తెలంగాణ

telangana

సాగు పనులకు కూలీలు కొరత... ఆ రైతు ఏం చేశాడంటే..!

By

Published : Jul 4, 2022, 5:32 PM IST

Male laborers

వర్షాలు కురవడంతో.. రైతన్న సాగు పంటపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. సాగు పనులకు కూలీల కొరత ఏర్పడింది. సొంతూళ్లలో కూలీలు దొరక్కపోతే పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చుకుని... పని అయిపోయాక తిరిగి వాళ్ల ఊర్లలో దించిరావాలి. పైగా కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న హనుమకొండ జిల్లా రైతు వినూత్నంగా ఆలోచించి... వారితో వరినాట్లు వేయించారు. అతనేం చేశాడో చూద్దాం...

సాధారణంగా వరినాట్లు అనగానే అందరికీ ఆడవారు గుర్తుకొస్తారు. బురదమళ్లల్లో జానపద గేయాలు పాడుకుంటూ... సరదాగా వరి నాట్లు వేస్తుంటారు. అయితే ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురవడం.. ఇప్పటికే రైతులు వరినాట్లు వేస్తున్నారు. నాట్లు వేయడానికి మహిళా కూలీల కొరత ఉండటం వల్ల ఆ కొరతను అధిగమించడానికి ఇతర రాష్ట్రాల పురుష కూలీలను రప్పించుకుని మరీ నాట్లు వేయిస్తున్నారు. ఇది ఎక్కడో కాదండోయ్... హనుమకొండ జిల్లాలోనే.

ఉత్తరప్రదేశ్ పురుష కూలీలు

జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో వ్యవసాయ కూలీల కొరత అధికంగా ఉండటం వల్ల... ఆదిరెడ్డి అనే రైతు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురుష కూలీలను రప్పించి.. వారితో నాట్లు వేయిస్తున్నారు. నారు పీకిన దగ్గర నుంచి నాట్లు వేసే వరకు ఈ కూలీలే చూసుకుంటారని తెలిపారు. 3, 4 గంటల్లో 2 ఎకరాలకు పైగా పొలంలో నాట్లు వేస్తున్నారని చెప్పారు. దీనితో రైతులకు సమయం, డబ్బు రెండు ఆదా అవుతుందని హర్షం వ్యక్తం చేశారు.

వరినాట్లు వేస్తున్న పురుష కూలీలు

గతంలో ఇదే రెండు ఎకరాల్లో నాట్లు వేయడానికి 12 నుంచి 13వేల వరకు ఖర్చు వచ్చేదని.. ప్రస్తుతం ఎకరానికి 4వేల రూపాయలతో తక్కువ సమయంలో వేగవంతంగా పని పూర్తవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రం ఒకే దగ్గర ఉంటే... రోజుకు 6-8 ఎకరాల వరకు వరి నాట్లు వేసే సామర్థ్యం ఈ కూలీలకు ఉందని వెల్లడించారు. ఓవైపు వ్యవసాయ కూలీల కొరత ఉండగా... ఈ వలస పురుష కూలీలు వేగవంతంగా... అతి తక్కువ ఖర్చుతో పని చేస్తుండడం రైతులకు కలిసి వస్తోందని అంటున్నారు.

వరినాట్లు వేస్తోన్న ఉత్తరప్రదేశ్ వలస కూలీలు

తాము ఉత్తరప్రదేశ్ నుంచి 15 మంది బృందంగా వచ్చామని... ఒకటి, రెండు గంటల్లో ఎకరం వరకు నాట్లు వేస్తామని.. కూలీ డబ్బులు ఇవ్వడంతో పాటు.. భోజనం కూడా పెడుతున్నారని తెలిపారు.

సాగు పనులు చేస్తోన్న పురుష కూలీలు

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details