తెలంగాణ

telangana

Yadadri: 17న యాదాద్రికి కేసీఆర్.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!

By

Published : Sep 15, 2021, 12:05 PM IST

Yadadri temple reconstruction, cm kcr will visit yadadri

సీఎం కేసీఆర్ ఈనెల 17న యాదాద్రిలో పర్యటించనున్నట్లు యాడా వర్గాలు తెలిపాయి. చినజీయర్ స్వామితో ఆలయాన్ని పరిశీలించి... ప్రధానాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పనుల పూర్తిపై క్షేత్రస్థాయిలో సీఎం సమీక్షించనున్నారు.

దివ్యశోభను సంతరించుకున్న యాదాద్రి

ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) యాదాద్రిలో శుక్రవారం పర్యటించే అవకాశం ఉందని యాడా వర్గాలు తెలిపాయి. ఆలయ పునర్నిర్మాణ పనులు, ప్రధానాలయ ప్రారంభోత్సవ ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పంచ నారసింహుల దేవాలయాన్ని ప్రఖ్యాతి గాంచేలా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన సీఎం కేసీఆర్, చినజీయర్‌ స్వామితో కలిసి దివ్యశోభను సంతరించుకున్న యాదాద్రికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పనులు పరిశీలించిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి పలు సూచనలు, మార్పులు చేర్పులు చేయాలని ఆదేశించారు. ఆయా ఆదేశాలు ఏమేరకు అమలయ్యాయి? భక్తులకు స్వామివారి గర్భలాయ దర్శనాలు కల్పించేందుకు ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే అంశాలపై ముఖ్యమంత్రి యాడా అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణఁ

శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని విస్తరించి, మహా పుణ్యక్షేత్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్17న నిర్ణయించారు. నాటి నుంచి వెనకడుగేయకుండా... సంపూర్ణంగా కృష్ణశిలతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే అక్టోబరు లేదా నవంబర్‌లో గర్భాలయంలోకి భక్తులను అనుమతించాలని సీఎం యోచిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా జరపాల్సిన ఆచార వ్యవహారాలపై చినజీయర్ స్వామితో చర్చించనున్నారు. మహాయాగం, ఆలయం, రాజగోపురాలపై స్వర్ణ కలశాల ప్రతిష్ఠ పర్వాల నిర్వహణ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామిజీ పర్యటించనున్నారన్న సమాచారంతో స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన దారులు, గండి చెరువు ప్రాంగణంలోనే కాకుండా కొండపైన అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

పనులు తుది దశకు

కొండపైన నిర్మాణాల తీరు..

సరిగ్గా 84 రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత ఆయన దిశానిర్దేశంతో యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(YTDA)) పనుల్లో వేగం పెంచింది. కొండపైన హరి, హరుల ఆలయాల పునర్నిర్మాణాలు పూర్తికావడంతో తుది మెరుగులపై దృష్టిసారించింది. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఫ్లొరింగ్‌, ఉద్యానం పనులు పూర్తి చేయించింది. వార్షిక బ్రహ్మోత్సవ రథశాలకు షెట్టరు, కలశాలు బిగించారు. వీఐపీ లిఫ్టునకు శ్రీస్వామి, అమ్మవారి విగ్రహం, తిరునామాలతో హంగులు అద్దారు.

రహదారుల వెంట ముమ్మర పనులు
  • ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్‌లో యంత్రాలు బిగించారు. వాటిని రూ.13 కోట్ల వ్యయంతో ముంబయి, పుణె నుంచి రప్పించి, హరేరామ-హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయపాత్ర పర్యవేక్షణలో ఇటీవలే అమర్చారు. యంత్రాల పనితీరు పరిశీలనకు నిర్ణయించారు. తేదీ ఖరారు కావాల్సి ఉంది. విక్రయ కౌంటర్లు ఏర్పాటవుతున్నాయి.
  • దైవదర్శనాలకు సుమారు నాలుగు వేల మంది భక్తులు వేచిఉండేలా కింది అంతస్తు కలుపుకొని నాలుగు అంతస్తుల సముదాయాన్ని విస్తరించారు. ఉత్తర దిశలో మందిరం ఆకార హంగులతో తీర్చిదిద్దే పనులను వేగవంతం చేశారు. క్యూలైన్లను ఏర్పరిచారు.
    హరిత యాదాద్రి కోసం కసరత్తు
  • ఆలయం మాడ వీధిలో బంగారు వర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసల పనులు కొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి.
  • శివాలయం ప్రహరీ ఎత్తు తగ్గించి దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం వంకుల ఆకృతిలో విద్దుద్దీపాలు బిగించారు. ఎదురుగా స్వాగత తోరణం నిర్మితమైంది. పచ్చదనం పనులు జరుగుతున్నాయి. రథశాల నిర్మితమవుతోంది.
  • విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ కొనసాగుతోంది. బస్‌బే కోసం బండ తొలగింపు, చదును చేపట్టారు. మెట్లదారి నిర్మాణం నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:Yadadri: నయనానందకరం... భక్తులకు త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం

ABOUT THE AUTHOR

...view details