెడ్డి చెప్పారు. అధిష్ఠానం ఖరారు చేసిన అభ్యర్థికి పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. టికెట్ ఎవరికి వచ్చినా.. భవిష్యత్తులో అందరికీ తగిన అవకాశాలు ఉంటాయని నచ్చచెప్పినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details